Share News

If you borrow to repay the debt.. అప్పు తీర్చేందుకు అప్పు చేస్తే..

ABN , Publish Date - Feb 17 , 2026 | 11:55 PM

If you borrow to repay the debt.. ప్రతి ఏటా అప్పుల వ్యవసాయమే. అయినా సాగు విడిచిపెట్టని రైతు అతను. చేసిన అప్పలు తీర్చడానికి తన భార్య నగలు బ్యాంకులో తాకట్టు పెట్టాడు. నగదు తీసుకుని ఇంటికి వస్తుండగా దొంగలు ఎత్తుకెళ్లారు.

If you borrow to repay the debt.. అప్పు తీర్చేందుకు అప్పు చేస్తే..
సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు

అప్పు తీర్చేందుకు అప్పు చేస్తే..

వెంబడించి.. మభ్యపెట్టిన దొంగలు

రూ.2.20 లక్షలతో ఉడాయింపు

లబోదిబోమంటున్న బాధిత రైతు

తమ పరిధి కాదన్న రాజాం పోలీసులు

సంతకవిటిలో బాధితుడి ఫిర్యాదు

అప్పటికే ఉడాయించిన దొంగలు

ప్రతి ఏటా అప్పుల వ్యవసాయమే. అయినా సాగు విడిచిపెట్టని రైతు అతను. చేసిన అప్పలు తీర్చడానికి తన భార్య నగలు బ్యాంకులో తాకట్టు పెట్టాడు. నగదు తీసుకుని ఇంటికి వస్తుండగా దొంగలు ఎత్తుకెళ్లారు. బాధిత రైతు రాజాం పోలీసుస్టేషన్‌కు వెళ్తే.. అది తమ పరిధి కాదన్నారు. దీంతో ఆ రైతు సంతకవిటికి వెళ్లి ఫిర్యాదు చేశారు. అప్పటికే దొంగలు ఉడాయించేశారు. రాజాం పోలీసులు ముందే స్పందించి ఉంటే.. సమీప పోలీసుస్టేషన్లను అప్రమత్తం చేసి ఉంటే.. దొంగలు దొరికేవారేమో! ఆ అప్పుల రైతుకు న్యాయం జరిగి ఉండేదేమో!

రాజాం రూరల్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ అవసరాల కోసం వీలున్న చోటల్లా అప్పులుచేసి సేద్యం చేశాడా రైతు. పంట చేతికి రాకముందే అప్పిచ్చిన వారు తీర్చాలని ఒత్తిడి చేయడంతో భార్య బంగారు ఆభరణాలను రాజాంలోని ఓ బ్యాంకులో తనఖా పెట్టాడు. వచ్చిన మొత్తాన్ని ఇంటికి తీసుకువెళ్తుండగా బాంకులో నుంచే ఆ రైతును గమనిస్తూ అనుసరించిన ముగ్గురు వ్యక్తులు సినీఫక్కీలో నగదును ఎత్తకెళ్లారు. రాజాం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిందంతా రైతు చెప్పగా మొత్తం విన్నాక అక్కడి సిబ్బంది చోరీ జరిగిన ప్రదేశం రాజాం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి రాదని, సంతకవిటి పొలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఆ రైతు హతాశుడయ్యాడు. చేసేదిలేక ఈసురోమంటూ సంతకవిటి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజాం మునిసిపాలిటీ పరిధిలోని పొనుగుటివలస గ్రామ సమీపంలో ఈనెల 16న సాయంత్రం జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళితే..

రేగిడి మండలం బూరాడ గ్రామానికి చెందిన సన్నకారు రైతు పల్ల వెంకటరమణ వ్యవసాయ అవసరాల కోసం కొన్నాళ్ల క్రితం తెలిసినవారి వద్ద రూ.2 లక్షలు అప్పు చేశాడు. అయితే అప్పు ఇచ్చినవారు అప్పు తీర్చాలని ఒత్తిడి చేయడంతో ఆయన తన మిత్రుడు అల్లు పాపినాయుడితో కలిసి భార్య బంగారునగల్ని రాజాంలోని కెనరాబ్యాంక్‌లో ఈనెల 16న తనఖా పెట్టాడు. రూ.2.20 లక్షల రుణం ఇస్తామని చెప్పిన బ్యాంకు సిబ్బంది మూడు గంటల సమయంలో నగదు తీసుకోవాలని సూచించారు. దీంతో వెంకటరమణ మొగిలివలస గ్రామంలోని బంధువుల ఇళ్లకు వెళ్లి తిరిగి బ్యాంకుకు వచ్చాడు. రూ.2.15 లక్షల నగదు విత్‌డ్రా చేసి తన ద్విచక్ర వాహనంలోని ట్యాంకు కవర్‌లో ఉంచి మిత్రుడు పాపినాయుడుతో కలిసి వేర్వేరు బైక్‌లపై బూరాడకు బయలుదేరారు. ఉదయం నుంచి వీరిద్దరి కదలికల్ని గమనించిన ఆ ముగ్గురూ ఒకే ద్విచక్రవాహనంపై వారిని అనుసరిస్తూ వెళ్లారు. ఇదేమీ గమనించని వెంకటరమణ, అతని స్నేహితుడు పొనుగుటివలసకు వెళ్లే మార్గంలో ఓ పకోడి బండివద్ద ద్విచక్ర వాహనాలను ఆపారు. పకోడి కొనేందుకు వెళ్లారు. ఇదే అదనుగా ఆ ముగ్గురిలో ఓ వ్యక్తి వాటర్‌బాటిలో కలిపి ఉంచిన ద్రావణాన్ని వెంకటరమణ షర్ట్‌ వెనుక జల్లాడు. మరో వ్యక్తి అక్కడకు చేరుకుని షర్ట్‌పై మరకలున్నాయి క్లీన్‌ చేయాలంటూ వాటర్‌బాటిల్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో కాస్త దూరంలో ఉన్న మరోవ్యక్తి ద్విచక్ర వాహనం వద్దకు చేరుకుని ట్యాంకు కవర్‌లో ఉన్న నగదు బ్యాగ్‌ను చోరీచేశాడు. షర్ట్‌ను పరిశుభ్రం చేసుకునే పనిలో వెంకటరమణ ఉండడంతో ముగ్గురూ నగదు బ్యాగ్‌తో రాజాం వైపు ఉడాయించారు. నగదు పోయిందని తెలుసుకున్న వారిద్దరూ తేరుకుని రాజాం పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.

రాజాం పోలీసులు స్పందిస్తే..

చోరీ జరిగిన కొద్దిసేపటికే బాధితుడు రాజాం పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. అక్కడి సిబ్బంది ఈ విషయాన్ని వెంటనే స్టేషన్‌ ఆఫీసర్‌ దృష్టికి తీసుకువెళ్లి ఉంటే.. పోలీసులు రంగంలోకి దిగి విజయనగరం రోడ్‌లోని పోలీస్‌స్టేషన్లను అప్రమత్తం చేసి ఉంటే నగదుతో ఉడాయించిన దొంగల ఆచూకీ లభ్యమయ్యేదేమోనని చర్చించుకుంటున్నారు.

కొంప ముంచుతున్న హద్దుల సమస్య

రోడ్డు ప్రమాదాలు, చోరీల విషయంలో సరిహద్దు సమస్య బాధితుల్ని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. మునిసిపాలిటీ పరిధిలోని డోలపేట చెక్‌పొస్ట్‌ వరకూ రాజాం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉండగా, మారుతీనగర్‌ నుంచి జి.ఎం.ఆర్‌.ఐటి., జి.ఎం.ఆర్‌.కేర్‌, డిఎవీ స్కూల్‌, పొనుగుటివలస తదితర ప్రాంతాలు సంతకవిటి పోలీస్‌ స్టేషన్‌లో ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాలలో చోరీలు జరిగినా, రోడ్డు ప్రమాదాలు సంభవించినా కిలోమీటర్‌ దూరంలో ఉన్న రాజాంకు బదులు 15 కిలో మీటర్లు దూరంలో ఉన్న సంతకవిటి స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సిన దుస్థితి ఎదురవుతోంది. పోలీస్‌ ఉన్నతాధికారులు ఈ విషయంలో స్పందించాల్సి ఉంది.

సీసీ ఫుటేజీల్లో ఇద్దరి ఆచూకీ

సంతకవిటి పోలీసులు రంగంలోకి దిగారు. నగదు పోగొట్టుకున్న వెంకటరమణతో కలిసి రాజాం ప్రాంతంలోని అంబేడ్కర్‌ జంక్షన్‌లోని పెట్రోల్‌బంక్‌, కెనరాబ్యాంక్‌ తదితర ప్రాంతాలలో సీసీ ఫుటేజీలను మంగళవారం పరిశీలించారు. రాజాం నుంచి పెనుబాక, బొద్దాం మీదుగా చీపురుపల్లి వైపు దొంగలు వెళ్లినట్లు వెంకటరమణ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. సీసీ ఫుటేజీలలో ఇద్దరు వ్యక్తులు కనిపించారని ఆయన తెలిపారు. హెచ్‌సీ రామకృష్ణ కేసు నమోదు చేసినట్లు సంతకవిటి ఎస్‌ఐ గోపాలరావు తెలిపారు.

Updated Date - Feb 17 , 2026 | 11:55 PM