Share News

If the fire is burning, then the fire is burning అగ్గి రేగితే బుగ్గి

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:56 PM

If the fire is burning, then the fire is burning ఈ నెల 16న డెంకాడ మండలం గంట్లాంలో జరిగిన అగ్నిప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. పక్కా ఇళ్ల నిర్మాణానికి, పిల్లల పెళ్లిళ్లకు ఇంట్లో దాచుకున్న రూ.30 లక్షల నగదు, 12 తులాల బంగారం పూర్తిగా దగ్ధం కావడంతో బాధితులు లబోదిబోమన్నారు. విజయనగరం నుంచి అగ్నిమాపక వాహనం వచ్చేలోగా రెండు ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన వేసవి తీవ్రతను చాటుతూనే అగ్నిమాపక శాఖకు హెచ్చరికలు పంపింది. సన్నద్ధతను గుర్తుచేసింది.

If the fire is burning, then the fire is burning అగ్గి రేగితే బుగ్గి

అగ్గి రేగితే బుగ్గి

జిల్లాలో అగ్నిప్రమాదాలు

వేసవిలో మరింత పెరిగే అవకాశం

అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత

ఈ నెల 16న డెంకాడ మండలం గంట్లాంలో జరిగిన అగ్నిప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. పక్కా ఇళ్ల నిర్మాణానికి, పిల్లల పెళ్లిళ్లకు ఇంట్లో దాచుకున్న రూ.30 లక్షల నగదు, 12 తులాల బంగారం పూర్తిగా దగ్ధం కావడంతో బాధితులు లబోదిబోమన్నారు. విజయనగరం నుంచి అగ్నిమాపక వాహనం వచ్చేలోగా రెండు ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన వేసవి తీవ్రతను చాటుతూనే అగ్నిమాపక శాఖకు హెచ్చరికలు పంపింది. సన్నద్ధతను గుర్తుచేసింది.

విజయనగరం, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): వేసవి వచ్చేసినట్టే. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. అక్కడక్కడ అగ్నిప్రమాదాలూ జరుగుతున్నాయి. వేసవిలో అగ్నిప్రమాదాలు సంభవించడం పరిపాటి. ఆపద సమయంలో అందరికీ గుర్తు వచ్చేది అగ్నిమాపక శాఖ. ప్రమాద సమాచారం అందుకొని తక్షణం ఘటనాస్థలానికి చేరుకోవాలి. మంటలను అదుపు చేయాలి. అయితే జిల్లాలో పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టు అగ్నిమాపక వాహనాలు లేవు. సిబ్బంది కొరత కూడా ఉంది. విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, రాజాం, ఎస్‌.కోట, బాడంగి, కొత్తవలసలో అగ్నిమాపక కేంద్రాలున్నాయి. నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలోని నాతవలసలో కొత్తగా కేంద్రం మంజూరైంది. అయితే పాత కేంద్రాలకు సంబంధించి అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా వసతి సమస్య ఉంది. దశాబ్దాల కిందట నిర్మించినవి కావడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. సిబ్బంది కొరత కూడా ఉంది. 26 మంది పైలెట్లు ఉండాలి. 18 మంది మాత్రమే ఉన్నారు. 80 మంది ఫైర్‌మెన్లు ఉండాల్సి ఉండగా అంతకన్నా తక్కువ మంది ఉన్నారని సమాచారం. పోలీస్‌ శాఖలో ఉండే హోంగార్డులు, కాంట్రాక్ట్‌ సిబ్బందితో నెట్టుకొస్తున్నారు.

ప్రజల్లో అవగాహన లేని కారణంగా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పాత విద్యుత్‌ పరికరాలు, ఓవర్‌లోడు అయిపోవడం, గ్యాస్‌ సిలిండర్ల వినియోగంలో నిర్లక్ష్యం, రక్షణ లేమి, భయాందోళన వంటి వాటితో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఐదేళ్లలో 30 తీవ్ర ఘటనలు జరిగాయి. ఓ 300 వరకూ కేసులు నమోదయ్యాయి. రూ.12 కోట్ల వరకూ నష్టం జరిగి ఉండొచ్చని అంచనా.

కొత్తగా నాతవలసలో..

నెల్లిమర్ల నియోజకవర్గంలో ఇప్పటివరకూ అగ్నిమాపక కేంద్రం లేదు. కొత్తగా ప్రభుత్వం నాతవలసలో అగ్నిమాపక కేంద్రాన్ని మంజూరు చేసింది. పూసపాటిరేగ మండలంలో ఫార్మా కంపెనీలు అధికంగా ఉండడం.. జాతీయ రహదారి అందుబాటులో ఉన్న నేపథ్యంలో ప్రమాదాలకు అవకాశం ఎక్కువ. ఆపై భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తోంది. అందుకే నాతవలస పరిధిలో దాదాపు ఎకరం భూమిలో రూ.2.65 కోట్లతో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి

అగ్నిప్రమాదాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వేసవిలో చాలారకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్‌స్టేషన్‌కు సమాచారమందించి సహాయం పొందాలి. అత్యవసరమైతే టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా సంప్రదించవచ్చు. వేసవిలో అగ్నిప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం.

- సోమేశ్వరావు, జిల్లా అగ్నిమాపక శాఖ సహాయ అధికారి, విజయనగరం

Updated Date - Feb 18 , 2026 | 11:56 PM