Share News

తుఫాన్‌తో అపార నష్టం

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:37 AM

: ఆర్నాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.

తుఫాన్‌తో అపార నష్టం
వంగర:అరసాడ రోడ్డు కొట్టుకుపోయిన దృశ్యం

- ఈదురు గాలులు, భారీ వర్షంతో వణికిన జిల్లా

- పొంగి ప్రవహిస్తున్న నదులు, వాగులు, వంకలు

- నీట మునిగిన పంట పొలాలు

- దెబ్బతిన్న రహదారులు

- విద్యుత్‌ శాఖకు రూ.20లక్షల నష్టం

విజయనగరం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఆర్నాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. నదులు, గెడ్డలు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల రోడ్లపైకి వరద చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈదురుగాలులకు విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. జిల్లా వ్యాప్తంగా 200కు పైగా విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. 40 ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురయ్యాయి. రూ.20 లక్షల నష్టం వాటిల్లింది. చీపురుపల్లి, రాజాం, తెర్లాం, భోగాపురం తదితర చోట్ల ఎక్కువగా నష్టం ఏర్పడింది. పలుచోట్ల విద్యుత్‌ లైన్లపై చెట్లు పడటంతో సరఫరాకు అంతరాయం కలిగింది. విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ లక్ష్మణరావు పర్యవేక్షణలో సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పనులు జరిపారు. విద్యుత్‌ శాఖ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1912 ఏర్పాటు చేసింది.

-సంతకవిటి మండలంపై తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపింది. వేలాది ఎకరాల వరి పైరు నీటమునిగింది. వరదల కారణంగా అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 24గంటలకు పైగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగింది. దీంతో ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి.

- జిల్లాలో ఆర్‌అండ్‌బీ రోడ్లు ఎక్కువగా కోతకు గురయ్యాయి. తెర్లాం, గజపతినగరం, సంతకవిటి మండలాల్లోని జగనన్న కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మరమ్మతులకు సుమారు రూ.15 కోట్లు తక్షణ అవసరం అని అధికారులు అంచనా వేశారు. జిల్లా కేంద్రం విజయనగరంలో మంచినీటి సరఫరా నిలిచిపోయింది. నెల్లిమర్లలోని పంప్‌ హౌస్‌ నుంచి నగరానికి నీటి సరఫరా జరుగుతుంది. నీరు రంగుమారడంతో గురువారం నుంచి సరఫరాను నిలిపివేశారు.

-గజపతినగరం, తెర్లాం, మెరకముడిదాం, మెంటాడ, నెల్లిమర్ల, చీపురుపల్లి మండలాల్లో మొక్కజొన్న పంటకు నష్టం జరిగింది. రామభద్రపురం, గజపతినగరం, నెల్లిమర్లలో 67 హెక్టార్లలో పత్తి పంటలోకి నీరు చేరింది. ప్రస్తుతం వరద ఎక్కువగా ఉంది. అది తగ్గితే కానీ నష్టం అంచనాలు మొదలెట్టలేమని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

- ఉద్యాన పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. చీపురుపల్లి, గరివిడి, వంగర, పూసపాటిరేగ, డెంకాడ, మెరకముడిదాం, బొబ్బిలి, రేగిడి, నెల్లిమర్ల మండలాల్లో సుమారు 200 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. 150 ఎకరాల్లో అరటి, 60 ఎకరాల్లో బొప్పాయి పంట మునిగింది. సుమారు రూ.6 కోట్ల వరకు నష్టం జరిగి ఉంటుందని ఉద్యానవన శాఖ డీడీ చిట్టిబాబు తెలిపారు.

తీరిన నీటి కరువు..

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొంది. జూన్‌ నుంచి ఆగస్టు వరకు కనీస స్థాయిలో కూడా వర్షపాతం నమోదు కాలేదు. అయితే, తుఫాన్‌ కారణంగా జిల్లాలో మూడు రోజుల పాటు కరువు తీరా వాన పడింది. దీంతో వంగర, రేగిడి, సంతకవిటి, భోగాపురం మండలాలు మినహా అన్ని మండలాల్లో కూడా వర్షపాతం సాధారణ స్థితికి చేరుకుంది. వంగర మండలంలో 31 మిల్లీ మీటర్లు, రేగిడిలో 32 మి.మీ, సంతకవిటిలో 46 మి.మీ, భోగాపురంలో 20 మిల్లీ మీటర్ల వర్షపాతం లోటు ఉందని గణాంకాలు చెబుతున్నాయి. మిగతా మండలాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది. మూడు రోజులపాటు కురిసిన వర్షాలతో గత మూడు నెలలుగా ఉన్న లోటును అధిగమించింది.

Updated Date - Sep 26 , 2026 | 12:37 AM