Share News

వారికి నచ్చితే అంతా సక్రమమే

ABN , Publish Date - Apr 23 , 2026 | 11:27 PM

సామాన్య రైతులు, స్థిరాస్థి వ్యాపారం చేసే యజమానుల విషయంలో రెవెన్యూ, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు ఈ రెండు ఘటనలు ఉదాహరణలు.

వారికి నచ్చితే అంతా సక్రమమే
ఎస్‌.కోట మండలంలో జిందాల్‌ పరిశ్రమకు కేటాయించిన భూములు

- లేదంటే కొర్రీలు

- ప్రభుత్వ భూమిని జిరాయితీగా రిజిస్ట్రేషన్‌

- దీన్నే జిందాల్‌ భూసేకరణలో అప్పగింత

- ఎమ్మెల్సీ ఫిర్యాదులో అధికారుల విచారణ

- కలెక్టర్‌కు చేరిన నివేదిక

- శృంగవరపుకోట మండలం గోపాలపల్లికి చెందిన రైతు నుంచి 70 సెంట్ల భూమిని మరో రైతు కోనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్‌ కోసం స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లాడు. భూమి డాక్యుమెంట్‌లో ఉన్న సర్వే నెంబర్‌కు, ఎల్‌పీఎం నెంబర్‌, సర్వే నెంబర్‌కు మధ్య వ్యత్యాసం ఉండడంతో రిజిస్ట్రేషన్‌ జరగలేదు. దీన్ని సరి చేసేందుకు ఆ రైతు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఆర్డీవో, జేసీ, డీఆర్వో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. మూడు నెలల తరువాత సమస్య పరిష్కారమైంది.

- శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో 4.54 ఎకరాల ప్రభుత్వ (గయాలు) భూమి ఉంది. ఈ భూమిని ముగ్గురు వ్యక్తులకు డి.పట్టాగా ఇచ్చారు. ఈ భూమిని 2007-2008లో ప్రభుత్వం జిందాల్‌ సౌత్‌ వెస్ట్‌ అల్యూమినియం లిమిటెడ్‌కు అప్పగించడంతో ఆ మేరకు రిజిస్ట్రేషన్‌ జరిగింది. ప్రభుత్వ భూముల నిషేధిత జాబితా (22ఏ)లో ఈ భూమిని ఉంచారు. మూడేళ్ల కిందట ఈ భూమిని జిందాల్‌ యాజమాన్యం తరఫున ఓ కీలక అధికారి రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల అధికారుల సహకారంతో జిరాయితీ భూమిగా మార్పుచేసి రిజిస్ట్రేషన్‌ చేసేశారు.

శృంగవరపుకోట ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): సామాన్య రైతులు, స్థిరాస్థి వ్యాపారం చేసే యజమానుల విషయంలో రెవెన్యూ, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు ఈ రెండు ఘటనలు ఉదాహరణలు. వారు తలుచుకుంటే అది తప్పు అయినా ఒప్పుగా మారిపోతుంది. లేదంటే అన్నీ సక్రమంగా ఉన్నా ఏదోఒక కొర్రీ పెడుతుంటారు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా లేదా కొనుగోలు ద్వారా వచ్చిన జిరాయితీ భూముల రికార్డులను సరి చేసేందుకు, వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసేందుకు రైతులను రెవెన్యూ అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఎల్‌పీఎం నెంబర్‌లో ఒక అంకె తప్పుగా కనిపించినా, భూ విస్తీర్ణంలో సెంటు తేడా చూపించినా ఆ భూములను రిజిస్ట్రేషన్‌ చేయకుండా ఆ డాక్యుమెంట్లను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులు పక్కన పడేస్తున్నారు. అదే ఎస్‌ఎఫ్‌ఏ, ఎఫ్‌సీవో వంటి రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్న వాటిని జిరాయితీ భూములుగా మార్పు చేసి జిందాల్‌ పరిశ్రమ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేస్తున్నారు. జిందాల్‌ యాజమాన్యం, భూ నిర్వాసితుల మధ్య జరుగుతున్న వివాదంలో ఈ విషయం వెలుగు చూసింది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఈనెల 16న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టగా ఇదంతా బయటపడింది.

ఏం జరిగిందంటే..

రెవెన్యూ రికార్డుల్లో ఎస్‌ఎఫ్‌ఏ, ఎఫ్‌సీవో రికార్డులు కీలకం. కిల్తంపాలెం రెవెన్యూ గ్రామంలో ఈ రెండు రికార్డుల ప్రకారం 189-1 సర్వే నెంబర్‌లో 4.54 ఎకరాలు ఉంది. భూమి స్వరూపం పుంజ, మెట్టగా ఉండగా, గయాలుగా పట్టాదారు పేరు ఉంది. 189-2లో ఎకరా పుంజ, మెట్ట భూమి ఉంది. దీనికి సంబంధించి మతల పెదఅప్పన్న కుమారుడు సూర్యనారాయణ పేరు జిరాయితీ పట్టాదారునిగా నమోదైంది. వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌ ప్రకారం 189.1 సర్వే నెంబర్‌లో 4.54 ఎకరాల మెట్టుగా ఉన్న భూమిని జిందాల్‌ వెస్ట్‌ అల్యూమినియం లిమిటెడ్‌గా పట్టాదారుని పేరు, 189-2 సర్వే నెంబర్‌లో ఎకరా మెట్టు భూమి చింతాడ దంతివెంకట నాగేంద్రబాబు తండ్రి పసల నాయుడుగా పట్టాదారు పేరు ఉంది. ఎస్‌ఎఫ్‌ఏ, ఎఫ్‌సీవో రికార్డుల్లో లేని 189-4 సర్వే నెంబర్‌లో 3.20 ఎకరాల మెట్ట భూమిని రొంగలి సత్యవతి భర్త మధుసూదనరావు పేరును వెబ్‌ల్యాండ్‌ అదనంగా నమోదు చేశారు. దీంతో 189-1, 189-2 సర్వే నెంబర్లలోని మొత్తం 5.54 ఎకరాల భూమి వెబ్‌ల్యాండ్‌లో జిరాయితీగా మారిపోయింది. అదనంగా 189-4 సర్వే నెంబర్‌ పేరుతో 3.20 ఎకరాలు జిరాయితీ భూమిగా వచ్చి చేరింది. మొత్తం 189 సర్వేనెంబర్‌లో 8.74 ఎకరాల జిరాయితీ భూమి వెబ్‌ల్యాండ్‌లో ఉంది. 189-1 సర్వే నెంబర్‌ గయాలు (ప్రభుత్వ) భూమి కావడంతో ఇదే సర్వే నెంబర్‌లో 0.88 ఎకరాలను మజ్జి అప్పయ్యమ్మ పేరిట డి.పట్టా ఇచ్చారు. రెవెన్యూ రికార్డుల్లో కనిపించని 189-4 సర్వే నెంబర్‌లో 1.46 ఎకరాలను ఒంటి రాములు, 2.02 ఎకరాలను మతల నారాయణమ్మ భర్త సూర్యనారాయణ పేరిట డి.పట్టాలు ఇచ్చారు. ఇందులో ఇద్దరు డి.పట్టాదారులకు జిందాల్‌ భూసేకరణలో భాగంగా రూ.4.69 లక్షల పరిహారం అందించారు. రికార్డుల్లో మాత్రం 189-1 సర్వే నెంబర్‌గా చూపించారు. ఈ సర్వే నెంబర్‌లోని భూమినంతా జిందాల్‌ పరిశ్రమకు రిజిస్ట్రేషన్‌ జరగడంతో వెబ్‌ల్యాండ్‌లోకి చేర్చారు. అయినప్పటికీ 22ఏ జాబితాలోనే వాటిని ఉంచారు. అయితే, రికార్డుల్లో లేని 189-4తో రెవెన్యూ అధికారులు 3.48 ఎకరాల భూమికి డి.పట్టాను ఎలా జారీ చేశారో అంతుపట్టడంలేదు. అదే విధంగా 189-4 సర్వే నెంబర్‌తో ఉన్న 3.20 ఎకరాలను వెబ్‌ల్యాండ్‌లో జిరాయితీగా ఏ విధంగా నమోదు చేశారో వారికే తెలియాలి. వాస్తవానికి 189-1, 189-2 తరువాత 189-3 సర్వే నెంబర్‌ కనిపించాలి. కానీ, ఈ నెంబర్‌ మాన్యూవల్‌ రికార్డుల్లో గానీ, వెబ్‌ల్యాండ్‌లో గానీ కనిపించడం లేదు. ఆ నెంబర్‌ను తప్పించి 189-4ను వెబ్‌ల్యాండ్‌ చూపించడం రెవెన్యూకే చెల్లింది. ఈ సర్వే నెంబర్‌లోని భూమి విలువ ఇప్పుడు రూ.కోట్లలో ఉంది. ఎకరా రూ.కోటి పైబడి పలుకుతుంది. దాదాపుగా రూ.5కోట్లు విలువైన భూమిని జిందాల్‌ యాజమాన్యానికి అధికారులు అప్పగించారు. ఈ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకుని స్థిరాస్థి వ్యాపారం చేసుకునేందుకు జిందాల్‌ ప్రతినిధులు ప్రయత్నించారు. విషయం బయటపడడంతో వెనక్కి తగ్గారు. ఇదే విధంగా కిల్తంపాలెం, ముషిడిపల్లి, బొడ్డవర, చీడిపాలెం, చినఖండేపల్లి గ్రామాల పరిధిలో 919.22 ఎకరాల డి.పట్టా భూములు, 152.12 ఎకరాల ప్రభుత్వ భూములను జిందాల్‌ యాజమాన్యానికి ప్రభుత్వం ఇచ్చింది. వీటిని కూడా అధికారుల సహకారంతో జిరాయితీ భూములుగా జిందాల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తహసీల్దార్‌ డి.శ్రీనివాసరావును వివరణ కోరగా.. ‘నిర్వాసితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాం. నివేదికను కలెక్టర్‌కు అందించాం. అక్కడ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం చర్యలు చేపడతాం.’ అని తెలిపారు.

Updated Date - Apr 23 , 2026 | 11:28 PM