అయ్యప్ప ఆశీస్సులతోనే ఇరుముడి తీశా
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:51 PM
తన ఇష్ట దైవం అయ్యప్ప స్వామి ఆశీస్సులతోనే ఇరుముడి సినిమా తీసినట్లు దర్శకుడు శివ నిర్వాణ తెలిపారు.
- దర్శకుడు శివ నిర్వాణ
- కొత్తవలసలో సందడి
కొత్తవలస, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తన ఇష్ట దైవం అయ్యప్ప స్వామి ఆశీస్సులతోనే ఇరుముడి సినిమా తీసినట్లు దర్శకుడు శివ నిర్వాణ తెలిపారు. మంగళవారం కొత్తవలసలో ఆయన సందడి చేశారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఉత్తరాంధ్ర వాసిగా నేను ఈప్రాంతంలో అయ్యప్ప భక్తులు మాలలు వేసుకుని ఎంతనిష్టగా పూజలు చేస్తారో దగ్గరుండి గమనించా. నేను కూడా అయ్యప్ప భక్తుడినే. అందుకే ఎంతో నిష్టగా, మనసు పెట్టి సినిమా తీశా. ఎన్నో ప్రాంతాలను పరిశీలించి, చివరకు సీలేరును ఎంచుకున్నాం. నిజ జీవితంలో జరిగే వాస్తవ సంఘటనలు ఆధారంగా.. తండ్రి, కూతురు మధ్య ఉండే ఆప్యాయత, అనురాగాలను దృష్టిలో ఉంచుకుని సినిమాను తెరకెక్కించాం. చిత్రాన్ని ఘన విజయం చేసినందుకు ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. ఇప్పటికీ థియేటర్లలో మంచి కలెక్షన్లతో నడుస్తోంది. ఓటీటీలో కూడా మంచి ఆదరణ రావడంతో పాటు మంచిలాభాలు వచ్చాయి. ఇందులోని చాలామంది నటులు స్థానికులే. ప్రతిఒక్కరూ వారి పాత్రల్లో ఎంతోచక్కగా ఇమిడిపోయారు. రవితేజ చాలాపెద్ద హీరో అయినా ఎక్కడ కూడా అటువంటి ధోరణి ప్రదర్శించకుండా చక్కగా నటించారు. భవిష్యత్‌లో మరెన్నో మంచి కథలతో సినిమాలు తీసి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందడానికి కృషి చేస్తా.’ అని తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనతో కేక్‌కట్ చేయించారు. కార్యక్రమంలో ప్రముఖ బిల్డర్ యడ్ల వెంకటరమణ, బొంతల వెంకటరావు, టీడీపీ నాయకుడు కొండలరావు తదితరులు పాల్గొన్నారు.