పొంచిఉన్న ప్రమాదం
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:01 PM
విజయనగరం పట్టణంలోని పీడబ్ల్యూ (ప్రిన్స్ వాలిస్) మార్కెట్‌లో షామిల్లులు, టింబర్ డిపోలు విస్తరిస్తున్నాయి.
- పీడబ్ల్యూ మార్కెట్‌లో విస్తరిస్తున్న సామిల్లులు
- వెలువడుతున్న రంపపు పొట్టు, బూడిద
- మంటలు అంటుకుంటే పరిస్థితేంటి?
- స్థానికులకు తప్పని ఇబ్బందులు
- కలప అనధికార దిగుమతులు
విజయనగరం క్రైం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): విజయనగరం పట్టణంలోని పీడబ్ల్యూ (ప్రిన్స్ వాలిస్) మార్కెట్‌లో షామిల్లులు, టింబర్ డిపోలు విస్తరిస్తున్నాయి. కలప మిల్లులకు ఆనుకుని డిపోలు, కార్పెంటరీ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడం ఆందోళన కలిగిస్తుంది. వీటివల్ల ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఇతర వ్యాపారులతో పాటు కొనుగోలుదారుల్లో కలవరం నెలకొంది. పీడబ్ల్యూ మార్కెట్‌కు పశ్చిమాన ఉన్న పెద్ద చెరువుకు అభిముఖంగా సామిల్లులు, కలప మిల్లులు నడుస్తున్నాయి. వీటి యాజమానులు, నిర్వహకులను సాటి వ్యాపారులనే కోణంలో చూసి ఇప్పటి వరకూ ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. వాటి సంఖ్య ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో ఇతర వ్యాపార వర్గాల్లో అలజడి మొదలైంది. ఇక్కడ నిత్యం లక్షలాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఇటువంటి మిల్లుల్లో విద్యుత్ ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు సహజమైనందున తాజాగా వారిలో గుబులు కన్పిస్తోంది. ఆయా మిల్లుల్లో దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే, దాని ప్రభావం చుట్టూ ఉన్న ఇతర దుకాణాలు, వ్యాపార సముదాయాలపై ఖచ్చితంగా పడుతుందని, తద్వారా భారీ నష్టం సంభవిస్తుందని భీతిల్లుతున్నారు. ఇక్కడ కలపను కోత వేయించి రవాణా చేసేది కొందరైతే, జీఎస్టీ నుంచి తప్పించుకునేందుకు వాటికి తరిమి పట్టించి ఇక్కడ నుంచి ఎగుమతి చేసేవారు మరికొంతమంది. కలప రూపంలో తరలిస్తే స్థానిక ప్రభుత్వానికి ఒక శాతం, పొరుగు రాష్ట్రాలకు తరలిస్తే 15 శాతం జీఎస్టీ చెల్లించాలి. అదే కలపను వస్తురూపంలో తరలిస్తే జీఎస్టీ మినహాయింపుతో పాటు పెద్దగా ఆటంకాలు ఉండవు. అందుకని వస్తురూపంలో తరలింపునకు ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు. మిల్లుల యాజమానులకు అటవీశాఖలోని కొందరి సిబ్బందికి మధ్య ఉండే అవగాహన వల్ల చెట్లను నరికి, ఇక్కడకు తెచ్చి కోత చేసి ఎగుమతులు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
ప్రజారోగ్యంపై ప్రభావం
సామిల్లుల నుంచి వెలువడుతున్న బూడిద, రంపపు పొట్టు స్థానికంగా నివాసం ఉంటున్న వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. శ్వాసకోస వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులకు వారు గురవుతున్నారన్న అభిప్రాయం నెలకొంది. సామిల్లులకు ఆనుకుని కొన్ని దుణాలు, రెస్టారెంట్లు, హోటల్స్ ఉన్నాయి, వాటికి ఆనుకుని బంగారం, బట్టలు, ప్లాస్టిక్ షాపులు, బేకరీలు నడుపుతున్నారు. కొందరూ హోటళ్ల నిర్వహణకు కట్టెల పొట్టును వినియోగిస్తున్నారు. అనుకోకుండా నిప్పు రవ్వలు ఎగిసిపడితే, ప్రమాదం ఊహించలేం. ఆస్తినష్టం అంచనా వేయలేని పరిస్థితి నెలకొంటుంది. ఇక్కడ సామిల్లులు, కార్పంటరీ షాపులను జనవాసాలకు దూరంగా తరలించి వారికి భూమి కేటాయిస్తే ఇబ్బంది ఉండదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్రమాదాలు- ప్రజారోగ్యం ప్రభావం వంటి వాటిపై ఫిర్యాదులు వెళ్తున్న అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొన్నిసార్లు ‘మామూళ’్లగా వచ్చి తనిఖీలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.