Share News

It Will Be Difficult! యుద్ధం కొనసాగితే.. కష్టమే!

ABN , Publish Date - Mar 06 , 2026 | 11:43 PM

If the War Continues… It Will Be Difficult! అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అయితే ఈ సంగ్రామం మరింత ముదిరితే అన్ని వర్గాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటివరకు ప్రవాసీయులు, పర్యాటకులకే పరిమితమైన ప్రభావం ఇప్పుడు.. దేశంలో పంట పొలాలు, వంటగదులకూ విస్తరించనుంది

 It Will Be Difficult! యుద్ధం కొనసాగితే.. కష్టమే!

  • గల్ఫ్‌ దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులకు బ్రేక్‌

  • రానున్న రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగే అవకాశం

  • అదే బాటలో వంటగ్యాస్‌, ఎరువులు, నిత్యావసరాలు

  • సామాన్య, మధ్యతరగతి వర్గాలపై తీవ్ర ప్రభావం

  • ఆందోళనలో జిల్లావాసులు

పార్వతీపురం, మార్చి6(ఆంధ్రజ్యోతి): అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అయితే ఈ సంగ్రామం మరింత ముదిరితే అన్ని వర్గాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటివరకు ప్రవాసీయులు, పర్యాటకులకే పరిమితమైన ప్రభావం ఇప్పుడు.. దేశంలో పంట పొలాలు, వంటగదులకూ విస్తరించనుంది. యుద్ధం కారణంగా హర్మోజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేసింది. దీంతో వస్తు రవాణా స్తంభించింది. గల్ఫ్‌దేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే ముడిపదార్థాలకు బ్రేక్‌ పడింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చమురుతో పాటు ఎరువులు, గ్యాస్‌లతో పాటు నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లావాసుల్లో ఆందోళన నెలకొంది. మొత్తంగా యుద్ధం మంటల సెగలు.. మన్యాన్ని పరోక్షంగా తాకనున్నాయి.

ఇదీ పరిస్థితి..

- ప్రస్తుతం యుద్ధం కొనసాగుతున్నా.. ఇంతవరకూ ధరల్లో పెద్దగా మార్పు లేదు. అయితే నిల్వలు ఉన్నంత వరకూ పర్వాలేదు. కానీ కొత్త స్టాక్‌పై సరఫరా కాకపోయినా, అంతర్జాతీయ రవాణా సంస్థలు సుంకాలు పెంచినా.. ఇబ్బందులు తప్పవు. అప్పుడు మాత్రం ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

- పెట్రోల్‌ డీజిల్‌ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. దాని ప్రభావం ప్రతి వస్తువుపై పడుతుంది. అంతిమంగా ఆ ధరల భారం ప్రజలపై పడనుంది. ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ రూ.110గా ఉంది. త్వరలోనే దాని ధర రూ.115 నుంచి రూ.125 వరకు పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అదే విధంగా డీజిల్‌ ధర ప్రస్తుతం రూ. 98 ఉండగా రానున్న రోజుల్లో రూ. 120 పెరగనుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవారం రోజులు పాటు యుద్ధం కొనసాగితే.. గల్ఫ్‌ దేశాల నుంచి భారత్‌కు చమురు దిగుమతులు నిలిచిపో నున్నాయి. అదే జరిగితే జిల్లాలోనూ పెట్రోల్‌, డీజిల్‌కు కొరత ఏర్పడనుంది. మరోవైపు వ్యాపా రులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా రానున్న రోజుల్లో వంట నూనెల ధరలు కూడా పెరగనున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలకు ముప్పు ఏర్పడితే, విదేశాల నుంచి వచ్చే వంటనూనెల (పామాయిల్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌) సరఫరాకు బ్రేకులు పడతాయి. ఇప్పటికే కిరాణా దుకాణాల్లో వంట నూనెల ధరలు సామాన్యులను భయపెడుతున్నాయి. 800 గ్రాముల నూనె ప్యాకెట్‌ రూ.140 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ధరలకు మరింత రెక్కలొచ్చే ప్రమాదం ఉందని జిల్లా వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- దేశ రైతులు ఉపయోగించే ఎరువుల్లో డీఏపీ ముఖ్యమైనది. యూరియా, డీఏపీ ఉత్పత్తికి వాడే ముడిపదార్థాలు కూడా భారత్‌కు గల్ఫ్‌ దేశాల నుంచే సరఫరా అవుతుంటాయి. అయితే ఉద్రిక్తతల వల్ల ఎరువుల దిగుమతులు నిలిచిపోయినా, నౌకా రవాణా ఖర్చులు పెరిగినా.. ఆ భారం ఎరువుల బస్తాపై పడుతుంది. ఇది జిల్లాలోని వరి, ఇతర వాణిజ్య పంటలు పండించే రైతుల పెట్టుబడి వ్యయాన్ని విపరీతంగా పెంచేస్తుంది. ఏదేమైనా ఖరీఫ్‌ నాటికి ఎరువుల కొరత తీవ్రమై, రైతాంగం సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉంది.

- యుద్ధం నేపథ్యంలో ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఉన్న వంట గ్యాస్‌ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. భారత్‌ దిగుమతి చేసుకునే సహజవాయువులో దాదాపు 40శాతం (ఏటా 2.7 కోట్ల టన్నులు) ఖతర్‌ నుంచే వస్తోంది. అయితే ఖతర్‌ తాజా ప్రకటనతో గ్యాస్‌ ధరలు పెరగ నున్నాయి. ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.880 ఉండగా.. రానున్న రోజుల్లో రూ. వెయ్యి వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. యుద్ధ ప్రభావంతో బిస్కట్లు, తలనూనె, సన్‌ఫ్లవర్‌ నూనె, సబ్బులు, బాదం, వాల్‌నట్స్‌తో పాటు మెడిసిన్‌ తయారీకి అవసరమైన కెమికల్స్‌, మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌, ఎలక్ర్టానిక్‌ పరికరాలు, యంత్రాల ధరలపై ప్రభావం పడనుంది.

Updated Date - Mar 06 , 2026 | 11:43 PM