Share News

Work Get Done? ఇలా అయితే.. పనులెలా?

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:35 PM

If This Is the Situation… How Will the Work Get Done? జిల్లాలో ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతో చేపట్టిన పనులకు గత ఏడాది ఏప్రిల్‌ నుంచి బిల్లుల చెల్లింపులు జరగడం లేదు. పంచా యతీరాజ్‌, గిరిజన ఇంజనీరింగ్‌ తదితర శాఖల ద్వారా చేపట్టిన రహదారుల పనులకు సంబంధించి కోట్లాది రుపాయల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

  Work Get Done? ఇలా అయితే.. పనులెలా?

  • ఉపాధి మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతో కింద పనులపై ప్రభావం

  • సిబ్బందికీ అందని వేతనాలు

పార్వతీపురం, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతో చేపట్టిన పనులకు గత ఏడాది ఏప్రిల్‌ నుంచి బిల్లుల చెల్లింపులు జరగడం లేదు. పంచా యతీరాజ్‌, గిరిజన ఇంజనీరింగ్‌ తదితర శాఖల ద్వారా చేపట్టిన రహదారుల పనులకు సంబంధించి కోట్లాది రుపాయల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా నిబంధనలు మార్పుతో కొంతకాలం బిల్లులు అప్‌లోడ్‌ కాలేదు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపల చెల్లించకుంటే మెటీరియల్‌ కాంపోనెంట్‌ ద్వారా చేపట్టే పనులు ఏ విధంగా పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో మెటీరియల్‌ కాంపోనెంట్‌ ద్వారా చేపట్టే పనులకు కేంద్రం 90 శాతం నిధులు మంజూరు చేసేది. మిగతా పది శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేది. అయితే తాజాగా నిబంధనలతో కేంద్రం 60 శాతం, రా ష్ట్రం 40 శాతం నిధులు చెల్లించాల్సి ఉంది. మరోవైపు పంచాయతీలో పదికి మించి పనులు మంజూరు కావు. ఇలా అయితే వేతనదారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. నూతన నిబంధనల ప్రకారం.. ఒక పంచాయతీలో రూ.రెండు కోట్లతో బీటీ రహదారుల నిర్మాణం చేపడితే బిల్లులు ఒక్కసారిగా అప్‌లోడ్‌ అవ్వవు. ఆ రోడ్డును నాలుగు రీచ్‌లుగా విభజించి బిల్లులు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న టెక్నికల్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌తో పాటు కంప్యూటర్‌ ఆపరేటర్లకు జనవరిలో వేతనాలు అందలేదు. దీంతో పండుగ నెలలో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నేడు జిల్లాకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజ రానున్న నేపథ్యంలో తమ సమస్యలపై స్పందించాలని వారు కోరుతున్నారు.

నేడు జిల్లాకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజ రాక

రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ మైలవరపు కృష్ణతేజ గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా అధికారులతో కలిసి పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు జిల్లాకు చేరుకొని కలెక్టరేట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖాధికారులతో సమీక్షిస్తారు. అనంతరం పట్టణంలోని ఓ కన్వెన్షన్‌ హాల్‌లో పంచాయతీరాజ్‌ అధికారులతో ప్రత్యేక రివ్యూ మీటింగ్‌ నిర్వహిస్తారు.

Updated Date - Feb 04 , 2026 | 11:35 PM