Share News

కష్టాలు తీరుస్తాడనుకుంటే.. కన్నీరు మిగిల్చాడు

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:34 AM

విశాఖలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజాంకు చెందిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

కష్టాలు తీరుస్తాడనుకుంటే.. కన్నీరు మిగిల్చాడు

  • విశాఖలో రాజాం యువకుడి మృతి

  • రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొని ప్రమాదం

రాజాం రూరల్‌, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): విశాఖలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజాంకు చెందిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణంలోని లచ్చయ్యపేటకు చెందిన గొల్లపల్లి యోగీశ్వర్రావు(19) తగరపువలస ప్రాంతంలోని అవంతి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీ.టెక్‌ సెకెండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. వరుసగా సెలవులు కావడంతో రాజాంలోని ఇంటికి వచ్చేందుకు అనుమతి కోరేందుకు కళాశాలకు వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొంది. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సంతోషి, వీరభద్రరావు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడి తల్లి సంతోషి ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో పనిచేస్తుండగా, తండ్రి విద్యుత్‌ మీటర్ల రీడింగ్‌ తీస్తూ కొడుకుల్ని చదివిస్తున్నారు. పెద్ద కొడుకు ఆదిత్య విజయనగరంలో ఇంజినీరింగ్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఇద్దరూ అందివస్తే తమ కష్టాలు గట్టెక్కుతాయన్న గంపెడాశతో బతుకుతున్న తల్లిదండ్రులకు రోడ్డు ప్రమాదంలో రెండో కొడుకు మృతి చెందాడన్న వార్త గుండె ఆగినంత పనిచేసింది.

Updated Date - Sep 12 , 2026 | 12:34 AM