Share News

You’ll Have to Carry It! అత్యవసరమైతే.. మోసుకెళ్లాల్సిందే!

ABN , Publish Date - Aug 27 , 2026 | 12:23 AM

If It’s an Emergency… You’ll Have to Carry It! కొండకు ఆనుకుని ఉన్న గిరిజన గ్రామాలవి. ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో ఉన్నాయి. అయితే నేటికీ సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో సకాలంలో వైద్య సేవలు పొందలేకపో తున్నారు. గ్రామంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే నానా అవస్థలు పడాల్సి వస్తోంది. వర్షాలు పడితే ఇక అంతే సంగతి. రోగులను మోసుకుంటూ.. బురద రోడ్డును దాటుకుని ఆసుపత్రికి చేరుకోవాల్సి వస్తోంది.

 You’ll Have to Carry It! అత్యవసరమైతే.. మోసుకెళ్లాల్సిందే!
రెబ్బ రోడ్డు పరిస్థితి ఇదీ..

  • కిలోమీటర్ల మేర కాలినడక తప్పనిసరి

  • వర్షం పడితే రోడ్డంతా బురదయమం

  • దుర్భర స్థితిలో రెబ్బ, వనధార గిరిజన గ్రామస్థులు

జియ్యమ్మవలస, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): కొండకు ఆనుకుని ఉన్న గిరిజన గ్రామాలవి. ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో ఉన్నాయి. అయితే నేటికీ సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో సకాలంలో వైద్య సేవలు పొందలేకపో తున్నారు. గ్రామంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే నానా అవస్థలు పడాల్సి వస్తోంది. వర్షాలు పడితే ఇక అంతే సంగతి. రోగులను మోసుకుంటూ.. బురద రోడ్డును దాటుకుని ఆసుపత్రికి చేరుకోవాల్సి వస్తోంది. కొమరాడ మండలం చోళ్లపదం పంచాయతీ పరిధి నాగావళి నదికి ఆవల ఉన్న రెబ్బ, వనధార గ్రామాల పరిస్థితిపై ప్రత్యేక కథనం.

రెబ్బ గ్రామంలో జాతాపు (ఎస్టీ) తెగకు చెందిన 80 గిరిజన కుటుంబాలు ఉంటున్నాయి. ఈ గ్రామం ఒక కొండకు ఆనుకొని ఉంది. వర్షాలు పడితే కొండపై నుంచి బురద, చెత్తా చెదారాలతో గ్రామం నిండిపోతుంది. ఇదే సమయంలో కొన్నిసార్లు విష సర్పాలు కూడా గ్రామంలోకి వస్తుండడంతో గ్రామస్థులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఊట బావి నీరే ఆ గ్రామస్థులకు ఆధారం. గతంలో ఈ గ్రామానికి రోడ్డు మంజూరైనా నిర్మాణం జరగలేదు. దీంతో గ్రామస్థులే చందాలేసుకుని మట్టి రోడ్డు వేసుకున్నారు. అయితే వర్షాలు పడితే ఆ రోడ్డంతా బురదమయమై నడవడానికి కూడా అవకాశం లేనంత దారుణంగా తయారవుతుంది. వర్షాకాలంలో గ్రామంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే వారిని మోసుకుంటూ.. బురద మార్గం గుండా పది కిలోమీటర్లు నడుచుకుంటూ కొమరాడ, కేఆర్‌బీపురం పీహెచ్‌సీలకు చేరుకోవాల్సి వస్తోంది. అయితే వారు ఎక్కువగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కూనేరు వరకు కాలినడకన చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా కొమరాడకు వెళ్తుంటారు.

వనధార పరిస్థితి చూస్తే.. ఈ గ్రామంలో గిరిజన జాతాపు (ఎస్టీ) తెగకు చెందిన 30 కుటుంబాలు ఉంటున్నాయి. ఈ గ్రామానికి కూడా రోడ్డు సౌకర్యం లేదు. ఇది రెబ్బ గ్రామానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు గ్రామాల మధ్య రోడ్డు నిర్మిస్తామని కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు. కానీ కాంట్రాక్టరు అవసరమైన చోట సిమెంటు పైపులు తెచ్చి వదిలేశారు. పాత రోడ్డును జేసీబీతో తవ్వి వదిలేయడం వల్ల వర్షాలకు ఆ రహదారి కోతకు గురైంది. దీంతో గ్రామస్థుల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. వీరు ఆసుపత్రికి చేరాలంటే ఏడు కిలోమీటర్లు నడిచి కూనేరు చేరుకుంటారు. అక్కడి నుంచి కొమరాడ తదితర ప్రాంతాల్లో ఆసుపత్రులకు వెళ్తుంటారు.

ఒడిశాలో కలపాలని..

రోడ్డు నిర్మాణం ఎన్నికల హామీగా మిగిలిపోవడంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ రెండు గ్రామాల ప్రజలు తమను ఒడిశా రాష్ట్రంలో కలపాలని కూనేరు వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. అలాగైనా ఒడిశా ప్రభుత్వం తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తుందని ఆశతో నిరసనకు దిగారు. రోడ్డు సౌకర్యం లేక అత్యవసర సేవలు అందడం లేదని, అధికారులు తమ గ్రామాలకు రావడం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.

ఇబ్బందులు పడుతున్నాం..

రోడ్డు సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సకాలంలో వైద్య సేవలు పొందలేకపోతున్నాం. వర్షాకాలంలో మా బాధలు రెట్టింపవుతున్నాయి. దీనిపై అధికారులు స్పందించాలి.

- కె.జగ్గారావు, రెబ్బ గ్రామం

=====================================

ప్రభుత్వం స్పందించాలి

రెబ్బ, వనధార గ్రామాలకు రోడ్డు సదుపాయం లేకపోవడం బాధాకరం. గిరిజనుల సమస్యలను గుర్తించి.. కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి.

- కె.సాంబమూర్తి, సీపీఎం మండల కార్యదర్శి, కొమరాడ మండలం

Updated Date - Aug 27 , 2026 | 12:23 AM