Encroached జాగా కనిపిస్తే కబ్జానే..
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:07 AM
If Land Is Vacant, It’s Encroached జిల్లా వ్యాప్తంగా సామాజిక ఆస్తులతో పాటు పేదల భూములకు రక్షణ కొరవడింది. ప్రధానంగా గ్రామ కంఠాలు, చెరువులు, శ్మశానాలు దాదాపు 80 శాతం వరకు కబ్జాకు గురయ్యాయి. మరోవైపు పేద రైతుల భూముల ఆక్రమణదారుల చేతుల్లో చిక్కుకున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా చేపట్టిన భూ రీ సర్వే కూడా అర్హుల కొంపముంచింది
సామాజిక ఆస్తులు, పేదల భూములకు రక్షణ కరవు
వైసీపీ ప్రభుత్వంలో కొంపముంచిన రీసర్వే
అన్ని ఆధారాలు ఉన్నా.. హక్కుదారునికి అందని న్యాయం
పట్టించుకోని రెవెన్యూ శాఖ
జియ్యమ్మవలస, ఫిబ్రవరి19(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా సామాజిక ఆస్తులతో పాటు పేదల భూములకు రక్షణ కొరవడింది. ప్రధానంగా గ్రామ కంఠాలు, చెరువులు, శ్మశానాలు దాదాపు 80 శాతం వరకు కబ్జాకు గురయ్యాయి. మరోవైపు పేద రైతుల భూముల ఆక్రమణదారుల చేతుల్లో చిక్కుకున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా చేపట్టిన భూ రీ సర్వే కూడా అర్హుల కొంపముంచింది. కొంతమంది అధికారులు వాస్తవాలు తెలుసుకోకుండా.. ఆక్రమణదారులకే ఆన్‌లైన్ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో అన్ని ఆధారాలు ఉన్నా.. నిజమైన హక్కుదారునికి న్యాయం జరగలేదు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుంటే సివిల్ మ్యాటర్ అంటూ వారు తప్పుకుం టున్నారు. మరోవైపు కొంతమంది రెవెన్యూ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇటీవల చేపట్టిన రీసర్వేలోనూ రెవెన్యూశాఖ అధికారులు సామాజిక ఆస్తుల కబ్జాలను గుర్తించక పోవడంపై జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
భూసమస్యల పరిష్కారంలో రెవెన్యూ శాఖ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంది. అవసరమైతే పోలీస్‌శాఖ సహకారంతోనైనా భూహక్కుదారులకు పూర్తి న్యాయం చేయాలి. కానీ ప్రస్తుత రెవెన్యూ శాఖ తీరు అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. సామాజిక ఆస్తులకు రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో భూహక్కుదారులకు న్యాయం జరగడం లేదు. మరోవైపు ప్రభుత్వ , దేవదాయ భూములు ఆక్రమణకు గురవుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు.
- జియ్యమ్మవలస మండలం చింతలబెలగాం గ్రామంలో 14 మంది దళితులకు 12.06 ఎకరాల భూమి అసైన్డ్ చేసి 1972-1984 మధ్య కాలంలో డీపట్టాలు ఇచ్చారు. ఇందులో చింతలబెలగాం రెవెన్యూ గ్రామ పరిధిలో 9 సర్వే నెంబర్లలో 5.40 ఎకరాలతో పాటు తుమ్మలవలస రెవెన్యూ పరిధిలో 12 సర్వే నెంబర్లలో 6.66 ఎకరాలు ఉన్నాయి. అయితే తుమ్మవలస పరిధిలో సర్వే నెంబర్లు 1-9 వరకు సంబంధిత ఎస్‌ఎఫ్‌ఏ రికార్డులు లేవు. 1994 వరకు వారే సాగు చేసుకుని శిస్తులు కట్టేవారు. ఆ తరువాత ఈ భూములు అగ్రకులాల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఎలా వెళ్లాయి అనేది రెవెన్యూశాఖకే తెలియాలి. ఈ భూములపై 1994 తరువాత అగ్రకులాల వారికి పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి దళితులు న్యాయ పోరాటం చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.
- ఇదే మండలం బాసంగి రెవెన్యూ పరిధిలో నడిమింటి సరసమ్మ అనే వృద్ధురాలు పేరున సర్వే నెంబరు 87-3లో 47 సెంట్లు, సర్వే నెంబరు 89-1డిలో 79 సెంట్లు జిరాయితీ పట్టా భూమి ఉంది. 2010 వరకు ఆమె ఆధీనంలోనే భూమి ఉంది. కానీ ఆ తరువాత ఆమె భూమిని అదే గ్రామానికి చెందిన కొంతమంది స్వాధీనం చేసుకుని సాగు చేస్తున్నారు. అప్పటి నుంచి ఆ వృద్ధురాలు న్యాయ పోరాటం చేసినా ఇప్పటికీ న్యాయం జరగలేదు. సీఎం పేషీ నుంచి ఆదేశాలు వచ్చినా రెవెన్యూశాఖ న్యాయం చేయలేకపోయింది.
- అదే మండలం బొమ్మిక గ్రామ రెవెన్యూ పరిధిలో అరసాడ చిన్నయ్య అనే వ్యక్తికి సర్వే నెంబరు 6/9లో ఎకరా డీ పట్టా భూమి మంజూరు చేశారు. 30 ఏళ్లు ఆయన సాగు చేశారు. కానీ 2023లో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ భూమిని ఆక్రమించుకోగా.. రీసర్వేలో రెవెన్యూ అధికారులు ఆయన పేరుపైనే ఆన్‌లైన్ చేశారు. దీంతో బాధిత రైతు కోర్టు ద్వారా ఇంజక్షన్ సూట్ తెచ్చుకున్నా న్యాయం జరగలేదు.
- కొమరాడ మండలం కెమిశీల రెవెన్యూ పరిధి తులసివలసకి చెందిన నలుగురు దళితులకు సర్వే నెంబరు 128-1, 2, 4, 5లో ఆరు ఎకరాల డీపట్టా భూములిచ్చారు. భూములు వారి ఆధీనంలో ఉన్నప్పటికీ అదే గ్రామానికి చెందిన కొందరు మూడెకరాలు ఆక్రమించుకుని సాగు చేపడుతున్నారు. దీనిపై బాధిత దళిత కుటుంబాలు అధికారులను ఆశ్రయించినా.. నేటికీ ఎటువంటి చర్యల్లేవు.
- గరుగుబిల్లి మండలం ఉద్దవోలులో సర్వే నెంబరు 83/2ఏలో 97 సెంట్లు ఆ గ్రామానికి చెందిన మత్స సోమయ్యకు ఇచ్చారు. సెటిల్‌మెంట్ ద్వారా కేటాయించిన అసైన్డ్ భూమిని అదే గ్రామానికి చెందిన వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించుకుని.. జిరాయితీగా మార్చి పట్టాలు పొందాడు. న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
- కురుపాంలోని ప్రభుత్వ భూమిని కొంతమంది ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుని.. లేఅవుట్లు వేసి విక్రయిస్తున్నారు. బుడా అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాల్సింది పంచాయతీ అధికారులే అని చెప్పి వెళ్లిపోయారు. అయితే ఇంతవరకు అక్రమార్కులపై చర్యలు లేవు.
- ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో ఎంతోమంది వైసీపీ ప్రభుత్వం హయాంలో బాఽధితులుగా మారిపోయారు. కూటమి ప్రభుత్వం స్పందించి తగు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
భూసమస్యల పరిష్కారమే లక్ష్యం
భూసమస్యల పరిష్కారం విషయంలో కచ్చితత్వం అవసరం. అన్ని ఆధారాలు పరిశీలించి అర్హులకు న్యాయం చేయడమే మా లక్ష్యం. సంబంధిత తహసీల్దార్లతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటాం.
- హేమలత, డీఆర్వో, పార్వతీపురం మన్యం