Share News

if go to betting after big problem బెట్టింగ్‌కు దిగితే బోల్తాపడ్డట్టే!

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:44 AM

if go to betting after big problem క్రికెట్‌ బెట్టింగ్‌ వల్ల జిల్లాలో ఎన్నో జీవితాలు అర్ధాంతరంగా కడతేరిపోయాయి. వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. కటకటాలపాలైన వారి జీవితాలు నాశనమయ్యాయి. అయినా ఇంకా బెట్టింగ్‌ మానడం లేదు.

if go to betting after big problem బెట్టింగ్‌కు దిగితే బోల్తాపడ్డట్టే!

బెట్టింగ్‌కు దిగితే బోల్తాపడ్డట్టే!

జిల్లా వ్యాప్తంగా ఎందరో బాధితులు

మరోసారి ఐపీఎల్‌ ఫీవర్‌

ఊరూరా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు పలువురు ఆసక్తి

ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్లో తెరపైకి బుకీలు

యువతే టార్గెట్‌

క్రికెట్‌ బెట్టింగ్‌ వల్ల జిల్లాలో ఎన్నో జీవితాలు అర్ధాంతరంగా కడతేరిపోయాయి. వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. కటకటాలపాలైన వారి జీవితాలు నాశనమయ్యాయి. అయినా ఇంకా బెట్టింగ్‌ మానడం లేదు. మాఫియా కొన్ని రహస్య ప్రదేశాల్లో మకాం వేసి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్లో కూడా యువతను టార్గెట్‌ చేస్తోంది. గతానుభవాల దృష్ట్యా పెద్దల్లో ఆందోళన నెలకొంది. వారు చెప్పినా కొందరు యువకులు వినడం లేదు. మొండిగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. పోలీసులు మాత్రం సీరియస్‌ యాక్షన్‌కు దిగుతామని, పట్టుబడితే రౌడీషీట్‌లను సైతం తెరుస్తామని హెచ్చరిస్తున్నారు.

- మెంటాడ మండలం పెదమేడపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బ్యాంక్‌ కరస్పాండెంట్‌గా పనిచేసేవాడు. క్రికెట్‌ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. బ్యాంక్లో జమచేసిన సొమ్ము క్రికెట్‌ బెట్టింగ్‌లకు మళ్లించి రూ.లక్షలు పోగట్టుకున్నాడు. సొమ్ము కోసం ఖాతాదారులు నిలదీసేసరికి ఏం చేయాలో పాలుపోక 2024లో ఆత్మహత్య చేసుకున్నాడు.

- 2025లో మెంటాడ మండలం కైలాం గ్రామానికి చెందిన యువకులు గ్రామంలో రహస్యంగా క్రికెట్‌ బెట్టింగ్‌లు (బుకీ)నిర్వహించారు. పోలీసులు దాడిచేసి 10 మంది యువకులను (క్రికెట్‌ బుకిలను)అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌లు స్వాధీన పరుచుకున్నారు.

- జీటీపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు క్రికెట్‌ బెట్టింగ్‌లకు అలవాటు పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇంట్లో వాళ్లు భూమి అమ్మి కొంతమేరకు అప్పులు తీర్చారు. మిగతా అప్పులిచ్చిన వారు ఒత్తిడి తేవడంతో భరించలేక ఆత్మహత్యకు పాల్పడాడు. కొన్నాళ్లకు ఆ వ్యక్తి తండ్రి కూడా మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు.

విజయనగరం క్రైం, మార్చి 30(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో యువకులే కాదు కొందరు మధ్య వయస్కులకు కూడా క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యసనంగా మారిపోయింది. ఇది పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో తెరపైకి వచ్చే బుకీలు ఆయా వ్యక్తులను టార్గెట్‌ చేసి వారిని బెట్టింగులకు బానిస చేసి పెడదారి పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభానికి ముందునుంచీ నిఘావర్గాలు ఎప్పటిలా అప్రమత్తమైనప్పటికీ అటు బుకీలు, ఇటు బెట్టింగ్‌ బాబులు వారి కళ్లుగప్పి యథేచ్చగా తమ పని కానిచ్చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో కొందరు, ఆఫ్‌లైన్లో మరికొందరు అప్పులు చేసి ఆటాడుతున్నారు. ఐపీఎల్‌ ప్రారంభం రోజునే జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున పందాలు జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సీజ పూర్తయ్యేలోపు ఇది ఏ స్థాయికి చేరుకుంటుందనేది అంచనా వేయలేని పరిస్థితి. కొన్నిచోట్ల నుంచి బుకీలు కూడా రంగంలోకి దిగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు స్థానిక యువత కూడా ఇదే పాత్రను పోషిస్తున్నారు. గత ఐపీఎల్‌ సీజన్లో కొన్ని ప్రాంతాల్లో బుకీలను పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసులు ప్రతి ఏడాది నమోదవుతూనే ఉన్నాయి. అయినా బెట్టింగ్‌లు కొనసాగుతూనే ఉంటున్నాయి. జిల్లాలో బెట్టింగ్‌ మరణాలు ఏటా చోటుచేసుకుంటు న్నాయి.వెలుగులోకిరాని మరిన్ని విషాద సంఘటనలు కూడా లేకపోలేదు.

- గడిచిన కొన్నేళ్లలో నమోదైన బెట్టింగు కేసులు జిల్లాలో పరిస్థితిని చెప్పకనే చెబుతున్నాయి. బంతులు, పరుగులు, వికెట్లు ఇలా అనేక రూపాల్లో బెట్టింగులకు పురిగొల్పుతూ మాఫియా చెలరేగిపోతోంది.

బెట్టింగుకు పాల్పడితే రౌడీషీట్లు

బెట్టింగు యాప్‌ల వినియోగం, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ బెట్టింగులకు పాల్పడడం చట్టవిరుద్ధం. పట్టుబడితే చర్యలు తప్పవు. ఇటువంటి కేసుల్లో జైలుశిక్ష, జరిమానా రెండూ ఉంటాయి. కొందరి సమాచారం మావద్ద ఉంది. వారిపై నిఘా పెట్టాం. పట్టుబడితే రౌడీ షీట్లు కూడా తెరుస్తాం. బెట్టింగు సమాచారాన్ని స్థానిక పోలీసులకు లేదా 112, 100 నంబర్లకు ఫోన్‌ చేసి తెలియజేయవచ్చు. ఆ వివరాలు గోప్యంగా ఉంచుతాం.

- ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌

---------------------

Updated Date - Mar 31 , 2026 | 12:44 AM