Share News

If there is a case.. Careless కేసులన్నా.. కేర్‌లెస్‌

ABN , Publish Date - May 26 , 2026 | 12:03 AM

If there is a case.. Carelessపశువుల అక్రమ రవాణా, గోవధకు పాల్పడితే ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని, పీడీయాక్టు ప్రయోగిస్తామని ఎస్పీ దామోదర్‌ ఆదివారం హెచ్చరించారు. ప్రకటించి 24 గంటలూ కాలేదు ఏకంగా పశుమాంసం పట్టుబడింది. బొండపల్లి పోలీసులు 300 కేజీల పశుమాంసం తరలించడాన్ని అడ్డుకున్నారు. మూగజీవాల తరలింపు, పశుమాంసం రవాణాదారుల బరితెగింపునకు ఇదో నిదర్శనం.

If there is a case.. Careless కేసులన్నా.. కేర్‌లెస్‌
బొండపల్లిలో వాహన తనిఖీల్లో పట్టుబడిన పశుమాంసం

కేసులన్నా.. కేర్‌లెస్‌

ఎస్పీ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే పశుమాంసం తరలింపునకు యత్నం

అడ్డుకున్న బొండపల్లి పోలీసులు

ఎప్పటిలాగే కబేళాలకు తరలిపోతున్న మూగజీవులు

డ్రోన్‌లు, సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉన్నా లెక్కలేనితనం

పశువుల అక్రమ రవాణా, గోవధకు పాల్పడితే ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని, పీడీయాక్టు ప్రయోగిస్తామని ఎస్పీ దామోదర్‌ ఆదివారం హెచ్చరించారు. ప్రకటించి 24 గంటలూ కాలేదు ఏకంగా పశుమాంసం పట్టుబడింది. బొండపల్లి పోలీసులు 300 కేజీల పశుమాంసం తరలించడాన్ని అడ్డుకున్నారు. మూగజీవాల తరలింపు, పశుమాంసం రవాణాదారుల బరితెగింపునకు ఇదో నిదర్శనం. పీడీ యాక్టు ప్రయోగిస్తామన్నా కూడా వారికి భయం లేదు. సంవత్సరాలుగా చేస్తున్న అక్రమ వ్యాపారాన్ని ఆపేందుకు ఇష్టపడడం లేదు. మూగజీవాల పట్ల ఆయా వ్యక్తులు వ్యవహరిస్తున్న తీరును జిల్లా ప్రజలు తీవ్రంగా ఎండగడుతున్నారు. పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.

గజపతినగరం, మే25(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో పశువుల అక్రమ రవాణా ఆగదా?.. పశుమాంసం విక్రయాలు మానరా?.. మూగజీవాల రోదనకు చెక్‌ పడదా?.. సగటు జిల్లా వాసి ఆవేదనిది. సంవత్సరాలుగా పశువుల అక్రమ రవాణా గురించి విని విని జంతు ప్రేమికులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం దుస్థితి అంటూ వాపోతున్నారు. మరోవైపు పోలీసులు నిఘా పెంచుతున్నా ఆగడం లేదు. తాజాగా ఎస్పీ దామోదర్‌ పశువధకు పాల్పడితే పీడీ యాక్టు ప్రయోగిస్తామని హెచ్చరించారు. అయినా రవాణాదారులకు లెక్కలేకపోవడం చూసి జిల్లా ప్రజలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మూగజీవాల హింస గురించి పదే పదే వినాల్సిందేనా అని మథన పడుతున్నారు.

జిల్లాలోని పెదమానాపురం, అలమండ, అచ్యుతాపురం వారపుసంతల రోజున ఎటువంటి అనుమతులు లేకుండా పశువుల రవాణా యథేచ్ఛ సాగుతోంది. వాటిని కబేళాలకు తరలిస్తున్నారు. కొన్నిసార్లు మాత్రమే దొరుకుతున్నారు. పోలీసులు అడ్డుకునే మార్గాల్లో వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లోనూ తరలిస్తున్నారు. కాగా ఈఏడాదిలో ఇప్పటివరకు పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై 11 కేసులు నమెదు చేసి 25 మందిని అరెస్టు చేశారు. 12వాహనాలను గుర్తించి 156 పశువులను సీజ్‌ చేసినట్లు ఎస్పీ దామోదర్‌ రెండు రోజుల కిందట ప్రకటించారు. జంతువులను పరిరక్షించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని, సీసీ కెమెరాలు, మొబైల్‌ పెట్రోలింగ్‌, డ్రోన్‌ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ మాటలు చెప్పి ఒక రోజు కూడా కాలేదు. ఏకంగా పశుమాంసం పట్టుబడింది.

సంత నుంచి కబేళాలకు..

ప్రతీవారం దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం నుంచి భారీగా పశువులు కబేళాలకు తరలిపోతున్నాయి. పార్వతీపురం, ఒడిశా రాష్ట్రం నుంచి కూడా పశువులు గురువారం నుంచి పెదమానాపురం చేరుకుంటాయి. శనివారం సంత కావడంతో వ్యాపారులు శుక్రవారానికి చేరుకొని పశువులను కొనుగోలుచేసి భారీ వాహనాల్లో ఇతర రాష్ట్రాలకు తరలించుకుపోతున్నారు. అలాగే చిన్న,చిన్న వ్యాన్‌ల ద్వారా క్వింటాల కొద్దీ పశుమాంసం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పెదమానాపురం గ్రామంలోని సంతను ఆనుకొని ఏడోంపుల గెడ్డ ఉంది. అక్కడే పశువులను వధించి మాంసాన్ని తరలించేవారు. వాటి వ్యర్థాలను గెడ్డలో వదిలేయడంతో సమీప గ్రామాల వారు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నుంచి పశువులను మానాపురం పరిసరప్రాంతాల్లోని మామిడి తోటల్లో వధించి గుట్టుగా మాంసాన్ని విజయనగరం, విశాఖ, విజయవాడ తదితర పట్టణ ప్రాంతాలోని కోల్డ్‌ స్టోరేజ్‌లకు తరలిస్తున్నారు. ఆపై ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నట్లు సమాచారం.

మూడేళ్లుగా లైసెన్స్‌ లేకుండా

పెదమానాపురం సంతలో లైసెన్స్‌లు లేకుండా పశువులను కబేళాలకు తరలిస్తున్నారు. ఇది చట్ట రీత్యా నేరం. అధికారులు మామూళ్ల మత్తులో పడి పట్టించుకోవడం లేదు. ఒకే నెంబర్‌తో పదివాహనాలు తిరుగుతున్నా గుర్తించడం లేదు. పశువులు తరలించే వాహనాలకు ఆర్టీవో అనుమతి ఉండాలి. రవాణాదారులు తీసుకోవడం లేదు. జంతు సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ హోంమంత్రి అనితకు కూడా విన్నవించాం.

ఆంధ్ర ప్రదేశ్‌ గోసంవరక్ష సమైక్యరాష్ట్ర అద్యక్షులు, జీవబందు, లోగిస రామకృష్ణ

Updated Date - May 26 , 2026 | 12:03 AM