Share News

కన్ను పడితే కబ్జాయే

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:50 PM

మండలంలో ప్రభుత్వ భూములు, స్థలాల ఆక్రమణలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

  కన్ను పడితే కబ్జాయే
ఆర్‌అండ్‌బీ స్థలాన్ని చదును చేసిన దృశ్యం

- ఆర్‌అండ్‌బీ స్థలం ఆక్రమణ

- జిరాయితీ భూమిపేరుతో చదును చేస్తున్న వైనం

చీపురుపల్లి, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రభుత్వ భూములు, స్థలాల ఆక్రమణలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కన్ను పడితే కబ్జాయే అన్నట్లు పరిస్థితి మారింది. ముఖ్యంగా చీపురుపల్లి నుంచి శ్రీకాకుళం వెళ్లే రోడ్డులో ఈ కబ్జాలపర్వం మరింత ఎక్కువగా ఉంది. ఇటీవల కర్లాం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 408లోని 48 ఎకరాలు కబ్జాకు గురికాగా, తాజాగా అదే గ్రామ రెవెన్యూలో ఆర్‌అండ్‌బీకి చెందిన భూమి అన్యాక్రాంతం అవుతోంది. చీపురుపల్లి-శ్రీకాకుళం రోడ్డులోని కర్లాం జంక్షన్‌ వద్ద జిరాయితీ భూములు కలిగి ఉన్న ఓ రైతు తమ మామిడి తోటకు ఆనుకొని ఉన్న తాటి చెట్లను తొలగించారు. ఈ చెట్లను తొలగించడంలో ఎటువంటి వివాదం లేకపోయినప్పటికీ, తన హద్దులను దాటి తారు రోడ్డు వైపు ఉన్న స్థలాన్ని కాజేయాలని చూస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఆనుకొని సుమారు కిలోమీటరు పొడవున భూమిని సదరు తోట యజమాని చదును చేయిస్తున్నాడు. కర్లాంకు చెందిన కొంతమంది రైతులు అడ్డుకోడానికి ప్రయత్నించగా, ఇది తన జిరాయితీ భూమిగా ఆయన చెప్పుతున్నాడని రైతులు తెలిపారు. దీనిపై చీపురుపల్లి ఆర్‌అండ్‌బీ ఏఈ కె.మురళిని వివరణ కోరగా.. ‘విషయం నా దృష్టికి వచ్చింది. రెవెన్యూ అధికారులతో కలిసి సంయుక్తంగా తనిఖీ చేస్తాం. స్థలం ఆక్రమణకు గురైందని తేలితే తగిన చర్యలు తీసుకుంటాం.’ అని అన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 11:50 PM