Share News

If you want the work done, you have to pay money. పని అవ్వాలంటే పైసలివ్వాల్సిందే

ABN , Publish Date - Nov 20 , 2026 | 11:53 PM

If you want the work done, you have to pay money. సంక్షేమ పథకాలు అందాలంటే లంచం ఇవ్వాలి. పౌరసేవల కోసం లంచం ఇవ్వాలి. చివరకు న్యాయబద్ధంగా రావాల్సిన రాయితీల విషయంలో కూడా అదే పరిస్థితి. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా అన్ని శాఖల్లోనూ అవినీతి అనే మరక అంటుతూనే ఉంది.

If you want the work done, you have to pay money. పని అవ్వాలంటే పైసలివ్వాల్సిందే

పని అవ్వాలంటే పైసలివ్వాల్సిందే

విధి నిర్వహణలో అధికారుల కాసుల కక్కుర్తి

పట్టుబడుతున్నా మారని తీరు

రెవెన్యూ శాఖలో అత్యధికంగా అవినీతి

లంచావతారుల సమాచారం ఇవ్వాలంటున్న ఏసీబీ

- విజయనగరం అర్బన్‌ తహసీల్దారు కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దారు రూ.15 వేలు లంచం తీసుకుంటూ రెండు రోజుల కిందట ఏసీబీకి పట్టుబడ్డాడు. సివిల్‌ సప్లయ్‌ డీటీగా ఉన్న ఆయన రేషన్‌ డీలర్‌షిప్‌ రెన్యూవల్‌ వ్యవహారంలో రూ.15 వేలు లంచం డిమాండ్‌ చేశారు. బాధితుడి నుంచి ఆ మొత్తం అందుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

- మార్చి నెలలో ఓ సర్పంచ్‌ నుంచి రూ.1.5 లక్షల లంచం తీసుకుంటూ ఓ శాఖకు చెందిన ఏఈ, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ కలిసి ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మెంటాడ పంచాయతీలో రూ.5 లక్షల పనులకు సంబంధించి బిల్లులకు లంచం డిమాండ్‌ చేయడంతో ఆ సర్పంచ్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించి లంచం ఇస్తూ పట్టించారు.

- ఫిబ్రవరిలో భోగాపురం మండలం చాకివలస ఇన్‌చార్జి వీఆర్వో అంబటి రామపైడి చిట్టిబాబు రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ రైతు మ్యూటేషన్‌కు దరఖాస్తు చేసుకోగా రూ.3 లక్షల లంచం డిమాండ్‌ చేశాడు. చివరకు రూ.2.40 లక్షలకు బేరం కుదరగా.. ముందస్తుగా రూ.లక్ష ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా.. లంచం ఇస్తుండగా వారు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

విజయనగరం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి):

సంక్షేమ పథకాలు అందాలంటే లంచం ఇవ్వాలి. పౌరసేవల కోసం లంచం ఇవ్వాలి. చివరకు న్యాయబద్ధంగా రావాల్సిన రాయితీల విషయంలో కూడా అదే పరిస్థితి. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా అన్ని శాఖల్లోనూ అవినీతి అనే మరక అంటుతూనే ఉంది. ప్రభుత్వ శాఖల్లో లంచం ఇవ్వనిదే ఫైల్‌ కదలదన్న ఆరోపణలు నానాటికీ పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఏసీబీ దాడుల్లో అధికారులు, సిబ్బంది పట్టుబడుతున్నారు. ఈ వ్యవహారం రెవెన్యూ శాఖలో మరింత పెచ్చుమీరుతోంది. అయితే దిగువస్థాయి సిబ్బంది లక్షల్లో లంచాలు అడుగుతున్నారంటే దాని వెనుక అధికారుల పాత్ర ఉంటుందన్నది బహిరంగ రహస్యం. కిందిస్థాయి సిబ్బంది పట్టుబడినా వారి వెనుక ఉన్నతాధికారులు ఉంటున్నారు. వారు లంచం తీసుకోనిదే ఫైల్‌ కదపడం లేదు.

ప్రభుత్వ శాఖలో ఏ చిన్నపనైనా ఉంటే అక్కడ ‘వసూలు రాజాలు’ వాలిపోతున్నారు. వారే అన్ని పనులూ పూర్తిచేస్తున్నారు. అందుకు ఇంత ఇచ్చుకోవాల్సిందేనని షరతు పెడుతున్నారు. ప్రధానంగా రెవెన్యూ, మునిసిపల్‌, పంచాయతీరాజ్‌, రిజిస్ర్టేషన్‌ శాఖల్లో అవినీతి సర్వసాధారణం అయిపోయింది.

రెవెన్యూశాఖపై మరింతగా ఆరోపణలున్నాయి. రైతులకు పాసుపుస్తకాలు, టైటిల్‌డీడ్‌, సర్వే, ఆన్‌లైన్‌లో భూమి వివరాల నమోదు, ధ్రువపత్రాల జారీ, ఇసుక రవాణా తదితర వ్యవహారాల్లో ఎక్కువగా అక్రమార్జనకు దిగుతున్నారు. ఈ శాఖలో చేయితడిపితేనే పని జరుగుతుంది అన్న పరిస్థితి ప్రతిచోటా ఉంది. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల విషయంలో కూడా అధికారులు, సిబ్బంది వాటాలు అడుగుతున్నారు. ఫలితంగా ప్రజలకు నాలుగు కాలాల పాటు ఉపయోగపడాల్సిన నిర్మాణాలు కొద్దికాలానికే పాడవుతున్నాయి. టౌన్‌ప్లానింగ్‌ గురించి చెప్పనవసరం లేదు. ఇంటి నిర్మాణాలకు సంబంధించి ప్లాన్‌ అప్రూవల్‌, అసెస్‌మెంట్‌ తదితర పనులకు డబ్బులు వసూలు చేస్తున్నారు. నేరుగా మునిసిపల్‌ కమిషనర్లే లంచం తీసుకుంటూ పట్టుబడిన సందర్భాలు జిల్లాలో ఉన్నాయి. నెల్లిమర్ల నగర పంచాయతీలో కూడా ఈ తరహా ఘటన జరిగింది.

అవినీతికి ప్రోత్సాహం..

పనులను త్వరితగతిన పూర్తిచేయించుకోవాలన్న ఆతృతతో కొన్నిసార్లు ప్రజలే లంచాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇంకొందరు వ్యక్తులు సిబ్బంది అడగకపోయినా వారి జేబులో ఎంతోకొంత పెడుతున్నారు. ప్రజలు సామాజిక బాధ్యతగా అవినీతి నిర్మూలనకు సహకరించాల్సిన అవసరం ఉంది. లంచం అడిగిన వ్యక్తిపై ఏసీబీకి ఫిర్యాదుచేస్తే వారు వివరాలను గోప్యంగా ఉంచుతారన్న విషయం తెలుసుకోవాలి. ఎక్కడైనా..ఎవరైనా అధికారి అవినీతికి పాల్పడితే వెంటనే ఏసీబీకి ఫిర్యాదుచేయాలి. జిల్లాకు సంబంధించి విజయనగరంలో కార్యాలయం ఉంది. ఆపై ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 14400కు సైతం ఫిర్యాదు చేయవచ్చు.

ప్రజల్లో చైతన్యం రావాలి

ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో పనిచేయించుకోవడం ప్రజల హక్కు. ప్రభుత్వం వారి పనికి తగ్గట్టు వేతనం అందిస్తుంది. అందుకే ఎక్కడైనా లంచం డిమాండ్‌ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయండి. వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటాం. ఏ భయం వద్దు. అవసరమైతే ఫిర్యాదుదారులకు రక్షణ కల్పిస్తాం. స్వేచ్ఛగా ఫిర్యాదు చేయాలి.

- కె.సత్యన్నారాయణరావు, ఏసీబీ డీఎస్పీ, విజయనగరం

Updated Date - Nov 20 , 2026 | 11:53 PM