In how many years? ఇంకెన్నాళ్లో?
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:39 PM
In how many years? జిల్లాలో కీలకమైన 516 బి(పెందుర్తి- బొడ్డవర) జాతీయ రహదారి విస్తరణ ఆలస్యమవుతోంది. మొదట్లో హడావుడి చేసిన అధికారులు తర్వాత నెమ్మదయ్యారు. రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు ఏడాది కిందట పరిహారం చెల్లిస్తామన్నారు. సర్వే చేసి వివరాలు నమోదు చేసుకున్నారు. అక్కడితో ఆగిపోయారు. మరోవైపు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఈ రోడ్డు విస్తరించక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇంకెన్నాళ్లో?
పెందుర్తి-బొడ్డవర రోడ్డు విస్తరణలో జాప్యం
ఏడాది కిందటే పరిహారం చెల్లింపునకు సర్వే
అభివృద్ధికి అడుగులు పడక ప్రయాణికులకు అవస్థలు
జిల్లాలో కీలకమైన 516 బి(పెందుర్తి- బొడ్డవర) జాతీయ రహదారి విస్తరణ ఆలస్యమవుతోంది. మొదట్లో హడావుడి చేసిన అధికారులు తర్వాత నెమ్మదయ్యారు. రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు ఏడాది కిందట పరిహారం చెల్లిస్తామన్నారు. సర్వే చేసి వివరాలు నమోదు చేసుకున్నారు. అక్కడితో ఆగిపోయారు. మరోవైపు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఈ రోడ్డు విస్తరించక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
శృంగవరపుకోట, మార్చి 4(ఆంధ్రజ్యోతి):
516 బి(పెందుర్తి- బొడ్డవర) జాతీయ రహదారి కోసం నాలుగు మండలాల పరిధిలో 204.55 ఎకరాల జిరాయితీ, ప్రభుత్వ భూమిని సేకరించారు. నష్టపరిహారం అందించేందుకు యజమాను లను గుర్తించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఇప్పటికీ వారికి పరిహారం అందించకపోవడంతో జాతీయ రహదారి అభివృద్ధి అలస్యమవుతోంది. నిధులున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఇటు ప్రయాణికులకూ అవస్థలు తప్పడం లేదు. విశాఖపట్నం నుంచి పెందుర్తి వరకు దశాబ్దన్నర క్రితమే నాలుగు రోడ్లుగా విస్తరించారు. అక్కడి నుంచి ఎస్.కోట మండలం బొడ్డవర వరకు ఈ రోడ్డును విస్తరించకుండా వదిలేశారు.
విశాఖ నుంచి అరకు పర్యాటక ప్రాంతానికి ఇదే ప్రధాన రహదారి కావడంతో అప్పటి నుంచి ఈ రోడ్డును విస్తరించాలని స్థానికులతో పాటు ప్రయాణికుల నుంచి డిమాండ్ ఉంది. 2014- 2019లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఈ రోడ్డు విస్తరణ కోసం కేంద్రం దృష్టిలో పెట్టింది. జాతీయ రోడ్లు, భవనాల శాఖ నిధులు కేటాయించే సమయంలో ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారం చేపట్టింది. ఆ ప్రభుత్వం ఏటా డిసెంబర్ నెలలో విస్తరణ పనులు చేపడుతున్నామని ప్రకటనలతో సరిపెట్టింది. ఐదేళ్లు పూర్తయినా విస్తరణకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శృంగవరపుకోట వచ్చిన చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా ఈ రోడ్డును ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వం గుంతలను కూడా పూడ్చడం మానేసిందంటూ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విస్తరణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం విస్తరణపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఏడాది క్రితమే రూ.782.91 కోట్ల అంచనాతో టెండర్‌లు ఖరారయ్యాయి. టీటీ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ ఈ టెండర్‌ను దక్కించుకున్నట్లు జాతీయ రహదారుల శాఖ అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. భూములు ఇచ్చిన రైతుల ఖాతాలో పరిహారం సొమ్ము జమకావాల్సి ఉంది. ఈ పక్రియ పూర్తికాకపోవడంతో రోడ్డు విస్తరణ పనులకు మూహూర్తం ఎప్పటికి ఖరారవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
బొర్రా గృహాలకు వెళ్లాలన్నా..
విశాఖ-అరకు రోడ్డులోని పెందూర్తి నుంచి బొడ్డవరకు వున్న ఈ రోడ్డులో ఒకటెండ్రు కిలోమీటర్లు దూరం మాత్రమే పెందూర్తి నియోజకవర్గ పరిధిలో ఉంది. మిగిలిన దాదాపు 40 కిలోమీటర్ల వరకు శృంగవరపుకోట నియోజకవర్గ పరిఽధిలోకి వస్తుంది. కొత్తవలస మండలం చింతల పాలెం నుంచి బొడ్డవరకు వరకు శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. జాతీయ రహదారి -516బిగా పిలుస్తున్న ఈ రోడ్డు పర్యాటక ప్రాంతం బొర్రా గృహాలకు వెళ్లేందుకు ప్రధాన రహదారి.
భూములు సేకరించిన గ్రామాలు
శృంగవరపుకోట మండలం తెన్నుబొడ్డవర, కిల్తంపాలెం, కుమరాం, కాపుసోంపురం, ఎస్.కోట, దాంపురం, కొత్తూరు, బాలకృష్ణరాజపురం.. వేపాడ మండలంలోని బొద్దాం, పాటూరు.. లక్కవరపుకోట మండలం సీతారాంపురం, గంగుబూడి, మల్లివీడు, రంగారాయపురం, రంగాపురం, లక్కవరపుకోట... కొత్తవలస మండలం ఉత్తరాపల్లి, దత్తి, వీరభంద్రపురం, నిమ్మలపాలెం, మల్లివీడు, ఎంఆర్‌పురం, చింతలపాలెం, తుమ్మకాపల్లి, కొత్తవలస గ్రామాల నుంచి భూములు సేకరించారు.
మూడు బైపాస్‌లు
ఈ రోడ్డుకు మూడు బైపాస్‌లు ఇస్తున్నారు. కొత్తవలస మండలం చింతలపాలెం నుంచి అప్పన్నపాలెం జిందాల్ పాఠశాల వద్ద తిరిగి ఈ రోడ్డును కలిసేలా ఓ బైపాస్, శృంగవరపుకోట మండలం వెంకటరమణ పేట కూటలి సమీపం నుంచి కాపుసోంపురం సమీపంలో కలిసేలా మరో బైపాస్, బొడ్డవర కూడలి సమీపంలో భవానీ నగర్ నుంచి అరకు నుంచి తాటిపూడి మీదుగా విజయనగరం సమీపం వరకు వున్న 516ఈ .జాతీయ రహదారిను కలిపేలా ఇంకో బైపాస్ రోడ్డును నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు. నాలుగు వరసలుగా నిర్మించనున్న ఈ రోడ్డు విస్తరణతో పాటు మూడు బైపాస్ రోడ్లకు అవసరమైన స్థల సేకరణ బాధ్యతలను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. స్థల సేకరణకు 2024 నవంబర్ నెలలో త్రీజీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. భూముల వివరాలను సేకరించారు. రైతులు, ప్రైవేటు ఆస్తుల యజమానులు 90శాతం వరకు అంగీకరించారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
మండలాల వారీగా సేకరించిన భూములు (త్రీజీ నోటీఫికేషన్ ప్రకారం)
-------------------------------------------
మండలం సేకరించిన భూమి (ఎకరాల్లో)
----------------------------------------------------
శృంగవరపుకోట 75.19
వేపాడ 8.92
లక్కవరపుకోట 36.06
కొత్తవలస 84.36
------------------------------------------