Share News

If two months, he will get long life.. రెండు నెలలుంటే దీర్ఘాయుస్సు పొందేవాడే..

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:41 PM

If two months, he will get long life.. ఆ బాలుడు చదువులో ముందుండేవాడు. ఆట, పాటలు, సాంస్కృతిక ప్రదర్శనల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అన్నింటా ప్రతిభ చాటేవాడు. అందరితో చలాకీగా మెలగడం చూసి తల్లిదండ్రులు ఎంతో ఊరట చెందేవారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న తనయుడ్ని కాపాడుకోవాలని ఎంతో ప్రయత్నించారు. రూపాయి రూపాయి కూడబెట్టారు. రెండు నెలల్లో శస్త్రచికిత్స చేయించి పూర్తిగా వ్యాధిని దూరం చేయాలని అనుకున్నారు. వారొకటి తలిస్తే విధి మరోలా చేసింది.

If two months, he will get long life.. రెండు నెలలుంటే  దీర్ఘాయుస్సు పొందేవాడే..
భరత్‌(ఫైల్‌)

రెండు నెలలుంటే

దీర్ఘాయుస్సు పొందేవాడే..

శస్త్రచికిత్సకు డబ్బులు సిద్ధం చేసుకుంటున్న తల్లిదండ్రులు

అంతలోనే మృత్యుతీరానికి చేరిన బాలుడు

తలసేమియాతో బాధపడుతూ మృతి

ఆ బాలుడు చదువులో ముందుండేవాడు. ఆట, పాటలు, సాంస్కృతిక ప్రదర్శనల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అన్నింటా ప్రతిభ చాటేవాడు. అందరితో చలాకీగా మెలగడం చూసి తల్లిదండ్రులు ఎంతో ఊరట చెందేవారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న తనయుడ్ని కాపాడుకోవాలని ఎంతో ప్రయత్నించారు. రూపాయి రూపాయి కూడబెట్టారు. రెండు నెలల్లో శస్త్రచికిత్స చేయించి పూర్తిగా వ్యాధిని దూరం చేయాలని అనుకున్నారు. వారొకటి తలిస్తే విధి మరోలా చేసింది. తొమ్మిదేళ్లకే బాలుడి ఆయువును తీసుకుపోయి తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. శాసనపల్లికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు గంధవరపు భరత్‌ విషాదాంతమిది.

జామి, మార్చి 4(ఆంధ్రజ్యోతి):

శాసనపల్లికి చెందిన గంధవరపు లక్ష్మి, అప్పారావుకు ఇద్దరు కుమారులు. చిన్నోడు భరత్‌(9) నాలుగో తరగతి చదువుతున్నాడు. పెద్ద కుమారుడు సత్యప్రవీణ్‌ ఏడో తరగతి చదువుతున్నాడు. భరత్‌ పుట్టినప్పటి నుంచి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు. నాలుగో నెల వయసులోనే తలసేమియా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిది. శస్త్ర చికిత్స చేయించడానికి రూ.లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పడంతో ఆర్థిక స్థోమత లేక ఆగిపోయారు. ఆ తర్వాత నుంచి ప్రతినెలా విశాఖ కెజీహెచ్‌కు తీసుకెళ్లి రక్తమార్పిడి చేయిస్తున్నారు. మంగళవారం ఎప్పటిలాగే విశాఖ తీసుకెళ్లి రక్తం ఎక్కించాక రాత్రి ఇంటికి వచ్చేశారు. కొన్ని సందర్భాల్లో రక్తం ఎక్కించాక జ్వరం వస్తుండేది. ఇప్పుడు కూడా జ్వరం వచ్చింది. తీవ్రంగా ఉండడంతో మాత్రలు వేశారు. అయినా తగ్గకపోవడంతో రాత్రి సమయంలోనే మళ్లీ కేజీహెచ్‌కు బయలుదేరారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున బాలుడు మృతిచెందాడు.

తొమ్మిదేళ్లుగా ప్రయత్నిస్తూ..

భరత్‌ తల్లి లక్ష్మి విజయనగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుండగా తండ్రి అప్పారావు వంట పనులు చేస్తుంటాడు. కుమారుడ్ని ఎలాగైనా బతికించుకోవాలని ఎనిమిదేళ్లుగా వారు ఆస్పత్రులకు తిప్పుతున్నారు. ప్రతి నెలా విశాఖ కేజీహెచ్‌కు తీసుకువెళ్లి రక్తమార్పిడి చేయిస్తున్నారు. శస్త్ర చికిత్స చేయించడానికి పైసాపైసా కూడబెడుతున్నారు. ఈక్రమంలో స్థానిక టీడీపీ నాయకుల ద్వారా విషయాన్ని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడ్ని సంప్రదించారు. ప్రభుత్వం నుంచి రూ.పదిలక్షల వరకు ఇప్పిస్తామని ఆయన చెప్పడంతో మిగత డబ్బులు అప్పుచేసి సమకూర్చుకున్నారు. మరో రెండునెలల్లో సర్జరీ చేయిద్దామనుకుంటున్నారు. తొమ్మిదేళ్లుగా కాపాడుకుంటున్న తమ కుమారుడ్ని అంతలోనే మృత్యువు కబళించిందని కన్నీరు మున్నీరవుతున్నారు.

ఫ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో భరత్‌ నాలుగో తరగతి చదువుతున్నాడు. చదువులో ముందుండేవాడు. హెచ్‌ఎం పైడిపునాయుడు మాట్లాడుతూ చదువు, సాంస్కృతిక ప్రదర్శనల్లో చురుగ్గా ఉండేవాడని, జనవరి 26న పాఠశాల విద్యార్థుల మధ్య పుట్టినరోజు చేసుకున్నాడని తెలిపారు. ప్రతినెలా రక్తం ఎక్కించుకొని వచ్చాక సాధారణంగానే ఉండేవాడని, అకస్మాత్తుగా ఇలా జరగడం చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి మృతికి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు బుధవారం కొద్దిసేపు మౌనం పాటించారు.

Updated Date - Mar 04 , 2026 | 11:41 PM