Share News

if you go in wrong way వక్రమార్గంలో వెళ్తే అంతే

ABN , Publish Date - Jan 07 , 2026 | 11:45 PM

if you go in wrong way రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువగా ఉంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై దాడులు చేసినప్పుడు చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రెండు శాఖలతో పాటు ఈ ఏడాది మరో నాలుగు కీలక శాఖలపై దృష్టి పెట్టాం.

if you go in wrong way వక్రమార్గంలో వెళ్తే అంతే

వక్రమార్గంలో వెళ్తే అంతే

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో దాడులతో వెలుగులోకి అక్రమాలు

సీరియస్‌గా తీసుకుంటున్న ఏసీబీ డీజీ అతుల్‌సింగ్‌

కీలక శాఖల్లో రహస్యంగా వివరాల సేకరణ

మ్యుటేషన్లలో నేటికీ భారీగా అక్రమాలు

రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువగా ఉంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై దాడులు చేసినప్పుడు చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రెండు శాఖలతో పాటు ఈ ఏడాది మరో నాలుగు కీలక శాఖలపై దృష్టి పెట్టాం. బినామీ పేర్లతో ఆస్తులను కూడగట్టిన వారిపై నిఘా పెట్టాం. వారి డేటాను ఏఐ ద్వారా సేకరిస్తున్నాం. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని కట్టడి చేసేందుకు ఏసీబీ చేస్తున్న ప్రయత్నాలు సరిపోవడం లేదు. ప్రజల సహకారం అవసరం. సమాచారం ఇచ్చినవారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. మీ ఫిర్యాదు ప్రజా ప్రయోజన కోణంలో ఉండాలి.

- విజయవాడ ఎన్టీఆర్‌ పరిపాలన భవనంలో

ఆరు రోజుల కిందట మీడియాతో ఏసీబీ డీజీ అతుల్‌సింగ్‌ మాటలు

ఏసీబీ డీజీ అతుల్‌సింగ్‌ ప్రకటనలతో అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎప్పుడైనా దొరికిపోవచ్చునని టెన్షన్‌ పడుతున్నారు. జిల్లా పోలీస్‌ శాఖలోని నిఘా విభాగం అప్రమత్తమైంది. ఏఏ తహసీల్దార్‌ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు ఎక్కువగా జరుగుతు న్నాయో ఆరా తీస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ ఐజీ బీఆర్‌ అంబేడ్కర్‌ సోమవారం కొత్తవలస సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి ఉంటుందన్న అపవాదును తొలగించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఏదైనాగాని ఈ రెండు శాఖల పనితీరుపై నిఘా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

శృంగవరపుకోట, జనవరి 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రెవెన్యూ, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. ఈ కార్యాలయాల గడప తొక్కాలంటే చేతిలో అయినా జేబులో అయినా సొమ్ముండాల్సిందేనన్న నానుడి ఉంది. దొరికినప్పుడే పేర్లు బయట పడుతున్నాయి. లేదంటే దందా దర్జాగా సాగుతోంది. జిల్లాలోని కొందరు తహసీల్దార్‌లు, సబ్‌ రిజిస్ట్రార్‌లు, కింది స్థాయి సిబ్బంది బహిరంగంగానే అవినీతికి పాల్పడుతున్నట్లు పేర్లు వినిపిస్తున్నాయి. వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో ప్రజాప్రతినిధి, అధికార పార్టీకి చెందిన పేరున్న నేతల అండదండలు ఉండడంతో వ్యవహారం సాఫీగా సాగిపోతోంది. అవినీతి నిరోధక శాఖకు దొరికినప్పుడే వీరి ఆటలు కట్టేది.

ఫ కొత్తవలస మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన చెరువు భూమికి నిబంధనల ప్రకారం ప్రైవేటు వ్యక్తులకు హక్క కల్పించారు. గ్రామ సచివాలయం, మీసేవ కేంద్రాల నుంచి దరఖాస్తు చేసుకోకుండానే పలు గ్రామాల్లో మ్యూటేషన్‌లు జరిగిపోయాయి. దీంతో రెండు నెలల క్రితం తహసీల్దార్‌ సస్పెండ్‌ అయ్యారు.

ఫ గత ఏడాదిలో జిల్లాలోని డెంకాడ మండలం, వేపాడ మండల పరిధిలో పని చేసిన ఇద్దరు గ్రామ రెవెన్యూ అధికారులు మ్యూటేషన్‌ కోసం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు.

ఫ బొండపల్లి మండలంలో ఓ గ్రామ రెవెన్యూ అధికారి ఫోన్‌పే ద్వారా లంచం తీసుకున్నారు. బాధితుడు దీన్ని స్ర్కిన్‌షాట్‌ తీసి బయటపెట్టడం అప్పట్లో కలకలం రేపింది. విజయనగరం మండలం రాకోడు భూముల వ్యవహారంపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితులు ఫిర్యాదు చేశారు. ఇలా వెలుగు చూసినవి కొన్నే.

ఫ భూములను ఆన్‌లైన్‌ చేసుకొనేందుకు రైతులు ముందుకు వస్తున్నా చిన్నచిన్న లొసుగులను చూపించి రైతుల నుంచి కొంత మంది రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. అడిగినంత ఇస్తేనే మ్యుటేషన్‌ జరుగుతుంది. లేదంటే ఎన్ని సార్లు దరఖాస్తు చేసినా ఏదో ఒక వంకతో తిరస్కరణకు గురవుతుంది. స్థిరాస్థి వ్యాపారం చేసేవారికి లాభలు అధికంగా వస్తాయి. దీంతో వీరు రెవెన్యూ అధికారులు అడిగినంత ఇచ్చేస్తున్నారు. రైతులు ఆ స్థాయిలో లంచం ఇవ్వలేరు. వీరిని కూడా అదే విధంగా డబ్బులు అడుతుండడంతో విసిగిపోయిన కొంత మంది రైతులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. రెవెన్యూ అధికారులు దొరుకుతున్నారు. ఓ పక్క ఏసీబీ కేసులు నమోదు, మరో పక్క ఉన్నతాధికారుల చర్యలు, ఇంకోపక్క ఐవీఆర్‌ సర్వే ద్వారా రెవెన్యూ అధికారులపై నిఘా పెట్టినా రెవెన్యూలో అవినీతి ఆగడం లేదు. అవినీతి నిరోధక శాఖకు చిక్కుతున్నవారిలో వీరే అధికంగా ఉంటున్నారు.

రిజిస్ట్రార్‌ కార్యాలయాలూ అదే పంథా

భోగాపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పనిచేసిన అధికారుల ఇళ్లల్లో ఇటీవల జరిగిన సోదాల్లో డబ్బు, బంగారం, విలువైన పత్రాలు లభించాయి. అంతకు మూడు నెలల ముందు ఈ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. అప్పుడు కూడా పలు అక్రమాలను గుర్తించింది. రాజాం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నట్లు ఓ ప్రజా ప్రతినిధి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జిల్లాలో ఏ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లినా క్రయ, విక్రయదారులకు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులకు మధ్యవర్తులుగా డ్యాక్యుమెంటు రైటర్లే కనిపిస్తారు. వీరు వెళ్తేనే అధికారులు పలికేది. వీరు వసూలు చేసిన డబ్బులు కార్యాలయ పని ముగిసిన తరువాత పంపకాలు జరుగుతాయి. అడిగినంత డబ్బులు ఇస్తే నిబంధనలు ఒప్పకోకపోయినా పని జరిగిపోతుంది.

ఫ రెవెన్యూ, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల భూముల వ్యవహారాలతో ముడిపడి ఉన్నవి. రైతులకు న్యాయం చేయాల్సిన ఈ రెండు కార్యాలయాల్లోని పలువురు అధికారులు, ఉద్యోగులు వారి చేతుల వైపు చూస్తున్నారు. ఇవ్వకుంటే తిప్పుతుండడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. దీన్ని రూపు మాపేందుకు సీఎం నారాచంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రయోజనం ఉండడం లేదు. ఏసీబీ హెచ్చరికలతోనైనా ఈ రెండు శాఖల్లో మార్పు వస్తుందేమో చూడాలి.

------------------

Updated Date - Jan 07 , 2026 | 11:45 PM