Illicit Liquor మన్యంలో సారా జోరు
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:09 AM
Illicit Liquor Rife in the Agency Area జిల్లాలో నాటుసారా తయారీ, విక్రయాలకు అడ్డుకట్ట పడడం లేదు. అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఏవోబీ సరిహద్దు ఒడిశా నుంచి జిల్లాకు యథేచ్ఛగా సారా దిగుమతి అవుతుంది. సారా నివారణకు ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో సంబంఽధిత అధికారుల అలసత్వం వల్ల ఆశించిన మార్పు కానరావడం లేదు.
మారుమూల గ్రామాల్లో తయారీ, విక్రయాలు
ఓడిశా నుంచి యథేచ్ఛగా దిగుమతి.. జోరుగా అక్రమ రవాణా
నివారణ చర్యలు తీసుకుంటున్నామంటున్న అధికారులు
క్షేత్రస్థాయిలో మారని పరిస్థితి
పార్వతీపురం, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నాటుసారా తయారీ, విక్రయాలకు అడ్డుకట్ట పడడం లేదు. అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఏవోబీ సరిహద్దు ఒడిశా నుంచి జిల్లాకు యథేచ్ఛగా సారా దిగుమతి అవుతుంది. సారా నివారణకు ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో సంబంఽధిత అధికారుల అలసత్వం వల్ల ఆశించిన మార్పు కానరావడం లేదు. జిల్లాలోని 436 గ్రామ పంచాయతీలో 2,282 మధుర గ్రామాలున్నాయి. వాటి పరిధిలోనే అత్యధికంగా నాటుసారా విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు ఏవోబీ సరిహద్దులో ఉన్న ఒడిశా రాష్ట్రం రాయగడ, కోరాపుట్ జిల్లాల నుంచి మన్యం మీదుగా సారా అక్రమ రవాణా సాగుతోంది. యథేచ్ఛగా సారా తయారీ, రవాణా, విక్రయాలు జరుగుతున్నా.. వాటి నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో సారా వ్యాపారులు బరి తెగిస్తున్నారు. ఇష్టారాజ్యంగా దందా సాగిస్తున్నారు.
‘జిల్లాలో ఇప్పటివరకు 1160 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశాం.. 74 మంది నుంచి దాదాపు రూ. 11.45 లక్షలు వసూలు చేశాం. చెక్‌పోస్టుల ద్వారా నిఘా పటిష్ఠం చేశాం, ఒడిశా నుంచి వచ్చే వాహనాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం. సారా తయారీ, రవాణా, విక్రయాలను అడ్డుకుంటున్నాం. పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నాం. నాటుసారాపై ఎక్కువగా ఆధారపడిన గ్రామాలను గుర్తించాం. అందులో కేటగిరీల వారీగా విభజించి కొంతమందికి జీవనోపాధి కోసం చర్యలు తీసుకున్నాం’ అని సంబంధిత అధికారులు చెప్పుకొస్తున్నారు. నాటుసారా నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు. విచ్చలవిడిగా నాటుసారా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కో గ్రామంలో ఇద్దరు నుంచి ముగ్గురు వ్యాపారులు ఉండగా.. వారికి తెరవెనుక కొంతమంది ఎక్సైజ్ శాఖాధికారులు అండగా ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కూడా ఇదే అంశంపై అసెంబ్లీలో మాట్లాడారు. ‘పార్వతీపురంతో పాటు వివిధ ప్రాంతాల్లో నాటుసారా నివారణలో ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారు... అక్రమాలకు కొమ్ము కాస్తున్నారు’ అని ఆయన చెప్పడంతో జిల్లాలో సారా జోరు.. అధికారుల తీరు ఏ విధంగా ఉందనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సారా నివారణకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటున్నాం
జిల్లాలో నాటుసారా నివారణకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ముగ్గురిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. మరో ముగ్గురిపై నమోదు చేస్తాం. జిల్లాలో 1160 మందిపై బైండోవర్ కేసలు నమోదు చేశాం. 74 మంది నుంచి రూ.11.45 లక్షలు అపరాధ రుసుం కింద వసూలు చేసి ప్రభుత్వానికి కట్టించాం. ఒడిశా నుంచి ఆంరఽధాలోకి నాటుసారా దిగుమతి కాకుండా ఆ రాష్ట్ర అధికారులతో సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నాం.
- శ్రీనాథుడు, సూపరింటెండెంట్, ఎక్సైజ్ శాఖ, ఉమ్మడి జిల్లా