If he give a false report..! తప్పుడు రిపోర్టు ఇస్తే..!
ABN , Publish Date - Mar 31 , 2026 | 11:49 PM
If he give a false report..! తలకు గాయమైనా, మెదడు వద్ద రక్తస్రావం అయినా, శరీరంలో గడ్డలు ఉన్నా, ప్రమాదాల్లో అవయవాలు విరిగినా నిర్ధారణకు సిటీస్కాన్ కీలకం. ఆ యంత్రాన్ని ఆపరేట్ చేసే వ్యక్తికి దీనిపై పరిజ్ఞానం లేకపోతే.. అదిచ్చే తప్పుడు ఫలితాలతో వైద్యులు తప్పుడు చికిత్స చేసే ప్రమాదం ఉంది.
తప్పుడు రిపోర్టు ఇస్తే..!
సిటీస్కాన్ టెక్నీషీయన్‌గా ఓ విద్యార్థి
అర్హత లేకపోయినా నియామకం
కొన్నాళ్లుగా విధులు
ఓ వైద్యుడి సహకారంతోనే!
తలకు గాయమైనా, మెదడు వద్ద రక్తస్రావం అయినా, శరీరంలో గడ్డలు ఉన్నా, ప్రమాదాల్లో అవయవాలు విరిగినా నిర్ధారణకు సిటీస్కాన్ కీలకం. ఆ యంత్రాన్ని ఆపరేట్ చేసే వ్యక్తికి దీనిపై పరిజ్ఞానం లేకపోతే.. అదిచ్చే తప్పుడు ఫలితాలతో వైద్యులు తప్పుడు చికిత్స చేసే ప్రమాదం ఉంది. ఇంత కీలకమైన సిటీస్కాన్ టెక్నీషీయన్ ఉద్యోగంలో అర్హత లేని విద్యార్థి కొన్నాళ్లుగా కొనసాగుతున్నాడు. జిల్లాకే ఆధారంగా ఉన్న విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఈ పరిస్థితి నెలకొంది. ఓ వైద్యుడి సహకారంతోనే ఆ యువకుడు విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
విజయనగరం రింగురోడ్డు, మార్చి 31(ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ సర్వజనాసుపత్రి (జీజీహెచ్)లో ఓ విద్యార్థి ఏకంగా సిటీస్కాన్ టెక్నీషీయన్‌గా అవతారం ఎత్తాడు. కొన్నాళ్లుగా విధుల్లో ఉన్నాడు. స్కాన్ చేయడానికి ఆయనకు ఎలాంటి అర్హతా లేదన్న విషయం వైద్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. రోగులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిబంధనలు గొలికి వదులుతున్నారనడానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణ. అది కూడా అత్యంత కీలకమైన డయోగ్నోస్టిక్ విభాగంలో అర్హత లేని వ్యక్తిని నియమించడం గమన్హాం.
సిటీస్కాన్, ఎంఆర్‌ఐ వంటి విభాగాలు ఆసుపత్రికి వెన్నుముక లాంటివి. ఇక్కడ పనిచేయాలంటే డిప్లొమో ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ సర్టిఫికెట్ తప్పనిసరి. కాని ఇక్కడ జరుగుతున్న తంతు వేరు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తి ఒకవైపు విద్యార్థిగా చదువుకుంటూనే.. మరోవైపు ప్రైవేటు మెడికల్ కళాశాలలో ఉద్యోగం చేస్తున్నట్టు సమాచారం. ఈ రెండు కాకుండా సర్కార్ ఆస్పత్రిలో టెక్నీషీయన్‌గా తిష్ఠవేశాడు. ఆసుపత్రిలోని ఓ ప్రధాన సీనియర్ వైద్యుడు వెనుకుండి ఈ తంతు నడిపిస్తున్నట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఆ వైద్యుడి ఒత్తిడి మేరకే ఎన్నారై డయోగ్నిస్టిక్స్ సంస్థ ఆ విద్యార్థిని విధుల్లోకి తీసుకున్నట్టు సమాచారం.
నివేదిక సరిగా ఇవ్వకుంటే ఎవరిదీ బాధ్యత
ఆపరేట్ చేసే వ్యక్తికి ఆ యంత్రంపై పరిజ్ఞానం లేకపోతే.. అదిచ్చే తప్పుడు ఫలితాలతో వైద్యులు తప్పుడు చికిత్స చేసే ప్రమాదం ఉంది. గతంలో ఇదే సంస్థలో ఒకరిని సర్టిఫికెట్ లేదన్న కారణంతో తొలగించి.. ఇప్పుడు ఏకంగా మరో విద్యార్థికి బాద్యతలు అప్పగించడ పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
- వైద్యాధికారులు ఆసుపత్రి పర్యవేక్షణను గాలికొదిలేశారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కళ్లముందు జరుగుతున్నా చర్యలు తీసుకోవడంలో కాలయాపన చేయడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమౌతున్నాయి. అధికారుల ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తి విద్యార్థిగా తేలినట్టు సమాచారం.
పిలిపించి విచారించాం
డాక ్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్
ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో విద్యార్థి టెక్నీషీయన్‌గా వ్యవహరిస్తున్నాడన్న విషయం మా దృష్టికి వచ్చింది. ఆ వ్యక్తిని పిలిపించి విచారించాం. ప్రైవేటు సంస్థ నిర్వాహకులను వివరణ కోరాం. నిబంధనలను అతిక్రమిస్తే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు.