Share News

ఆలస్యం చేశారో అంతే!

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:27 AM

జనన, మరణ ధ్రువపత్రాల జారీకి సంబంధించి ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది.

 ఆలస్యం చేశారో అంతే!

- జనన, మరణ ధ్రువపత్రాల జారీలో నిబంధనలు కఠినతరం

- 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి

- గడువు దాటితే తిప్పలు తప్పవు

- ఈ నెల నుంచే అమలు

జియ్యమ్మవలస, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): జనన, మరణ ధ్రువపత్రాల జారీకి సంబంధించి ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల ఒకటో తేదీ నుంచే ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇంట్లో ఎవరైన పుట్టినా లేదా మరణించినా 21 రోజుల్లోపు సంబంధిత ధ్రువపత్రాల కోసం కుటుంబ సభ్యులు గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో దరఖాస్తు చేసుకోవాలి. గడువు దాటితే ధ్రువపత్రాలు పొందేందుకు తిప్పలు తప్పవు. 21 రోజులు దాటి ఒక సంవత్సరంలోపు దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం నిర్ణయించిన ఆలస్య రుసుం చెల్లించి స్థానిక అధికారుల ద్వారా ధ్రువపత్రాలు పొందాల్సి ఉంటుంది. ఒక సంవత్సరం నుంచి రెండేళ్లు ఆలస్యమైతే సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్‌, సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ లేదా వారు అధికారం కల్పించిన ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. రెండేళ్లు దాటితే స్థానిక అధికారులు నేరుగా జనన, మరణ ధ్రువపత్రాలను జారీ చేయరు. దీనికి కచ్చితంగా ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు నుంచి ప్రత్యేక ఉత్తర్వులు తెచ్చుకోవలసి ఉంటుంది. అయితే, ఒక సంవత్సరం దాటిన తరువాత సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, ఆ సమాచారం సరైనదే అని ధ్రువీకరణకు వస్తేనే ధ్రువపత్రం మంజూరవుతుంది.

ఈ ధ్రువపత్రాలు చాలా కీలకం..

జనన, మరణ ధ్రువపత్రాలు చాలా విషయాల్లో అత్యంత కీలకమైనవి. బర్త్‌ సర్టిఫికెట్‌ లేకపోతే పిల్లల ఆధార్‌ నమోదు, చదువు తదితర అంశాల్లో ఇబ్బందులు తప్పవు. అలాగే మరణ ధ్రువపత్రం లేకపోతే ఆస్తి పంపకాలు, వారసత్వాలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనం, ఇతర అధికారిక, ఆర్థిక వ్యవహారాలు ముందుకు సాగడం కష్టమే. ఇలాంటి కీలక ధ్రువపత్రాల కోసం కుటుంబ సభ్యులు సకాలంలో నమోదు చేసుకోవాలి. లేదంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒక వ్యక్తి వేరొక జిల్లాకు వెళ్లి అక్కడ మృత్యువాత పడితే కచ్చితంగా ఆ కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం ఇచ్చే ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాలి. దీనిని మీసేవ కేంద్రాల్లో సమర్పించి డెత్‌ సర్టిఫికెట్‌ను పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.

ఆలస్యం చేయొద్దు

జనన, మరణ ధ్రువపత్రాలు పొందే విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా సవరణ చట్టం చేసింది. 21 రోజుల్లో దరఖాస్తు చేసుకుంటే సులువుగా ధ్రువపత్రాలు మంజూరవుతాయి. ఏడాదిలోపు అయితే తహసీల్దార్‌ స్థాయి, ఏడాది దాటి రెండేళ్లలోపు ఆర్డీవో స్థాయి అధికారులు, రెండేళ్లు దాటితే ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలతో ధ్రువపత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇంట్లో ఎవరైన జన్మించినా, మరణించినా అశ్రద్ధ చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి.

-ఏఎస్‌ సాయికామేశ్వరరావు, తహసీల్దార్‌, జియ్యమ్మవలస మండలం

Updated Date - Oct 12 , 2026 | 12:27 AM