Share News

In a State of Fear! బిక్కుబిక్కుమని!

ABN , Publish Date - Aug 10 , 2026 | 11:43 PM

In a State of Fear! జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి దయనీయంగా మారింది. కొన్ని శిథిలావస్థలో ఉంటే... మరికొన్ని అద్దె గృహాల్లో నడుస్తున్నాయి. దీంతో ఉద్యోగులు, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మన్యం జిల్లాగా ఏర్పడిన నాటి నుంచి సింహభాగం ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.

In a State of Fear!  బిక్కుబిక్కుమని!
శిథిలావస్థలో వట్టిగెడ్డ ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అధికారి కార్యాలయం

  • దయనీయ స్థితిలో ప్రభుత్వ కార్యాలయాలు

  • కూలిపోయే దశలో ఉన్న భవనాలు 40 శాతం పైనే..

  • అద్దె కొంపల్లో వసతులు కరువు

  • వర్షం పడితే చాలు.. రెట్టింపవుతున్న బాధలు

  • జిల్లా ఆవిర్భావం నుంచి ఇదే పరిస్థితి

  • ఉద్యోగులు, ప్రజలకు తప్పని అవస్థలు

జియ్యమ్మవలస, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి దయనీయంగా మారింది. కొన్ని శిథిలావస్థలో ఉంటే... మరికొన్ని అద్దె గృహాల్లో నడుస్తున్నాయి. దీంతో ఉద్యోగులు, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మన్యం జిల్లాగా ఏర్పడిన నాటి నుంచి సింహభాగం ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఉన్నా అవి పూర్తిగా శిఽథిలావస్థకు చేరుకున్నాయి. ఇదిలా ఉండగా పలుచోట్ల ఎంపీడీవో కార్యాలయాలు, పశువైద్యశాలలు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. రేపో మాపో కూలిపోయే భవనాలు జిల్లాలో 40 శాతం పైనే ఉన్నాయి. వర్షాలు పడితే చాలు.. శ్లాబు నుంచి వర్షపు నీరు నేరుగా కార్యాలయాల్లోకి చేరుతుంది. ఆ సమయంలో ఉద్యోగుల బాధలు మరింత రెట్టింపవుతున్నాయి.

జిల్లాలో పశు సంవర్థకశాఖకు సంబంధించి మొత్తం 80 భవనాలు ఉండగా, ఇందులో 26 కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా మరో 43 భవనాలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. నీటి పారుదలశాఖకు సంబంధించి జిల్లాలో మీడియం, మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కార్యాలయాలు కూడా కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. వర్షం పడితే చాలు కార్యాలయాల్లోకి నీరు చేరుతుంది. శ్లాబుల నుంచి కూడా వర్షపునీరు లీకవుతుండగా.. క్వార్టర్లు శిఽథిలమైపోయాయి. వర్షం పడితే చాలు.. జియ్యమ్మవలస ఎంపీడీవో కార్యాలయంలో గదులన్నీ కారిపోతున్నాయి. శ్లాబు చిమ్ముతూ గచ్చంతా చిత్తడిగా తయారవుతుంది. కంప్యూటర్లు, విలువైన రికార్డులపై టార్పాలిన్లు కప్పుకోవాల్సిన దుస్థితి. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయిన ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్పైజ్‌ శాఖలో సర్కిల్‌ కార్యాలయాలు కూడా చాలావరకు అద్దె గృహాల్లోనే నడుస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించి నూతన భవనాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల ఉద్యోగులు కోరుతున్నారు.

శిథిలావస్థలోనే..

చినమేరంగి, జియ్యమ్మవలసలో పశు వైద్యశాలల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. గోడలు బీటలు వారాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.

- ఎన్‌.మునికుమార్‌బాబు, పశు వైద్యాధికారి, జియ్యమ్మవలస మండలం

Updated Date - Aug 10 , 2026 | 11:43 PM