ఓపీ ఫీజు చూస్తే దడ
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:33 PM
జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు రోగులను దోచుకుంటున్నాయి. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగుల నుంచి డబ్బులు పిండేస్తున్నాయి.
- రూ.500 నుంచి రూ.వెయ్యి వసూలు
- అత్యవసర సేవలకు అదనం
- అవసరం లేకపోయినా పరీక్షలు
- ల్యాబ్‌ల్లో అనుభవం లేని సిబ్బంది
- కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ
- రాజాంలో ఓ పేరుమోసిన కార్డియాలజిస్టు ఉన్నారు. ఆయన వద్ద వైద్యసేవలు పొందాలంటే ఓపీకి రూ.500 కట్టాల్సిందే. ఆపై వైద్య పరీక్షలు, మందులు అదనం. అయితే గుండె సంబంధిత వ్యాధులకు గురైన వారు 15, 20 రోజులకు వస్తుంటారు. ఇలా వచ్చిన ప్రతిసారి రూ.500 ఓపీ ఫీజు తీసుకోవాల్సిందే. లేకుంటే మాత్రం అక్కడి సిబ్బంది ఊరుకోరు. ఇదేంటని అడిగితే ఇష్టం ఉంటే రండి.. లేకుంటే వెళ్లిపోండి అని సమాధానం చెబుతారు.
- రాజాంలో పేరుమోసిన చిన్నపిల్లల ఆస్పత్రి ఉంది. శ్రీకాకుళం, మన్యం జిల్లాల నుంచి కూడా తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడకు తెస్తుంటారు. నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడ ఓపీ ఫీజు గతంలో రూ.400 ఉండేది. ఇటీవల దానిని రూ.500కు పెంచారు. అది తెలియని చాలామంది రూ.400 ఇస్తుంటే అక్కడ సిబ్బంది రుసరుసలాడుతున్నారు. ఓపీ రేటు పెంచామని చెబుతున్నారు.
జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు రోగులను దోచుకుంటున్నాయి. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగుల నుంచి డబ్బులు పిండేస్తున్నాయి. ఓపీ ఫీజు నుంచి మొదలుపెట్టి రక్త పరీక్షలు, స్కానింగ్, ఈసీజీ అంటూ అవసరం లేకపోయినా వివిధ పరీక్షల పేరిట రోగుల జేబులను గుల్ల చేస్తున్నాయి. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన తరువాత రూమ్ ఫీజు అని, ఐసీయూ గది చార్జీ అని, డాక్టర్ రౌండ్స్ ఫీజు అంటూ ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా అవుట్ పేషెంట్ (ఓపీ) ధరలు చూస్తే రోగులకు బీపీ వచ్చినంత పని అవుతోంది. జాతీయ వైద్యమండలి నిబంధనలను పాటించడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి.
రాజాం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో అవుట్ పేషెంట్ (ఓపీ) ఫీజును అమాంతం పెంచేశారు. గతంలో చాలా ఆస్పత్రుల్లో ఓపీ టిక్కెట్ ధర రూ.200 ఉండేది. సామాన్యులకు కొంత అందుబాటులో ఉండేది. కానీ, కొవిడ్ తరువాత పూర్తి పరిస్థితి మారింది. రూ.500 వరకూ పెంచేశారు. అత్యవసర విభాగాలకు సంబంధించి ఓపీ అయితే రూ.700 నుంచి గరిష్ఠంగా రూ.1000 వరకూ పెంచేశారు. అత్యవసర సేవలు అంటే మరీ అదనం. ఇది కేవలం ఓపీ వరకూ మాత్రమే. ఇక సాధారణ ఐసీయూ గది రోజుకు రూ.4వేలు అద్దె వసూలు చేస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన రోగులను ఉదయం, సాయంత్రం వేళలో రౌండ్స్‌లో డాక్టర్ తనిఖీ చేసేందుకు రూ.2వేల వరకూ తీసుకుంటున్నారు.
తగ్గించేశారు..
గతంలో ఓపీ టోకెన్ కాలపరిమితి 15 రోజుల వరకూ ఉండేది. ఈ వ్యవధిలో రెండుసార్లు ఆస్పత్రికి వెళ్లినా ఓపీ ఫీజు వసూలు చేసేవారు కాదు. కానీ ఇప్పుడు వారం రోజుల కాలపరిమితికి మాత్రమే ఓపీ అందిస్తున్నారు. పది రోజులకు తగ్గట్టు మందులు అందించి వాటిని వాడిన తరువాత మళ్లీ రావాలని సూచిస్తున్నారు. దీంతో ఆ టోకెన్ చెల్లుబాటు కావడం లేదు. మళ్లీ డబ్బులు కట్టి టోకెన్ పొందాల్సి వస్తోంది. దీనిపై రోగి బంధువుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక టోకెన్‌తో రెండుసార్లు వైద్యం అందేదని.. ఇప్పడు టోకెన్ ధర పెరిగినా.. ఒకసారికి మాత్రమే పరిమితమవుతుందని వాపోతున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇది..
జిల్లాలో కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు 100 వరకూ ఉన్నాయి. బొబ్బిలి, రాజాం, చీపురుపల్లి, ఎస్.కోట, కొత్తవలస, గజపతినగరం, నెల్లిమర్ల తదితర మండల కేంద్రాలతో కలిపి మరో 100 ఆస్పత్రుల వరకూ ఉంటాయని అంచనా. జాతీయ వైద్యమండలి నిబంధనల ప్రకారం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ, వైద్య పరీక్షల ధరలకు సంబంధించి అన్ని వివరాలతో రోగులకు తెలిసేలా బోర్డులు పెట్టాలి. అందులో పొందుపరిచిన మాదిరిగానే వసూలు చేయాలి. కానీ, జిల్లాలో చాలావరకూ ఆస్పత్రుల్లో ఇటువంటి బోర్డులు కనిపించవు. ఓపీలో భాగంగా రోగికి కచ్చితంగా పది నిమిషాలు పరీక్షలు చేయాలి. వారి నుంచి అన్ని వివరాలు సేకరించాలి. కానీ, ఇలా నాడిపట్టి.. అలా వదిలేస్తున్నారు. కనీసం రోగి అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. కొన్ని ఆస్పత్రుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకూ.. సాయంత్రం 6 నుంచి రాత్రి వరకూ వందలాది మందిని ఓపీ చూస్తున్నారంటే.. ఒక్కో రోగికి ఎంత సమయం కేటాయిస్తున్నారో? ఇట్టే తెలిసిపోతోంది. కొవిడ్ తరువాత ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అందుకే ఇదే అదునుగా ఓపీ, వైద్యసేవల రూపంలో భారీగా బాదేస్తున్నారు.
ల్యాబ్‌లు, మందుల షాపుల్లో..
ప్రైవేటు ఆస్పత్రులకు అనుబంధంగా ల్యాబ్‌లు, మందుల షాపులు నడుపుతున్నారు. బయట ల్యాబ్‌ల్లో వైద్య పరీక్షలకు తక్కువ ధర ఉంటే.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారు. బయట ల్యాబ్‌ల నుంచి రిపోర్టులను తీసుకెళ్తే సదరు వైద్యులు దానిని చూడడం లేదు. వారి ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు మళ్లీ చేయిస్తున్నారు. ఈ ల్యాబ్‌ల్లో సైతం టెక్నీషియన్లు ఉండడం లేదు. నిబంధనల మేరకు ల్యాబ్ టెక్నీషియన్, ఓటీ అసిస్టెంట్ వంటి కోర్సులు పూర్తిచేసి అనుభవం ఉన్నవారినే నియమించాలి. కానీ, అదెక్కడా అమలు చేస్తున్న దాఖలాలు లేవు. ఇక ఆస్పత్రిలో పనిచేసే అన్‌ట్రైన్డ్ సిబ్బందితోనే మందుల దుకాణాలను సైతం నడిపిస్తున్నారు.
దృష్టిపెడతాం..
ప్రైవేటు ఆస్పత్రులపై దృష్టిపెడతాం. ముఖ్యంగా అవుట్ పేషెంట్ టోకెన్ ధరల నియంత్రణకు కృషిచేస్తాం. ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించి ధరలు నియంత్రించేలా చేస్తాం. కచ్చితంగా ఆస్పత్రుల యాజమాన్యాలు నోటీస్ బోర్డుల్లో అన్నింటినీ స్పష్టం చేయాలి. లేకుంటే మాత్రం చర్యలు తప్పవు.
- జీవన్‌రాణి, డీఎంహెచ్‌వో, విజయనగరం