Share News

I want to study there.. అక్కడే చదువుకోవాలని..

ABN , Publish Date - May 12 , 2026 | 12:20 AM

I want to study there.. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో చదువుకోవాలని ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. సీటు కోసం పోటీ పడుతున్నారు. స్థానిక నేతలకు రికమండేషన్‌ చేయాలంటూ కూడా కోరుతున్నారు.

I want to study there.. అక్కడే చదువుకోవాలని..

అక్కడే చదువుకోవాలని..

కేజీబీవీలపై పెరుగుతున్న ఆసక్తి

ఉత్తీర్ణత చూసి సీట్లు కోసం పోటీ

ఆరు, ఇంటర్‌లో ప్రవేశాలకు ఇదే సమయం

కూటమి వచ్చిన తరువాత మరింత బలోపేతం

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో చదువుకోవాలని ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. సీటు కోసం పోటీ పడుతున్నారు. స్థానిక నేతలకు రికమండేషన్‌ చేయాలంటూ కూడా కోరుతున్నారు. కేజీబీవీల్లో ఉత్తీర్ణత పెరగడంతో పాటు మెరుగైన సౌకర్యాలు, విద్యాబోధనే ఈ ఆసక్తికి కారణం. ఈ ఏడాది పదో తరగతితో పాటు ఇంటర్‌లో మంచి ఫలితాలు సాధించాయి. పదో తరగతిలో 94 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 229 మంది విద్యార్థినులు 500 మార్కులు పైబడి సాధించారు. 9 కేజీబీవీలు శతశాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి.

గంట్యాడ కేజీబీవీలో ఆరో తరగతిలో 40 సీట్లు ఉండగా ఈ ఏడాది 110 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్‌లో కూడా 40 సీట్లకు 110 మంది దరఖాస్తు చేసుకున్నారు. జామి మండలం కుమరాం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆరో తరగతిలో ఉన్న 40 సీట్లకు దాదాపు 120 దరఖాస్తులు వచ్చాయి. ఇంటర్‌కు 90 వరకూ దరఖాస్తులు వచ్చాయి.

విజయనగరం, మే 11 (ఆంధ్రజ్యోతి):

పేద, సామాన్య బాలికల కోసం ప్రభుత్వం కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాలు (కేజీబీవీ)లను ఏర్పాటుచేసింది. తల్లిదండ్రులు లేని, వలసపోయిన వారి పిల్లలకు అక్కడ వసతితో కూడిన విద్య అందించేందుకు 2008లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పాఠశాలలను ప్రారంభించాయి. జిల్లాలో 26 మండలాల్లో వీటిని ఏర్పాటుచేశారు. తొలుత 6 నుంచి పదో తరగతి వరకూ ఉన్న ఈ పాఠశాలను రెండు సంవత్సరాల కిందట ఇంటర్‌ కళాశాలలుగా పదోన్నతి కల్పించారు. సంప్రదాయం కోర్సులతో పాటు ప్రత్యేక సాంకేతిక కోర్సులను సైతం అందుబాటులోకి తెచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యాలయాల్లో వసతులు, సిబ్బంది నియామకంపై దృష్టిపెట్టింది. దీంతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి.

మెరుగైన ఉత్తీర్ణత..

జిల్లాలో 26 కేజీబీవీలు ఉన్నాయి. పదో తరగతిలో 94 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. 500 మార్కులు పైబడి 229 మంది సాధించారు. 9 కేజీబీవీలు శతశాతం ఉత్తీర్ణతను నమోదుచేసుకున్నాయి. ఇంటర్‌ ఫలితాల్లో రామభద్రపురం, బాడంగి, బొండపల్లి, గంట్యాడ, ఎల్‌.కోట, నెల్లిమర్ల, వేపాడ, గుర్ల, వంగరలో శతశాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. మరో 10 కేజీబీవీలు ద్వితీయ సంవత్సరంలో శతశాతం ఉత్తీర్ణత నమోదుచేసుకున్నాయి. ఈ విద్యాలయాల్లో ఆరు నుంచి ఇంటర్‌ వరకూ ఇక్కడ విద్య అందిస్తున్నారు. ప్రతీ తరగతిలో 40 సీట్లు చొప్పున ఉంటాయి. తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రాధాన్యమిస్తారు. కంప్యూటర్‌ విద్యతో కూడిన ఉత్తమ విద్యాబోధన అందిస్తారు. సబ్జెక్టుల వారీగా మహిళా ఉపాధ్యాయులు (సీఆర్టీలు)ను నియమించారు. నిరంతర వైద్య సేవల కోసం ఒక ఏఎన్‌ఎం సైతం అందుబాటులో ఉంటుంది. బోధనేతర సిబ్బంది, చివరకు స్వీపర్లు, వాచ్‌మెన్‌ సైతం మహిళలే ఉంటారు. బాలికా రక్షణకు పెద్దపీట వేస్తూ ఏర్పాటుచేసిన ఈ పాఠశాలలను అవగాహన లేక కొందరు పేదలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.

మరింత పటిష్టంగా..

కూటమి వచ్చిన తరువాత కేజీబీవీల్లో అన్నిరకాల సౌకర్యాలు మెరుగుపడ్డాయి. పౌష్టికాహారంతో పాటు అన్నిరకాల వసతులు అందుబాటులోకి తెచ్చారు. ప్రతిరోజూ ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఉంటుంది. మధ్యలో స్నాక్స్‌, బూస్టు, హార్లిక్స్‌, పాలు కూడా అందిస్తారు. వారంలో రోజుకో మెనూ ఉంటుంది. ఎంపిక చేసిన రోజుల్లో మాంసాహారం అందిస్తారు. కోడిగుడ్లు పెడతారు. స్నాక్స్‌లో బెల్లం చక్కీలు, వేరుశెనగ, గుడ్లు సైతం అందిస్తారు. రాత్రి భోజనం తరువాత పండ్లు, పాలు పెడతారు. యూనీఫాంతో పాటు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు అందిస్తారు. కంప్యూటర్‌ బోధన, స్టైఫండ్‌, గ్రంథాలయ సేవలు, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో ప్రోత్సాహం, ఆత్మరక్షణకు కరాటే, ఆరోగ్యానికి యోగా సైతం నేర్పిస్తారు ఇక్కడ. బయట వ్యక్తులు లోపలికి ప్రవేశించకుండా అన్ని పాఠశాలలకు ప్రహరీలు నిర్మించారు.

పరిష్కారం కాని సమస్యలు

సమగ్ర శిక్ష అభియాన్‌ పరిధిలో ఉండే ఈ పాఠశాలల్లో నిధుల ఖర్చు విషయంలో అవినీతి జరుగుతుందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పాఠశాలల నిర్వహణకుగాను ప్రత్యేకాధికారుల ఖాతాల్లో నిధులు ఉంటాయి. వాటిని తమ విచక్షణాధికారంతో ఖర్చు చేసుకునే వెసులబాటు ఉంది. ఈ అధికారాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. వాస్తవానికి సీఆర్‌టీలు తప్పనిసరిగా పాఠశాలల్లోనే ఉండాలి. రోజుకొకరు చొప్పున రాత్రి విధులు నిర్వహించాలి. ప్రత్యేకాధికారి తప్పనిసరిగా పాఠశాలలోనే ఉండాలి. కానీ చాలా పాఠశాలల ప్రత్యేకాధికారులు, సీఆర్‌టీలు సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. సిబ్బంది స్థానికంగా ఉండాలన్న నిబంధన పక్కాగా అమలుచేయాల్సిన అవసరం ఉంది.

కేజీబీవీల్లో కార్పొరేట్‌ సదుపాయాలు

కేజీబీవీల్లో కార్పొరేట్‌ సదుపాయాలు ఉన్నాయి. విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయి. సంరక్షకులు ఈ పాఠశాలలను పరిశీలించి పిల్లలను చేర్పించాలి. పూర్తి మౌలిక సదుపాయాలున్నాయి. శుద్ధజలలాలు, విలాసవంతమైన గదులు, డిజిటలైజేషన్‌, నాణ్యమైన బోధన అందుతుంది. మీ పిల్లల భవిష్యత్‌కు ప్రభుత్వం పూర్తిగా భోరోసా ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులు కార్పొరేట్‌ హైస్కూల్స్‌కు ధీటుగా ఉత్తమ మార్కులు తెచ్చుకుంటున్నారు.

ఎస్‌.రామసుందర్‌ రెడ్డి, కలెక్టర్‌

Updated Date - May 12 , 2026 | 12:20 AM