పాముకాటు బాధితులకు తక్షణ వైద్యమే రక్షణ
ABN , Publish Date - Sep 19 , 2026 | 11:16 PM
పాముకాటుకు గురైన వారికి తక్షణ వైద్యంతోనే ప్రాణానికి రక్షణ ఉంటుందని డీఎంహెచ్‌వో జీవనరాణి అన్నారు.
- అన్ని ఆస్పత్రుల్లో యాంటీ స్నేక్ వెనమ్ వ్యాక్సిన్‌లు ఉన్నాయి
- జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జీవనరాణి
విజయనగరం రింగురోడ్డు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పాముకాటుకు గురైన వారికి తక్షణ వైద్యంతోనే ప్రాణానికి రక్షణ ఉంటుందని డీఎంహెచ్‌వో జీవనరాణి అన్నారు. అంతర్జాతీయ పాము కాటుపై అవగాహన దినోత్సవం సంద ర్భంగా శనివారం డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ఆమె జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాము కాటు బాధితులకు అవసరమయ్యే యాంటీ స్నేక్ వెనమ్ వ్యాక్సిన్ జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగిన నిల్వలు ఉన్నాయ న్నారు. అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనానికి సమాచారం అందిస్తే, బాధితుడికి మార్గమధ్యలోనే ప్రథమ డోస్ వ్యాక్సిన్ ఇంజక్షన్ అందిస్తారని తెలిపారు. ముఖ్యంగా పాము కాటుకు గురైన వ్యక్తికి నాటు వైద్యం చేయించడం, మంత్రగాళ్లు లేదా పాములు పట్టే వారి వద్దకు తీసుకువెళ్ల వద్దన్నారు. గాయాలపై ఆకు పసరలు, మట్టిని పూయకుండా తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలన్నారు. ఇంటి పరిసరాల్లో పాములు రాకుండా ఉండేందుకు పొదలు, చెత్తాచెదారం, చీమల పుట్టలు లేకుండా ఉంచుకోవాలన్నారు. ఇళ్ల ల్లో ఎలుకలు లేకుండా చూసుకోవడం ద్వారా పా ములు రాకుండా నిరోధించవచ్చునన్నారు. రాత్రి పూట పొలం పనులకు వెళ్లే రైతులు తప్పనిసరిగా గమ్ బూట్లు ధరించాలని, టార్చ్‌లైట్లు, చేతికర్రను వినియోగించాలని అన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.