Share News

హైపవర్‌ కమిటీ వేస్తా.. వారి అంతు చూస్తా!

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:14 AM

అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థినిని వసతి గృహం నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేయడంపై పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే.

 హైపవర్‌ కమిటీ వేస్తా.. వారి అంతు చూస్తా!

  • బీఆర్‌ఏయూ ఉన్నతాధికారి వ్యాఖ్యలు

  • విద్యార్థిని విషయం బయటకు పొక్కడంపై ఆగ్రహం

  • అధికారులు, ఇంజనీరింగ్‌ ఫ్యాకల్టీకి వార్నింగ్‌

ఎచ్చెర్లరూరల్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థినిని వసతి గృహం నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేయడంపై పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ విషయం రాష్ట్ర మహిళా కమిషన్‌తో పాటు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. అయినా తప్పును సరిదిద్దుకునే ధోరణి వర్సిటీ అధికారుల్లో కనిపించడం లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. శనివారం వర్సిటీకి చెందిన ఓ ఉన్నతాధికారి తన కిందిస్థాయి అధికారులు, ఇంజనీరింగ్‌ ఫ్యాకల్టిపై అక్కసును వెళ్లగక్కారు. సైలెంట్‌గా విద్యార్థినిని వసతి గృహం నుంచి బయటకు పంపించాలన్న నిర్ణయం బయటకు పొక్కడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై హైపర్‌ కమిటీ వేస్తానని, విషయం బయటకు చెప్పిన వారందరి అంతు తేల్చుతానని హెచ్చరించినట్లు సమాచారం. మొదటి సెమిస్టర్‌, రెండో సెమిస్టర్‌లో 90 శాతం దాటి మార్కులు తెచ్చుకున్న విద్యార్థినిపై వర్సిటీ అధికారులు కక్ష కట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సబంధించి విద్యార్థులు సైతం ఐక్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Updated Date - Jul 19 , 2026 | 12:14 AM