Share News

If you give Rs. lakh.. Rs. 444 per day రూ.లక్ష ఇస్తే.. రోజుకు రూ.444

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:58 PM

If you give Rs. lakh.. Rs. 444 per day లక్ష రూపాయలు డిపాజిట్‌ చేస్తే, లక్ష కలిపి రూ.2 లక్షలు ఇస్తామన్నారు. ఎన్ని లక్షలు డిపాజిట్‌ చేసినా రెట్టింపు డబ్బులు అకౌంట్‌లో పడడం ఖాయమని నమ్మించారు. పిల్లల చదువులు, పెళ్లికి అందివస్తాయన్న ఆశతో 2024లో నాలుగున్నర లక్షలు వేశాను. నా అకౌంట్‌లో తిరిగి కేవలం రూ.66 వేలు జమైంది. ఆ తరువాత ఎవరూ పత్తాలేరు.

If you give Rs. lakh.. Rs. 444 per day రూ.లక్ష ఇస్తే.. రోజుకు రూ.444
ఎస్పీ గ్రీవెన్స్‌కి వచ్చిన బాధితులు

రూ.లక్ష ఇస్తే.. రోజుకు రూ.444

500 రోజులు బ్యాంకు ఖాతాలో జమ

నమ్మించి ముంచిన ప్రైవేటు సంస్థ

జిల్లాలో వేలాదిమంది బాధితులు

ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

రెట్టింపు ఇస్తామన్నారని..

లక్ష రూపాయలు డిపాజిట్‌ చేస్తే, లక్ష కలిపి రూ.2 లక్షలు ఇస్తామన్నారు. ఎన్ని లక్షలు డిపాజిట్‌ చేసినా రెట్టింపు డబ్బులు అకౌంట్‌లో పడడం ఖాయమని నమ్మించారు. పిల్లల చదువులు, పెళ్లికి అందివస్తాయన్న ఆశతో 2024లో నాలుగున్నర లక్షలు వేశాను. నా అకౌంట్‌లో తిరిగి కేవలం రూ.66 వేలు జమైంది. ఆ తరువాత ఎవరూ పత్తాలేరు.

- పైల శంకరరావు, గుణుపూర్‌పేట, డెంకాడ మండలం

రోడ్డున పడ్డాం

2024 మే నెలలో రూ.10 లక్షల డిపాజిట్‌ చేశాను. 2025 మార్చి వరకూ వచ్చింది కేవలం రూ.3లక్షలు. ఆ తరువాత ఒక్క రూపాయి కూడా జమకాలేదు. అడిగితే నీ అకౌంట్‌లో డబ్బులు జమ చేశామని పడకపోతే, మాకేమి సంబంధమని ఎదురు ప్రశ్నించారు. ఆ తరువాత వారి జాడ లేదు. ఆఫీస్‌ ఎత్తేశారు. మొత్తం కోల్పోయి కుటుంబం రోడ్డున పడింది.

- బండారు గాంధీ, ఆటో డ్రైవర్‌, లంకలపల్లి గ్రామం, పూసపాటిరేగ మండలం

నమ్మించి మోసం

నమ్మించి నాతో 2.11 లక్షల రూపాయలు కట్టించుకున్నారు. నా భర్త చనిపోయాక వచ్చిన ఎల్‌ఐసీ డబ్బులు అందితే ఆ మొత్తాన్ని ఇందులో కట్టాను. నమ్మించి నట్టేట ముంచేశారు. నాకు పాప,బాబు ఉన్నారు. ఏ ఆధారం లేక వీధిన పడ్డాను. ప్రభుత్వమే దారి చూపాలి.

- కొణతాల రమణమ్మ, గృహిణి, భరణి గ్రామం, పూసపాటిరేగ మండలం

నిండి మునిగిపోయాను

నేను నమ్మడమే కాకుండా, నా బంధువులను కూడా ఇందులో దింపాను. నేను రూ.40 లక్షలు కట్టాను. కొన్నాళ్లకు నా డబ్బులు వెనక్కి ఇచ్చారు. అది నమ్మి నా బంధువులు, కుటుంబ సభ్యులతో ఇంకో రూ.56 లక్షలు కట్టించాను. రూ 15 లక్షలు మాత్రమే వెనక్కి వచ్చింది. నిండా మునిగిపోయాను.

- మీసాల రాము, మాజీ సైనిక ఉద్యోగి, చీపురుపల్లి

విజయనగరం క్రైం, మార్చి 23(ఆంధ్రజ్యోతి):

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఒకే సమస్యపై జిల్లా నలుమూలల నుంచి పదుల సంఖ్యలో బాధితులు వచ్చారు. ఏఎస్‌పీ సౌమ్యలతకు గోడు వెళ్లబోసుకున్నారు. హర్‌ వెంచర్స్‌ ఫార్మింగ్‌, హౌసింగు ప్రాజెక్ట్సు ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ తమను నమ్మించి నట్టేట ముంచిందని వాపోయారు. లక్ష రూపాయలు డిపాజిట్‌ చేస్తే, 500 రోజుల పాటు రోజుకి రూ.444 చొప్పున ఇస్తామన్నారని, అప్పులు చేసి కొందరం, ఆస్తులు అమ్మి మరికొందరం, ఇళ్లు, బంగారంపై రుణాలు తీసుకుని ఇంకొందరం డిపాజిట్‌ చేశామన్నారు. కొన్నాళ్లు పాటు ఆన్‌లైన్‌లో డబ్బులు వేశారని, తరువాత ఏడాదిగా లావాదేవీలు ఆపేశారని వివరించారు. బోర్డు తిప్పేశారని ఆలస్యంగా తెలిసిందని, న్యాయం చేయాలని ఏఎస్పీని కోరారు. 2023 నుంచి ఆ సంస్థలో డిపాజిట్‌ చేశామని, 2025 మార్చి తర్వాత ముఖం చాటేశారని బాధితులు వివరించారు. వారు తెలిపిన వివరాల మేరకు

మోసం జరిగిందిలా..

హర్‌ వెంచర్స్‌ ఫార్మింగ్‌, హౌసింగు ప్రాజెక్ట్సు ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ విశాఖ ప్రధాన కేంద్రంగా కార్యాలయం ఏర్పాటు చేసి ఏజెంట్ల ద్వారా సగటు పేద, మధ్యతరగతి, ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని డబ్బుల వేట మొదలు పెట్టింది. లక్ష రూపాయలు ఒకేసారి డిపాజిట్‌ చేస్తే, 500 రోజుల పాటు రోజుకు రూ.444 చొప్పున వారి ఖాతాలో జమ చేస్తామని చెప్పింది. జిల్లా నలుమూలల నుంచి వేల సంఖ్యలో ఖాతాదారులుగా చేర్పించుకుంది. పెద్ద మొత్తంలో డిపాజిట్‌ రూపంలో తమ సంస్థ ఖాతాలో జమ చేసుకుంది. వారి ద్వారా మరికొంత మందిని ఆకర్షించేందుకు కొన్నాళ్ల పాటు చెప్పినట్టుగా రోజూ రూ.లక్షకు రూ.444 చొప్పున బ్యాంకు ఖాతాలకు జమ చేసింది.

వందల నుంచి వేలల్లోకి..

సంస్థ వ్యాపార పాచిక పారి అప్పటికే వందల సంఖ్యలో చేరిన ఖాతాదారుల సంఖ్య తక్కువ వ్యవధిలోనే పెద్ద సంఖ్యలోకి ఎగబాకింది. ఊహించని రీతిలో డిపాజిట్లు పోగు పడ్డాయి. అంతటితో సంతృప్తి చెందని నిర్వహకులు అదే పంథాని కొనసాగించగా ఈ సారి ఆ సంఖ్య వేలల్లోకి చేరి ఇబ్బడిముబ్బడిగా డిపాజిట్లు సంస్థ ఖాతాకు చేరాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో చేరిన ఖాతాదారుల నుంచి సుమారు రూ.400 కోట్లు ఆ సంస్థ ఖాతాలో పడినట్టు అంచనా.

ఏజెంట్లకు ప్రోత్సాహకాలు

ఏజెంట్లను ఉత్సాహపరిచేందుకు వారు చేయించే డిపాజిట్లపై 15 శాతం కమీషన్‌తో పాటు గోవా ట్రిప్పులు, చేసిన వ్యాపారాన్ని బట్టి ఖరీదైన కార్లు, బంగారు బ్రాస్‌లైట్లు, ఉంగరాలు ఇచ్చేవారు. దీంతో వెనక నుంచి ఏమి జరుగుతోందని ఆలోచించకుండా డిపాజిట్లు కోసం వీరు వేటాడేవారు.

బాధితుల్లో ఉద్యోగులు

ఈ సంస్థ బాధితుల్లో కొందరు ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టు భోగట్టా. ఏజెంట్లలో పోలీసు కానిస్టేబుల్స్‌ సైతం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పరిచయస్థులు అందరినీ ఇందులో చేర్చి పెద్ద మొత్తంలో డబ్బులు కట్టించినట్టు ఎస్‌పీ గ్రీవెన్స్‌లో బాధితులు విన్నవించారు. చీపురుపల్లికి చెందిన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన ఓ కానిస్టేబుల్‌ నమ్మించి ఖాతాదారులుగా ఎక్కువ మందిని చేర్పించినట్టు చెబుతున్నారు. పలువురు ఉద్యోగులను ఇలానే బురిడీ కొట్టించినట్టు తెలుస్తోంది.

ఎక్కడికక్కడ బ్రాంచ్‌లు

విజయనగరం కేంద్రంగా జిల్లా స్థాయి కార్యాలయం ఏర్పాటు చేసిన ఈ సంస్థ నెల్లిమర్ల, రణస్థలం, చీపురుపల్లి తదితర కేంద్రాల్లో చిన్న, చిన్న గదులు తీసుకుని వ్యవహారం నడిపినట్టు సమాచారం. తమ సంస్థ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆక్వా కల్చర్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నదని అందులో వచ్చే ఆదాయాన్ని ఖాతాదారుల అభివృద్ధి కోసం వారి ఖాతాల్లోకి మళ్లిస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పినట్టు బాధితులు వివరించారు.

లోన్‌లు ఇప్పించి ఉచ్చులోకి..

ఈ వ్యవహారంలో మరో కీలకమైన అంశం ఏమంటే సంస్థలో ఖాతాదారులుగా చేరాలని ఆసక్తి రేకెత్తించి, వారి చేతిలో సమయానికి డబ్బులేకపోతే సంస్థ ప్రతినిధులే కొందరికి హౌసింగు లోన్లు, మరికొందరికి మార్ట్‌గేజ్‌ లోన్లు, బంగారంపై తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించారు. ఆపై ఆ డబ్బు తమ ఖాతాలో జమ చేయించుకునేవారని బాధితులు ఘొల్లుమంటున్నారు.

బాధితులు వాట్సాప్‌ గ్రూప్‌

విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాలోని బాధితులు హర్‌వెంచర్స్‌ బాధితుల పేరిట వాట్పాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకుని, ఎప్పటికప్పుడు భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్వతీపురం, బొబ్బిలి ప్రాంతం బాధితులు అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని బాధితులు అక్కడ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమౌతున్నట్టు సమాచారం.

ఉత్తరాంధ్రలో రూ.700 కోట్లు

ఈ సంస్థ కుచ్చుటోపి పెట్టిన మొత్తం ఉత్తరాంధ్ర మూడు జిల్లాల పరిధిలో రూ 700 కోట్లు వుంటుందని వాట్సాఫ్‌ గ్రూప్‌లో చర్చించుకున్న వివరాలను బట్టి అంచనా వేస్తున్నామని బాధితులు పేర్కొన్నారు. ఇందులో విజయనగరంలో రూ 400 కోట్లు, పార్వతీపురం రూ 100 కోట్లు, శ్రీకాకుళం రూ.200 కోట్లు ప్రాథమికంగా లెక్కతేలినట్టు చెబుతున్నారు. ఈ బాగోతంపై పాత్రదారులైన కొందరి పేర్లను పోలీసులకు వెల్లడించినట్టు తెలిసింది. వీరిలో ఒక్కరు రూ.30 కోట్ల మేరకు డబ్బు కట్టించినట్టు ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించారు.

Updated Date - Mar 23 , 2026 | 11:58 PM