Share News

If they did.. they took it. వారికిస్తే.. వీరు తీసుకున్నారు

ABN , Publish Date - May 12 , 2026 | 12:22 AM

If they did.. they took it. అవి పేరుకే పేదల ఇళ్ల స్థలాలు. ఎప్పుడో పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అసలైన లబ్ధిదారులను ప్రలోభాలకు గురిచేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం విజిలెన్స్‌ విచారణలో తేలింది. ప్రభుత్వానికి నివేదిక అందింది.

 If they did.. they took it. వారికిస్తే.. వీరు తీసుకున్నారు
రాజాం: కంచరాం జగనన్న కాలనీ

వారికిస్తే.. వీరు తీసుకున్నారు

కంచరాం జగనన్న లేఅవుట్‌లో భారీగా అమ్మకాలు

పేదలకు ప్రలోభం పెట్టి స్థలాలు స్వాధీనం

సెంటు రూ.60 వేలు

చేతులు మారిన వంద ఇళ్ల స్థలాలు

గుర్తించిన విజిలెన్స్‌

రాజాం, మే 11 (ఆంధ్రజ్యోతి):

అవి పేరుకే పేదల ఇళ్ల స్థలాలు. ఎప్పుడో పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అసలైన లబ్ధిదారులను ప్రలోభాలకు గురిచేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం విజిలెన్స్‌ విచారణలో తేలింది. ప్రభుత్వానికి నివేదిక అందింది. దీంతో పెద్దల్లో ఒకటే గుబులు మొదలైంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హయాంలో కేటాయించిన జగనన్న కాలనీ లేఅవుట్లలో అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ సాగింది. అందులో రాజాంలో భారీగా అక్రమాలు జరిగినట్టు విచారణ బృందం గుర్తించినట్టు తెలుస్తోంది. రాజాం మునిసిపాల్టీకి సంబంధించి అక్కడ కేటాయించిన ఇళ్ల స్థలాల్లో 70 నుంచి 100 వరకూ చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ప్రలోభాలకు గురిచేసి..

రాజాం మునిసిపాల్టీ పరిధిలో నిరుపేదలకు కంచరాం సమీపంలో జగనన్న కాలనీ లేఅవుట్‌ ఏర్పాటుచేశారు. దాదాపు 1400 మందికి పట్టాలు ఇచ్చారు. అయితే తక్కువ స్థలం కేటాయించడంతో చాలామంది ఇళ్లు కట్టేందుకు మొగ్గుచూపలేదు. అప్పుడే అధికార పార్టీ ముసుగులో బినామీలుగా కొందరు వ్యక్తులు అవతారమెత్తారు. ఆసక్తి చూపని వారికి రకరకాల ప్రలోభాలు పెట్టి పట్టాలను తీసుకున్నారు. సెంటు స్థలాన్ని రూ.60వేలకు కొనుగోలు చేశారు. ఆ తరువాత అదే స్థలంలో, అదే లబ్ధిదారుడి పేరిట ప్రభుత్వం నుంచి రూ.1.80 లక్షలు పొంది ఇళ్లు కట్టుకున్నవారూ ఉన్నారు. ఈ కాలనీ లేఅవుట్‌లో 70 నుంచి 100 వరకూ ఇదే మాదిరిగా చేతులు మారినట్టు తెలుస్తోంది. రాజాం చుట్టుపక్కల ప్రాంతాల్లో సెంటు ధర లక్షల్లో పలుకుతుండగా.. ఇక్కడ మాత్రం పేద ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రూ.60 వేలు ముట్టచెప్పి ఇంటి స్థలాన్ని కైవసం చేసుకున్నట్టు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. అప్పట్లో అధికారులు, సిబ్బంది సైతం చేతివాటానికి పాల్పడ్డారని విజిలెన్స్‌ విచారణలో తేలినట్టు తెలుస్తోంది. దీంతో బినామీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అసలు లేఅవుట్‌లో మౌలిక వసతులు లేవు. వాటిని కల్పించకపోవడానికి ప్రధాన కారణం అప్పటి నేతలే. సౌకర్యాలు కల్పిస్తే లబ్ధిదారులు స్థలాలు వదులుకునేందుకు ఇష్టపడరు. అయితే స్థలాలు చేజెక్కించుకునేందుకే అప్పట్లో పనులకు మోకాలడ్డినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై విచారణ ముగిసింది.

దర్యాప్తు జరిగింది..

లేఅవుట్లలో అక్రమాలపై విజిలెన్స్‌ దర్యాప్తు జరిగిన మాట వాస్తవమే. ఇక్కడి పరిస్థితులపై అధ్యయనం చేశారు. వివరాలు సేకరించారు. ప్రభుత్వానికి నివేదికలు అందించారు. ప్రభుత్వమే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుంది.

ఎం.రాజశేఖర్‌, తహసీల్దారు, రాజాం

Updated Date - May 12 , 2026 | 12:22 AM