Share News

వైసీపీ ట్రాప్‌లో పడితే కష్టమే!

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:52 PM

“If You Fall Into YSRCP’s Trap, You’re in for Trouble!” జిల్లాలోని కొన్ని పంచాయతీల్లో రాజకీయంగా భిన్న పరిస్థితి నెలకొంది. కొంతమంది టీడీపీ మద్దతుదారులు వైసీపీ ట్రాప్‌లో పడుతూ.. పరోక్షంగా ఆ పార్టీ బలోపేతానికి సహకరిస్తున్నారు. ఫలితంగా కొన్నిచోట్ల కూటమి ఫలితాలపై ప్రభావం పడుతోంది. ఇటీవల జిల్లాలో జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలే ఇందుకు నిదర్శనం.

వైసీపీ ట్రాప్‌లో పడితే కష్టమే!

  • ద్వితీయశ్రేణి టీడీపీ నాయకులతో వైసీపీ దోస్తీ

  • వర్గాలను చేరదీస్తూ.. ఎన్నికల్లో విజయం కోసం పరోక్ష ఒప్పందాలు

  • రహస్యంగా ఒకరికొకరు సహకారం

  • టీడీపీ అధిష్ఠానం దృష్టి సారిస్తే మేలు

  • క్యాడర్‌ను అప్రమత్తం చేయకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులే..

పార్వతీపురం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కొన్ని పంచాయతీల్లో రాజకీయంగా భిన్న పరిస్థితి నెలకొంది. కొంతమంది టీడీపీ మద్దతుదారులు వైసీపీ ట్రాప్‌లో పడుతూ.. పరోక్షంగా ఆ పార్టీ బలోపేతానికి సహకరిస్తున్నారు. ఫలితంగా కొన్నిచోట్ల కూటమి ఫలితాలపై ప్రభావం పడుతోంది. ఇటీవల జిల్లాలో జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలే ఇందుకు నిదర్శనం. కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లోని ఎనిమిది మండలాల్లోని జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అనేక చోట్ల టీడీపీ మద్దతుదారులు, రెబల్స్‌ వైసీపీతో మిలాఖత్‌ అయి విజయం సాధించారు. మరికొన్ని పంచాయతీల్లో టీడీపీ నాయకులు వైసీపీకి పరోక్షంగా మద్దతు ఇచ్చి.. ఆ పార్టీ సర్పంచ్‌ అభ్యర్థుల విజయానికి సహకరించారనే ఆరోపణలున్నాయి. అయితే వైసీపీ మద్దతుతో సర్పంచ్‌లుగా గెలిచిన టీడీపీ రెబల్స్‌ ఇదంతా తమ ఘనతే అన్నట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. కాగా వైసీపీ కుట్రలో పావులుగా మారుతున్నామన్న ఈ విషయాన్ని చాలామంది గమనించలేకపోతున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికిన ద్వితీయ శ్రేణి టీడీపీ నాయకులు.. సర్పంచ్‌ ఎన్నికల్లో ఆ పార్టీ నేతల సహకారం పొందేందుకు ముందుగానే రహస్య ఒప్పందం చేసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

టీడీపీ కేడర్‌కు దగ్గరగా ఉంటూ..

టీడీపీకి కంచుకోటగా ఉన్న పంచాయతీల్లో విజయం సాధించేందుకు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న టీడీపీ కేడర్‌లో ఒక వర్గానికి దగ్గరగా ఉంటూ వైసీపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా వైసీపీకి పట్టు ఉన్న పంచాయతీల్లోనూ టీడీపీలో ఒక వర్గాన్ని ఆ పార్టీ నాయకులు దగ్గరకు చేర్చుకుని తమకు ఎదురు లేకుండా చూసుకుంటున్నారు. మొత్తంగా చాపకింద నీరులా ఉంటూ.. ఆ పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో వైసీపీని పటిష్ఠం చేసుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. దీనిపై పార్టీ అధిష్ఠానం దృష్టి కేంద్రీకరించి పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉంది. పనిచేసే కేడర్‌ ఎవరు? పార్టీకి సేవ చేస్తున్నవారెవరు! అని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయాల్సి ఉంది. లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Updated Date - Nov 28 , 2026 | 11:52 PM