Share News

if face a deep problem in ocean సుడి‘గండాలు’ ఎదురైనా..

ABN , Publish Date - Jul 07 , 2026 | 12:14 AM

if face a deep problem in ocean సంద్రంలో మత్స్యకారుల చేపల వేట ఓ సహస యాత్ర. తిరిగి తీరానికి చేరే వరకు ఏం జరుగుతుందో తెలియదు. సంద్రంలో వచ్చే ప్రతికూల మార్పులకు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్లాల్సిందే. ఆ ప్రయాణంలో ఎన్నో ఒడుదుడుకులు. నడిసంద్రంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా భారీ కెరటాలు వచ్చి బోటును ఢీకొడితే మరింత ధైర్యంగా కెరటానికి ఎదురెళ్లాల్సిందే.

if face a deep problem in ocean సుడి‘గండాలు’ ఎదురైనా..
సముద్రంలో వేట సాగిస్తున్న మత్స్యకారులు

సుడి‘గండాలు’ ఎదురైనా..

మత్స్యకారులు మరింత అప్రమత్తం కావాలంటున్న నిపుణులు

జాగ్రత్తలతో సురక్షితంగా తిరిగి రావొచ్చునని సూచన

సంద్రంలో అపాయాలను ముందుచూపుతో గుర్తించాలి

ఒడుదుడుకుల్లో సంయమనంతో ఉండాలి

బోటులో సాంకేతిక లోపాలు తలెత్తితే టెన్షన్‌ వద్దు

వేట సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు

సంద్రంలో మత్స్యకారుల చేపల వేట ఓ సహస యాత్ర. తిరిగి తీరానికి చేరే వరకు ఏం జరుగుతుందో తెలియదు. సంద్రంలో వచ్చే ప్రతికూల మార్పులకు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్లాల్సిందే. ఆ ప్రయాణంలో ఎన్నో ఒడుదుడుకులు. నడిసంద్రంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా భారీ కెరటాలు వచ్చి బోటును ఢీకొడితే మరింత ధైర్యంగా కెరటానికి ఎదురెళ్లాల్సిందే. తుఫాన్‌ ప్రభావంతో దారి తప్పితే భయపడకుండా సరైన దిశను వెతకాల్సిందే. బోటులో సాంకేతిక లోపం తలెత్తితే టెన్షన్‌ పడకుండా బాగు అయ్యేవరకు ఆశాభావంతో నిరీక్షించాల్సిందే. కొన్ని చిట్కాలు, జాగ్రత్తలతో ఈ కష్టాలను సాఫీగా ఎదుర్కొని బయటపడవచ్చునని, తీరానికి భద్రంగా తిరిగిరావొచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.

భోగాపురం, జూలై6(ఆంధ్రజ్యోతి):

మత్స్యకారుల జీవనాధారం చేపల వేట. వారికి పుట్టుక నుంచే సముద్రంతో విడదీయలేని బంధం పెనవేసుకుంటుంది. అందుకే వేట విరామ సమయంలో కూడా ఇతర పనులేవీ చేయాలనుకోరు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే వేట సమయం వచ్చేదాకా నిరీక్షిస్తుంటారు. అంతగా వృత్తి కోసం తపించే మత్స్యకారులు ఇటీవల కాలంలో అనేక అపాయాలను ఎదుర్కొంటున్నారు. కెరటాలకు ఎదురెళ్తూ కష్టాల నడుమ వేట సాగిస్తున్నారు. మత్స్యకారులకు సముద్రంపై ఎంత పట్టు ఉన్నా.. వేట సాగించే సమయంలో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.

- సముద్రంలో చేపలవేటకెళ్లే మత్స్యకారులు వాతావరణాన్ని సునిశితంగా గమనిస్తుండాలి.

భద్రతా పరికరాలు(లైఫ్‌ జాకెట్లు) ధరించాలి. కమ్యూనికేషన్‌ పరికరాలు నిరంతరం పనిచేసేలా చూసుకోవాలి.

- వాతావరణ శాఖ నివేదికను అనుసరించాలి. వేటకు వెళ్లే ముందు తుపాన్లు, అల్ప పీడనాలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి వాతావరణ శాఖ హెచ్చరికలను గమనించాలి.

- ఆకాశంలో మార్పులు, మేఘాల కదిలికలు, గాలి వేగాన్ని నిత్యం గమనిస్తూ ముందుగానే అప్రమత్తమై తీరానికి చేరుకోవాలి.

- బోటులో ఉన్న ప్రతీ ఒక్కరు లైఫ్‌ జాకెట్లు ధరించాలి. ప్రమాదవ శాత్తు బోటు మునిగిపోయినా, తిరగబడినా లైఫ్‌ జాకెట్లు ప్రాణాలను కాపాడతాయి.

- అత్యవసర వైద్య చికిత్స కోసం ప్రథమ చికిత్స కిట్‌లను ఎల్లప్పుడు బోటులో అందుబాటులో ఉంచుకోవాలి.

- అత్యవసర పరిస్థితిలో ఆసరాగా ఉండే వాకి-టాకీ, మైరెన్‌ రేడియో, వాటర్‌ ప్రూఫ్‌ మొబైల్‌ ఫోన్లు అందుబాటులో ఉంచుకోవాలి.

- పడవ యొక్క ఖచ్చితమైన లొకేషన్‌ను గుర్తించడానికి జీపీఎస్‌ పరికరాలు, ఎకోసౌండర్లను ఉపయోగించాలి.

- సముద్రంలోకి వేటకెళ్లే ముందు బోటు ఇంజన్‌, ఇంధన ట్యంక్‌, వలల పరిస్థితిని పరిశీలించాలి.

- సరిపడా ఇంధనం, మంచినీరు, ఆహారం నిల్వ చేసుకోవాలి.

ఐక్యతగా..

సముద్రంలో వేట సాగించే సమయంలో ఒంటరిగా కాకుండా రెండు లేదా అంత కంటె ఎక్కువ బోట్లు కలిసి వేటకు వెళ్లేలా చూసుకోవాలి. తద్వారా ఏదైనా బోటుకు సమస్య వస్తే మరొక బోటువారు సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వేటకు వెళ్తున్న ప్రదేశం, తిరిగి వచ్చే సమయం, పడవలోని సభ్యుల వివరాలు తీరంలో ఉన్న కుటుంబ సభ్యులకు, మత్స్యకార సంఘాలకు తెలియ జేయాలి.

గల్లంతైన సమయంలో

సముద్రంలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతయ్యే పరిస్థితి ఉంటే వెంటనే మెరైన్‌ పోలీసులకు, కోస్ట్‌గార్డ్‌, మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందించాలి. దీనివల్ల ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌, నేవీ అధికారులు సులువుగా రెస్క్యూ ఆపరేషన్‌ (గాలింపు చర్యలు) చేపట్టే అవకాశం ఉంటుంది. ఈ విధంగా వేట సాగించే సమయంలో మత్స్యకారులు అన్ని జాగ్రర్తలు తీసుకొంటే సముద్రంలో ఏమి జరిగినా సురక్షితంగా బయటపడొచ్చు.

ఆపదలు వస్తుంటాయి

సముద్రంలోకి వేటకెళ్లె ముందు వాతావరణం చూసుకొని బయలు దేరుతాం. అయితే వేట సాగిస్తుండగా అప్పటికప్పుడే వాతావరణం ఉన్నట్లుండి మారిపోయి ప్రతి కూలంగా తయారవుతుంటుంది. వెంటనే తిరిగి బయలుదేరుతుంటాం. దురదృష్టవసాత్తు ఒక్కోసారి ప్రమాదానికి గురవుతుంటాం.

ఆకలి నరసమ్మ, మత్స్యకారులడు, ముక్కాం

సముద్రంపై నిఘా

సముద్రంపై నిరంతరం మెరైన్‌ పోలీస్‌ నిఘాతో పని చేస్తుంది. వేట సమయం, ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం.

వి.శ్రీనివాసరావు, మెరైన్‌ సీఐ, చింతపల్లి.

బోటు ట్రాకింగ్‌ కోసం ట్రాన్స్‌పాండర్స్‌

సముద్రంలో వేట సాగించే పడవలు ఎక్కడ ఉన్నాయి... ఏప్రాంతంలో ఉన్నాయో తెలుసుకొనే విధంగా వాటికి ఉచితంగానే ప్రభుత్వం ట్రాన్స్‌పాండర్స్‌ బిగిస్తుంది. మొదటిగా మెకనైజ్డ్‌ బోట్లుకు ఏర్పాటు చేస్తాం. తరువాత మోటరైజ్డ్‌ బోట్లుకు బిగిస్తుంటాం. ఈ పరికరాలు జిల్లాకు 150 మంజూరుకాగా ఇప్పటికి 122 బోట్లుకు అమర్చాం. వీటిని వేట సమయంలో ఆన్‌ చేసుకొని ఉంచితే ఎటువంటి ప్రమాదం జరిగినా, దాని ద్వారా సమాచారం అధికార యంత్రాంగానికి తెలుస్తుంది. వేట సాగించే ప్రతీ ఒక్కరు లైఫ్‌ జాకెట్లు విధిగా ధరించాలి.

టి.లావణ్య, డీ.డీ, మత్స్యశాఖ, విజయనగరం.

Updated Date - Jul 07 , 2026 | 12:14 AM