Share News

Funds Will Come! ఆ పన్నులు రద్దు చేయకుంటే.. నిధులు రావంట!

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:08 AM

If Those Taxes Are Not Withdrawn… Funds Will Come! సాలూరు మునిసిపాలిటీలో అధికారు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరికొద్దిరోజుల్లోనే పాలకవర్గం పదవీ కాలం పూర్తవుతుండగా.. ఈలోపు గానే వారు ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

  Funds Will Come!    ఆ పన్నులు రద్దు చేయకుంటే.. నిధులు రావంట!
సాలూరు మునిసిపల్‌ కార్యాలయం

  • 15 ఆర్థిక సంఘం నిధులు, పన్ను బకాయి రద్దుకు లింకు!

  • పాలకవర్గంతో చర్చించకుండానే నిర్ణయం

  • రూ.కోటి పన్ను రద్దు అంశాన్ని టేబుల్‌ అజెండాగా చేర్చిన వైనం

  • వారు తీరుపై అనేక సందేహాలు.. తెర వెనుక ఉన్నదెవరో?

సాలూరు, ఫిబ్రవరి22(ఆంధ్రజ్యోతి): సాలూరు మునిసిపాలిటీలో అధికారు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరికొద్దిరోజుల్లోనే పాలకవర్గం పదవీ కాలం పూర్తవుతుండగా.. ఈలోపు గానే వారు ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కీలకమైన పన్నుల రద్దు విషయంలో కనీసం పాలకవర్గంతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా పురపాలన గాడి తప్పింది.. అటు అధికారులు.. ఇటు పాలకవర్గం.. ఎవరికివారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్య లను పక్కన పెట్టి.. పురపాలక సంఘా నికి ఆస్తి పన్నుల రూపంలో రావల్సిన ఆదాయం విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యహరిస్తుండడంపై ప్రజలు మండి పడుతున్నారు.

అధికారుల వాదన ఇలా..

మునిసిపాలిటీలో సుమారు రూ.కోటీ 40 లక్షల వరకు ఆస్తి పన్ను బకాయి ఉండడం వల్ల పురపాలక సంఘానికి సుమారు రూ.కోటీ 50 లక్షల వరకు 15వ ఆర్థిక సంఘం నిధులు రావడం లేదని అధికారుల వాదన. అయితే ఆస్తి పన్ను బకాయికి, ఈ నిధులకు ఏంటి సంబంధమన్నది వారికే తెలియాల్సి ఉంది. 2023-24 వరకు ఏటా వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులు 2024-25లో ఎందుకు ఆగిపోయాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఉన్నతాధికారులు, సీడీఎంఏ నుంచి ఎలాంటి లిఖిత పూర్వక వివరణతో కూడిన ఆధారాన్ని మునిసిపల్‌ అధికారులు చూపించక పోవడం గమనార్హం. అదేవిధంగా నాట్‌ ట్రేస్‌డ్‌, మొండి బకాయిలు పెద్ద మొత్తంలో ఉన్న వాటిని రద్దు చేయాలని వచ్చే ఆదేశాలకు సంబందించిన జీవో కాపీని కూడా అధికారులు చూపించడం లేదు. అయితే వాటిని రద్దు చేయకపోతే మునిసిపాల్టీ అభివృద్ధి చెందదనిమాత్రం మునిసిపల్‌ అధికారులు చెబుతున్నారు.

ఇదీ పరిస్థితి..

- సాలూరు పురపాలక సంఘంలో 1264 వరకు ప్రైవేట్‌ ఆస్తులు ఉన్నాయి. వాటి నుంచి ఏటా రూ. మూడు కోట్ల 31 లక్షల వరకు పన్ను రూపంలో మునిసిపాలిటీకి ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఆర్టీసీ, ఏఎంసీ, అగ్నిమాపక శాఖతో పాటు మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలు (40 ఆస్తులకు సంబంధించి) ఏటా పన్ను కింద రూ.68 లక్షల 97 వేలు చెల్లిస్తున్నాయి. అయితే ఎంపీడీవో, తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ర్టార్‌ తదితర కార్యాలయాలు మాత్రం పన్నులు చెల్లించడం లేదు. ఇక కేంద్ర ప్రభుత్వం శాఖలకు చెందిన ఆరు కార్యాలయాల నుంచి రూ. 9 లక్షల 23 వేల వరకు పన్ను రూపంలో మునిసిపాలిటీకి ఆదాయంగా వస్తుంది.

- పట్టణంలో సుమారు వంద ఆస్తులకు సంబంధించి 15ఏళ్లకు పైగా కొంతమంది పన్ను చెల్లించడం లేదు. మరో 40 ఆస్తులకు సంబంధించి.. ప్రాపర్టీ ఒకటే అయినా రెండు సార్లు అధికారులు పన్ను నమోదు చేశారు. మొత్తంగా 140 ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తుల నుంచి మునిసిపాల్టీకి పన్ను రూపంలో సుమారు రూ.కోటీ 40 లక్షల వరకు రావల్సి ఉంది. నోటీసులు ఇచ్చినా సదరు వ్యక్తులు స్పందించడం లేదు. దీనిపై గత ఐదేళ్లుగా పాలకవర్గం కానీ అధికారులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ఈ ఏడాది జనవరి నెలలో జరిగిన పాలకవర్గ సమావేశంలో రూ.కోటీ 40 లక్షల పన్ను రద్దు కోసం అధికారులు టేబుల్‌ అజెండాగా పెట్ట డంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యపై మునిసిపల్‌ అధికారులు పాలక వర్గంతో చర్చించకుండానే.. టేబుల్‌ అజెండాగా ఎందుకు పెట్టారు? ఎవరికి మేలు చేసేం దుకనే దానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తమకు చర్చించ కుండా అధికారులే ఈ నిర్ణయం తీసుకోవడంతో పాలకవర్గం పన్ను రద్దు అంశాన్ని వాయిదా వేసింది.

నచ్చినట్లుగా పన్నుల విధింపు

- పట్టణంలో ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి 15 ఏళ్ల కిందట తనకు చెందిన అనేక ఆస్తులను క్రయ విక్రయాలు చేశారు. అయితే ఆయన అమ్మకాలు జరిపిన ఆస్తులకు సైతం మునిసిపల్‌ అధికారులు ఏటా పన్నులు వేయడంపై సదరు వ్యక్తి అసహనం వ్యక్తం చేస్తున్నాడు.

- మక్కువ బైపాస్‌ రోడ్డు సర్వే నెంబరు 129/2లో ఉన్న 2.47 ఎకరాల ఖాళీ స్థలానికి మునిసిపల్‌ అధికారులు ఎలా పన్ను వేశారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అది వ్యవసాయ భూమి కాగా వ్యాపార స్ధ్థలంగా మార్పు (ల్యాండ్‌ కన్వర్షన్‌) జరిగిందా?లేదా? అనేది అధికారులు చూడకపోగా.. ఆ ఖాళీ స్థలానికి ఏకంగా రూ.24 లక్షలు పన్ను బకాయి చూపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కోటీ 70 లక్షలు వసూలు

మునిసిపాలిటీ ఆస్తి పన్ను లక్ష్యం రూ.3.31 కోట్లు. కాగా ఇప్పటివరకు అధికారులు దాదాపు రూ.కోటీ 70 లక్షల వరకు వసూలు చేశారు. మార్చి 31లోగా శతశాతం పన్ను వసూలు చేయాల్సి ఉంది. అయితే అప్పటికి ఏ మేరకు పన్ను వసూలు చేస్తారో వేచి చూడాలి.

వాయిదా వేశారు..

నాట్‌ ట్రేస్డ్‌, మొండి బకాయిలు మాఫీకి సంబంధించి టెబుల్‌ అజెండా అంశంగా చేర్చాం. అయితే దానిని మునిసిపల్‌ పాలకవర్గం వాయిదా వేసింది. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

- నారాయణరావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, సాలూరు మునిసిపాలిటీ

Updated Date - Feb 23 , 2026 | 12:08 AM