If It Rains… వర్షం పడితే.. ఇంతే!
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:29 PM
If It Rains… This Is What Happens! వర్షం పడితే చాలు.. జిల్లాకేంద్రంలో పలు ప్రాంతాలు ముంపునకు గురువుతున్నాయి. ఎక్కడికక్కడే నీరు నిలిచిపోతుంది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏటా ఈ సమస్య వేధిస్తున్నా.. సంబంధిత అధికారులు స్పందించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాకపోకలకు అవస్థలు
చోద్యం చూస్తున్న అధికారులు
పార్వతీపురం టౌన్, మార్చి22(ఆంధ్రజ్యోతి): వర్షం పడితే చాలు.. జిల్లాకేంద్రంలో పలు ప్రాంతాలు ముంపునకు గురువుతున్నాయి. ఎక్కడికక్కడే నీరు నిలిచిపోతుంది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏటా ఈ సమస్య వేధిస్తున్నా.. సంబంధిత అధికారులు స్పందించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండు రోజుల కిందట కురిసిన వర్షాలకు పట్టణ ప్రధాన రహదారితో పాటు మేదరవీధి కూడలి నుంచి పాతబస్టాండ్ కూడలిలో మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. దీంతో అటుగా వెళ్లే పాదచారులు, వాహనచోదకులు నానా అవస్థలు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానం చెరువును తలపించింది. దీంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాస్తవంగా 2004లో ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టణంలోని బెలగాం శివారు నుంచి రాయగడ రోడ్డు శివారు వరకు రహదారి విస్తరణ చేపట్టారు. అయితే కాలువల నిర్మాణాన్ని సక్రమంగా చేపట్టకపోవడం వల్ల వర్షపునీరు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. మరోవైపు బెలగాం పోలీసు ఔట్ పోస్టుతో పాటు ప్రధాన రహదారిలోని మేదరవీధి, కుమ్మరివీధి, నెయ్యిల వీధి, పాతబస్టాండ్ కూడళ్ల వద్ద నివాసాలు, వాణిజ్య సముదాయాల ముందు ఆక్రమణలు పెరిగిపోయాయి. దీంతో చిన్న వర్షం పడినా పట్టణవాసులకు ఇక్కట్లు తప్పడం లేదు. కాగా పట్టణంలోని 30వార్డులోని మురుగు, వర్షపు నీటిని తరలించేందుకు 2008లో భూగర్భ కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. దీనిపై పార్వతీపురం పురపాలక సంఘం ఇన్‌చార్జి కమిషనర్ సన్యాసిరావును వివరణ కోరగా.. ‘పట్టణంలో వర్షపునీటి మళ్లింపునకు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నాం. ప్రధాన రహదారిలో ఆక్రమణల తొలగింపునకు ఆర్‌అండ్‌బీ శాఖాధికారులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం. భూగర్భ కాలువల నిర్మాణంపై ఉన్నతాధికారులతో చర్చింస్తాం. వర్షాకాలంలోగా ఒక కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేస్తాం. ’ అని తెలిపారు.