sensor will catch you. డ్రైవింగ్ సరిగా లేకుంటే సెన్సార్ పట్టేస్తుంది
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:31 AM
If you drive improperly, the sensor will catch you. డ్రైవింగ్ లైసెన్సు ఇప్పుడు అంత ఈజీ కాదు. ఇదివరకు అధికారులు చూసీచూడనట్లు పోయే అవకాశం ఉండేది. ఇకపై అలా కుదరదు. సెన్సార్ పర్యవేక్షణలో డ్రైవింగ్ టెస్ట్ జరిగేలా కొత్త సాంకేతిక వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చింది.
డ్రైవింగ్ సరిగా లేకుంటే
సెన్సార్ పట్టేస్తుంది
విజయనగరంలో కొత్త సాంకేతిక విధానంలో డ్రైవింగ్ పరీక్ష
ఆగుతున్న సర్వర్
విజయనగరం దాసన్నపేట, జూన్ 3(ఆంధ్రజ్యోతి): డ్రైవింగ్ లైసెన్సు ఇప్పుడు అంత ఈజీ కాదు. ఇదివరకు అధికారులు చూసీచూడనట్లు పోయే అవకాశం ఉండేది. ఇకపై అలా కుదరదు. సెన్సార్ పర్యవేక్షణలో డ్రైవింగ్ టెస్ట్ జరిగేలా కొత్త సాంకేతిక వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చింది. నూతన విధానం రెండు రోజుల కిందట విజయనగరంలో ప్రారంభమైంది. మోటారు సైకిల్, ఫోర్ వీలర్స్, ట్రాక్టరు నడిపేవారు డ్రైవింగ్ ట్రాక్‌లో వెళ్తున్నప్పుడు పూర్తిస్థాయిలో సెన్సార్ పర్యవేక్షిస్తుంది. వాహనం నడిపేవారు ట్రాక్‌లో ఏమాత్రం నిదానంగా నడిపినా, కాళ్లు కింద మోపినా, ట్రాక్ గీతల వైపు వచ్చినా వెంటనే సెన్సార్ కంప్యూటర్ ఫెయిల్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఆపై వాహనదారుడు లైసెన్స్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం సెన్సార్ పైలట్ ప్రాజెక్టుకు ఒంగోలు, ఏలూరు, అనకాపల్లి, విజయనగరం జిల్లాలను ఎంపిక చేసింది. విజయనగరంలో మంగళవారం ఈ పక్రియను ప్రారంభించారు. తొలి రోజు మధ్యాహ్నం 3 గంటల వరకూ సర్వర్ సమస్యతో ఇబ్బందులు ఎదురయ్యాయి. 25 మంది స్లాట్ బుక్ చేసుకోగా, ఐదుగురు మాత్రమే తొలి రోజు డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరయ్యారు. వారిలో ఇద్దరు పాసయ్యారు. ముగ్గురు ఫెయిల్ అయ్యారు.
సెన్సార్ ప్రక్రియ వేగవంతం
మణికుమార్, రవాణాశాఖ ఉపకమిషనర్
రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖలో లైసెన్సు మంజూరు ప్రక్రియను కఠినతరం చేసింది. ఇందులో భాగంగా విజయనగరం రవాణాశాఖ కార్యాలయంలో ప్రవేశపెట్టిన సెన్సార్ డ్రైవింగ్ ట్రాక్ మంగళవారం ప్రారంభించాం. తొలి రోజు చిన్న, చిన్న సాంకేతిక సమస్యలు రావడంతో ఆలస్యమైంది. ఇకనుంచి వేగవంతంగా సాగుతుంది. వాహనాలు సక్రమంగా నడిపితేనే లైసెన్సు మంజూరవుతుంది. లేదంటే సెన్సార్ ఫెయిల్ చేస్తుంది.