Share News

In addition, you have to give! అదనంగా ఇచ్చుకోవాల్సిందే!

ABN , Publish Date - Apr 16 , 2026 | 01:19 AM

In addition, you have to give! నగరానికి చెందిన ఓ గర్భిణి ఏడు నెల వరకూ ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గరలో వున్న ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందింది,

In addition, you have to give! అదనంగా ఇచ్చుకోవాల్సిందే!
ఎన్టీఆర్‌ వైద్య సేవ స్టాల్‌

అదనంగా ఇచ్చుకోవాల్సిందే!

ఎన్టీఆర్‌ వైద్యసేవలో దోపిడీ పర్వం

నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో కాసులకు కక్కుర్తి

అల్లాడుతున్న రోగులు

పట్టించుకోని అధికారులు

- నగరానికి చెందిన ఓ గర్భిణి ఏడు నెల వరకూ ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గరలో వున్న ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందింది, ప్రతి నెల పరీక్షల పేరిట రూ.6 వేల వరకూ వసూలు చేసిన యాజమాన్యం తీరా ప్రసవ సమయానికి ఎన్టీఆర్‌ వైద్య సేవ (ఆరోగ్య శ్రీ)తో సంబంధం లేకుండా అదనంగా మరో రూ.40 వేలు కట్టాలని ఖరాఖండీగా తేల్చి చెప్పారు. దగ్గరలోని మరో ఆసుపత్రిని సంప్రదించినా అక్కడ కూడా రూ.20 వేలు డిమాండ్‌ చేయడంతో ఆ దంపతులు విస్మయానికి గురయ్యారు.

- బిడ్డ పుట్టిన వెంటనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందని ఓ తండ్రిని భయపెట్టి ఆసుపత్రి నిర్వాహకులు శిశువును ఐసీయూలో చేర్చారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ కార్డు ఉన్నప్పటికీ, స్పెషల్‌ మెడిసిన్‌ పేరుతో నాలుగు రోజులకు రూ.30 వేల వరకూ అదనంగా వసూలు చేశారు.

- కాలు విరిగిన ఓ కార్మికుడు నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి చికిత్సకు వెళితే.. ప్రభుత్వం ఇచ్చే స్టీల్‌ రాడ్లు త్వరగా విరిగిపోతాయని నాణ్యమైన రాడ్లు వేయాలంటే రూ.30 వేలు అదనంగా కట్టాలని ఆసుపత్రి యాజమాన ్యం నమ్మించింది. గత్యంతరం లేక సదరు కార్మికుడు అప్పు తెచ్చి ఆసుపత్రికి చెల్లించి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.

- గుండె ఆపరేషన్‌ కోసం ఎన్టీఆర్‌ వైద్య సేవ కార్డుని పట్టుకుని వెళితే, ప్యాకేజీ కాకుండా అదనంగా రూ.30 వేలు కట్టమన్నారని, అప్పు తెచ్చి ఆసుపత్రికి చెల్లించాల్సి వచ్చిందని, ఉచితం అన్న మాటకే అర్థం లేకుండా పోయిందని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

విజయనగరం రింగురోడ్డు, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి):

పేదలకు అండగా నిలవాల్సిన డాక్టరు ఎన్టీఆర్‌ వైద్యసేవ (ఆరోగ్య శ్రీ) ప్రైవేటు ఆసుపత్రుల పాలిట కాసుల వర్షం కురిపిస్తోంది. పూర్తిగా ఉచితమన్న ప్రభుత్వ హామీ ప్రకటనలకే పరిమితమౌతోంది. జిల్లాలోని పలు కార్పొరేట్‌, నెట్‌వర్క్‌ ఆసుపత్రులు నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నాయి. శస్త్ర చికిత్సకు అవసరమైన రోగి వచ్చాడంటే చాలు.. రకరకాల సాకులతో వారి నుంచి వేల రూపాయలు పిండికుంటున్నాయి. ప్రభుత్వ ప్యాకేజీలో ఇచ్చే స్టంట్లు లేదా ఇంప్లాట్లు నాణ్యత తక్కువగా ఉంటాయని, నాణ్యమైన పరికరాలు కావాలంటే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ అదనంగా చెల్లించాలని రోగులను భయపెడుతున్నాయి. ఎన్టీఆర్‌ వైద్య సేవ కేసు నమోదు కాకముందు చేసే రక్తపరీక్షలు, స్కాన్‌ల ఖర్చులను పథకంలో చేర్చకుండా రోగుల నుంచే వసూలు చేస్తున్నారు. తీరా ఆపరేషన్‌ అయ్యాక వాటిని కూడా బిల్లులో చేర్చి ప్రభుత్వ సొమ్మును దండుకుంటున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.

- ప్యాకేజీలో మందులు కలిపి వున్నప్పటికీ, కొన్ని మందులు బయట నుంచి తెచ్చుకోవాలంటూ చీటీలు రాసిచ్చి పేదలను ఆర్థికంగా కుంగదీస్తున్నారు.

- నర్సింగ్‌ చార్జీలు, ఫీజులు పేరిట ప్రత్యేక బిల్లులు సృష్టించి డిశ్చార్జి సమయాల్లో బాధితులపై ఒత్తిడి తెస్తున్నారు.

- సాధారణ ప్రసవం సాధ్యమయినా.. బిడ్డ ప్రాణానికి ప్రమాదం అంటూ సిజేరీయన్‌ చేయిస్తున్నారు. ఆ తరువాత ప్యాకేజీ లేదంటూ రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేసిన ఘటనలు ఉన్నాయి.

- పుట్టిన బిడ్డకు ఐసీయూ అవసరం లేదన్నా, జాగ్రత్త కోసం అంటూ నియోనేటనల్‌ కేర్‌లో వుంచి రోజుకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.

నిఘా ఏదీ?

జిల్లాలో డాక్టరు ఎన్టీఆర్‌ వైద్య సేవలో 34 నెట్‌వర్క్‌ ఆసుపత్రులు వున్నాయి. ఇందులో ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆసుపత్రులు 25, ప్రభుత్వ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు 9 వున్నాయి. ఈ పథకం ద్వారా 1,619 వ్యాధులకు చికిత్స నిర్వహిస్తున్నారు. అయితే నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో క్షేత్రస్థాయిలో తనిఖీలు లేకపోవడంతో కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్‌ ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రతి నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో రోగులకు సహాయం చేయడానికి ఆరోగ్య మిత్రలు వుంటారు. కాని వీరు ఆసుపత్రి యాజమాన్యాలకే అనుకూలంగా వ్యవహారిస్తున్నారన్న ఆరోపణలు వున్నాయి. జిల్లా యంత్రాంగం తనిఖీలు కేవలం కాగితాలకే పరిమితమౌతున్నాయి. ఫిర్యాదు చేయడానికి వెళితే, పధకంలో ఆ సౌకర్యం లేదు. అందుకే వారు వసూలు చేశారని అధికారులు సమాధానం ఇవ్వడం గమనర్హం.

చర్యలు తప్పవు

డాక్టరు సాయిరాం, డాక్టరు ఎన్టీఆర్‌ వైద్య సేవ కో-ఆర్డినేటర్‌

నిబంధనల ప్రకారం నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో రోగులకు పూర్తి ఉచితంగా వైద్యం అందించాలి. ఎక్కడైనా అదనపు వసూళ్లకు పాల్పడితే ఉపేక్షించం. శస్త్ర చికిత్సలకు అవసరమైన మందులు, పరికరాలు అన్ని ప్యాకేజీలో ఉంటాయి. నాణ్యత సాకుతో రోగులను భయపెట్టి డబ్బులు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధం. బాధితులు ఎవరైనా ఇటువంటి దోపిడీకి గురైతే 104 హెల్ప్‌లైన్‌ నెంబరుకు లేదా జిల్లా కార్యాలయానికి రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదులపై తక్షణమే విచారణ జరిపి అక్రమాలు రుజువైతే ఆ ఆసుపత్రులపై భారీ జరిమానాలు విధిస్తాం. నెట్‌వర్క్‌ గుర్తింపు రద్దు చేయడానికి రాష్ట్ర ట్రస్టుకు సిఫార్సు చేస్తాం.

Updated Date - Apr 16 , 2026 | 01:19 AM