Share News

If the open it, farmer willbe happy తెరిపిస్తేనే.. తెరిపినపడేది

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:44 PM

If the open it, farmer willbe happy అందరికీ నోరూరించే చెరకు.. రైతులకు మాత్రం చేదెక్కుతోంది. పంట దిగుబడి బాగా వచ్చినా గిట్టుబాటు ధర దక్కుతుందో లేదోనన్న సందేహంలో రైతులు ఏటా పంట విస్తీర్ణం తగ్గించేస్తున్నారు. జిల్లాలో కీలకంగా ఉండే రెండు సుగర్‌ ఫ్యాక్టరీలు మూతపడ్డాక చెరకు సాగు నుంచి మరింత మంది దూరమవుతున్నారు. ఉన్న ఒక్క ఫ్యాక్టరీ(సంకిలి) కూడా ఆశాజనకంగా నడవడం లేదు.

If the open it, farmer willbe happy తెరిపిస్తేనే.. తెరిపినపడేది
ఎన్‌సీఎస్‌ సుగర్‌ ఫ్యాక్టరీ

తెరిపిస్తేనే.. తెరిపినపడేది

ఎన్‌సీఎస్‌, భీమసింగి సుగర్స్‌ పరిస్థితి ఏంటో?

చెరకు సాగు పట్ల రైతన్న విముఖత

ప్రతిఏటా తగ్గిపోతున్న సాగు విస్తీర్ణం

గత ఏడాది కంటే 60 శాతం తగ్గుదల

రాయితీలు, ప్రోత్సాహకాలు లేకపోవడమే కారణం

అందరికీ నోరూరించే చెరకు.. రైతులకు మాత్రం చేదెక్కుతోంది. పంట దిగుబడి బాగా వచ్చినా గిట్టుబాటు ధర దక్కుతుందో లేదోనన్న సందేహంలో రైతులు ఏటా పంట విస్తీర్ణం తగ్గించేస్తున్నారు. జిల్లాలో కీలకంగా ఉండే రెండు సుగర్‌ ఫ్యాక్టరీలు మూతపడ్డాక చెరకు సాగు నుంచి మరింత మంది దూరమవుతున్నారు. ఉన్న ఒక్క ఫ్యాక్టరీ(సంకిలి) కూడా ఆశాజనకంగా నడవడం లేదు. ఈ ఏడాది క్రషింగ్‌ లక్ష్యం చేరే పరిస్థితి లేదు. వెరసి జిల్లాలో చెరకు సాగు పెంపునకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటే తప్ప పెరిగే అవకాశమే కనిపించడం లేదు. ఎన్‌సీఎస్‌, భీమసింగి ఫ్యాక్టరీలను తెరిపిస్తేనే చెరకు పంటకు పూర్వవైభవం వస్తుందని రైతులంటున్నారు.

రాజాం, మార్చి4(ఆంధ్రజ్యోతి):

చెరకు పంట సాగులో అగ్రభాగాన ఉండే జిల్లా నానాటికీ ఆ పేరుకు దూరమవుతోంది. అనూహ్యంగా పంట విస్తీర్ణం తగ్గిపోతోంది. గతంలో చక్కెర కర్మాగారాలు నిర్విఘ్నంగా సాగుతూ రైతులకు విరివిగా ప్రోత్సాహకాలు అందించేవి. ఎన్‌సీఎస్‌, భీమసింగి కర్మాగారాలు మూతపడ్డాక పరిస్థితి తలకిందులైంది. ఒక్క సంకిలి ఈఐడీ ప్యారీ కర్మాగారమే మిగిలింది. చెరకు సాగు చూస్తే ఉన్న ఒక్కగానొక్క పరిశ్రమ సైతం మూతపడే ప్రమాదం పొంచి ఉంది. సాగుకు ప్రోత్సాహం లేదు. పంటకు గిట్టుబాటు ధర లేదు. దీంతో రైతులు చెరకు సాగును తగ్గించేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టారు.

ఏడాదికేడాది చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతోంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 60శాతం పడిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఎన్‌సీఎస్‌, భీమసింగి, సంకిలి ఫ్యాక్టరీల జోన్‌ పరిధిలో గత ఏడాది ఇదే సమయానికి 1,659 హెక్టార్లలో సాగుచేయగా.. ఈ ఏడాది కేవలం 491.14 హెక్టార్లలో మాత్రమే సాగయ్యింది. భీమసింగి పరిధిలో అయితే రైతులు చెరకు సాగు మానేశారు. ఎన్‌సీఎస్‌ పరిధిలో 403 హెక్టార్లలో సాగుచేయగా ఈ ఏడాది 43.47 హెక్టార్లలో మాత్రమే సాగుచేశారు. సంకిలి ఫ్యాక్టరీ పరిధిలో గత ఏడాది 1205 హెక్టార్లలో చెరకు వేయగా ఈ ఏడాది కేవలం 447 హెక్టారుల్లో మాత్రమే సాగుచేసినట్టు అధికారులు చెబుతున్నారు.

ఆ ఒక్కటీ కష్టమే

జిల్లాలో ఉన్న ఒక్కగానొక్క సంకిలి ప్యారీ పరిశ్రమ సైతం ప్రమాదపుటంచున ఉంది. ఏడు లక్షల మెట్రిక్‌ టన్నుల చెరకు గానుగ ఆడితేనే ఫ్యాక్టరీ మనుగడ ఉంటుంది. ప్రస్తుతం 2.50 లక్షల టన్నుల చెరకు మాత్రమే గానుగకు అందుబాటులో ఉంది. గతంలో 15 మండలాల్లో చెరకు విస్తారంగా పండించేవారు. తోటపల్లి, మడ్డువలస, తాటిపూడితో పాటు సాగునీటి వనరులున్న ప్రాంతాల్లో చెరకు పండించేవారు. పండిన పంటను సుగర్‌ ఫ్యాక్టరీలకు తరలించేవారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేవారు. ఫ్యాక్టరీలు రవాణా చార్జీలు ఇచ్చేవి. విత్తనాలు, ఎరువులు అందించేవారు. సాగు ప్రోత్సాహకం కింద ఎకరాకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకూ అందించేవారు. ఇప్పుడు ఫ్యాక్టరీలే లేవు. ఫలితంగా రైతులు సాగుకు దూరమవుతున్నారు.

సాగు పెంపునకు చర్యలు

జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం పెంచేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే సమావేశాలు నిర్వహించాం. సంకిలి చక్కెర కర్మాగారం యాజమాన్యానికి సైతం కీలక సూచనలు చేశాం. పూర్తిస్థాయి రాయితీలు కల్పించే విషయంలో యాజమాన్యం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

- సత్యనారాయణ, డిప్యూటీ కేన్‌ కమిషనర్‌, విజయనగరం

పెట్టుబడి రావడం లేదు

చెరకు రైతులకు కష్టాలే మిగులుతున్నాయి. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. సాగులో శ్రమ అధికం. మిగిలేది చాలా తక్కువ. పైగా పంట విక్రయించుకునేందుకు కనీస సదుపాయాలు లేకుండా పోయాయి. మూతపడిన సుగర్‌ పరిశ్రమలు తెరిపించే ఏర్పాట్లు చేయాలి.

- సామంతుల చిరంజీవి, రైతు, రాజాం

రాయితీలు అందిస్తేనే..

గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. జిల్లాలో రెండు సుగర్‌ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఉన్న ఒక్క పరిశ్రమపై ఒత్తిడి పెరిగింది. ఈ ఏడాది ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయడం మంచిదే అయినా.. నిలిచిపోయిన రాయితీలను తిరిగి అందించాల్సిన అవసరం ఉంది.

- వండాన సత్యంనాయుడు, కొప్పరకొత్తవలస, వంగర

Updated Date - Mar 04 , 2026 | 11:44 PM