Share News

I know it's wrong..but తప్పు అని తెలిసినా..

ABN , Publish Date - Jan 13 , 2026 | 12:19 AM

I know it's wrong..but గంజాయి తీసుకోవడం నేరమని, భవిష్యత్‌ను ఛిద్రం చేస్తుందని తెలిసిన వారు కూడా వినియోగిస్తున్నారు. రవాణాకూ సహకారం అందిస్తున్నారు. ఉన్నత చదువులు పూర్తిచేసిన వారు, కళాశాలల్లో చదువుకుంటున్న వారు పక్కదారి పడుతుండడం ఆందోళనకరం. డబ్బు యావ, ఈజీ మనీ ఆలోచనలతో అడ్డదారి వైపు మళ్లుతున్నారు.

I know it's wrong..but తప్పు అని తెలిసినా..

తప్పు అని తెలిసినా..

గంజాయి నిషాలో విద్యాధికులు

యువతులు సైతం మత్తులో

జిల్లాలో జడలు విదుల్చుతున్న వైనం

కట్టడి చేయకుంటే ముప్పే

తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలంటున్న పోలీసులు

గంజాయి తీసుకోవడం నేరమని, భవిష్యత్‌ను ఛిద్రం చేస్తుందని తెలిసిన వారు కూడా వినియోగిస్తున్నారు. రవాణాకూ సహకారం అందిస్తున్నారు. ఉన్నత చదువులు పూర్తిచేసిన వారు, కళాశాలల్లో చదువుకుంటున్న వారు పక్కదారి పడుతుండడం ఆందోళనకరం. డబ్బు యావ, ఈజీ మనీ ఆలోచనలతో అడ్డదారి వైపు మళ్లుతున్నారు. ఒక్కోసారి ఆ మత్తులో అసాంఘిక కార్యకలాపాలకు దిగుతున్న ఘటనలు అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి. పూర్తిస్థాయిలో కట్టడి చేయకుంటే నేటి తరానికి ముప్పే. ఇటు జిల్లాలో గంజాయి పట్టుబడడం కూడా సార్వసాధారణంగా మారింది. ఒక్కో వారంలో రెండుమూడు సార్లు గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు చిక్కడం చూస్తున్నాం. వీరికి దొరక్కుండా వేల కిలోల గంజాయి తరలిపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏదైనాగాని గంజాయి వ్యవహారంలో నిందితులుగా యువకులు, విద్యార్థులు భాగస్వాములవ్వడం భవిష్యత్‌ ముప్పును హెచ్చరిస్తోంది.

రాజాం, జనవరి12(ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణా, వినియోగంలో జిల్లా పేరు తరచూ వినిపిస్తోంది. అందులోనూ కాలేజీలు, విద్యాసంస్థలున్న చోట గంజాయి పట్టుబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. విజయనగరం, బొబ్బిలి, రాజాం, కొత్తవలసలో ఎడ్యుకేషనల్‌ హబ్‌లు ఉన్నాయి. ఇంజనీరింగ్‌ కాలేజీలతో పాటు పేరెన్నికగన్న ఇతర విద్యాసంస్థలు నడుస్తున్నాయి. అటువంటి చోట ఎక్కువగా గంజాయి చలామణి అవుతున్నట్టు తాజా పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. రాజాం పట్టణం చుట్టుపక్కల ఉన్న ఖాళీ ప్రాంతాలు, రియల్‌ఎస్టేట్‌ వెంచర్లలో సాయంత్రం 5 గంటలు దాటితే వాహన సమూహాలు కనిపిస్తాయి. అంతా మద్యం తాగేవారు అనుకుంటున్నారు కానీ గంజాయి బాబులేనని తెలుస్తోంది.

సిగరెట్లలో కూడా..

కొందరు యువకులు సిగరెట్లు కాల్చుతుంటారు. అయితే నిశితంగా పరిశీలిస్తే ఆ సిగరెట్లలో గంజాయి ఉంటోంది. ఆ మత్తులో యువత జోగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాజాం, విజయనగరం, బొబ్బిలి తదితర పట్టణాల్లో సాయంత్రం 5 గంటలు దాటితే సమీప కొండ ప్రాంతాలు, లేఅవుట్లలో ఖాళీ ప్రదేశాలకు ద్విచక్రవాహనాలతో వెళ్తున్నారు. అందరూ 18 నుంచి 25 సంవత్సరాల లోపు వారే. వారంతా గంజాయి తాగేందుకు గుమిగూడుతుంటారని స్థానికులు చెబుతున్నారు. జిల్లాలో ఉత్తరాధి రాష్ట్రాలకు చెందిన వారు వివిధ రంగాల్లో స్థిరపడుతున్నారు. వారికి గంజాయి తాగే అలవాటు ఉంటోంది. వారు స్థానిక యువతకు కూడా అలవాటు చేస్తున్నారని తెలుస్తోంది. విద్యార్థులు సైతం ఆకర్షితులవుతున్నారు. ఇదే అదనుగా కొంతమంది గంజాయిని విక్రయిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలోని పాడేరు, అరకు, ముంచంగిపుట్టు ప్రాంతాల నుంచి గంజాయిని దిగుమతి చేసుకుని ఇక్కడి యువతకు అధిక రేటుకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

విద్యార్థులతో రవాణా..

గంజాయితో పాటు బ్రౌన్‌షుగర్‌ వంటి ప్రాణాంతక నిషేధిత వస్తువులు చలామణి అవుతున్నాయని తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. వీటి రవాణాకు యువత, విద్యార్థులను వినియోగిస్తుండడం విచారకరం. ప్రస్తుతం అద్దెకు కార్లను ఇచ్చే సంస్కృతి నడుస్తోంది. గంజాయి రవాణదారులకు ఇదో మార్గంగా మారింది. నలుగురైదుగురు యువకులతో మాట్లాడి అధిక మొత్తంలో నగదు ఆఫర్‌ చేస్తున్నారు. అరకు, పాడేరు వంటి ప్రాంతాలకు పర్యాటకుల మాటున పంపిస్తున్నారు. గంజాయిని అధిక మొత్తంలో తెప్పించి స్థానికంగా విక్రయిస్తున్నారు. అయితే పిల్లల విషయంలో తల్లిదండ్రులు కూడా ఒక కన్నేసి ఉంచాలని పోలీసులు చెబుతున్నారు. ఇంటర్‌ విద్యార్థులు సైతం గంజాయి బారిన పడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

నిఘా పెంచుతాం

గంజాయిపై ప్రత్యేకంగా నిఘా పెట్టాం. రాజాం చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి వినియోగంపై ఫిర్యాదులు ఉన్నమాట వాస్తవమే. కొంతమంది గంజాయి మాఫియాగా మారారని తెలుస్తోంది. విద్యార్థులు, యువత గంజాయితో పాటు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. గంజాయి మాఫియాను ఉక్కుపాదంతో అణచివేస్తాం.

ఆర్‌.జైభీమ్‌, ఎక్సైజ్‌ సీఐ, రాజాం

--------------

గంజాయి రవాణా కేసులో పదేళ్ల జైలు

విజయనగరం క్రైం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఎస్‌.కోట పోలీసు స్టేషన్‌లో 2023లో నమోదైన గంజాయి రవాణా కేసులో అరెస్టు అయిన ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా నీలకంచేరు గ్రామానికి చెందిన బిస్మన్‌చరణ్‌ సుగ్రీకి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష జరిమానా విధిస్తూ, విజయనగరం ఫస్ట్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ న్యాయాధికారి ఎం.మీనాదేవి సోమవారం తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ దామోదర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఎస్‌.కోట పోలీసు స్టేషన్‌ పరిధిలో 2023 ఏప్రిల్‌ 10న అప్పటి ఎస్‌కోట పోలీసులకు వచ్చిన సమాచారంపై రామ్‌నగర్‌ రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా అరకు నుంచి కారులో వస్తున్న బిస్మాచరణ్‌ సుగ్రీని అదుపులోకి తీసుకున్నారు. కారులో వున్న 50 కిలోల గంజాయిని, కారుని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు దర్యాప్తు చేపట్టిన అప్పటి ఎస్‌కోట సీఐ సింహాద్రినాయుడు నిందితుడ్ని రిమాండ్‌కు తరలించగా సీఐ బాల సూర్యారావు న్యాయస్థానంలో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. విచారణలో నిందితుడిపై నేరారోపణ రుజువుకావడంతో పదేళ్ల కఠిన కారాగారశిక్ష, లక్ష జరిమానాను న్యాయాధికారి విధించారు. జరిమానా చెల్లించడంలో నిందితుడు విఫలమైతే అదనంగా మరో ఏడాది సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ దామోదర్‌ తెలిపారు.

===============

రామభద్రపురంలో ముగ్గురి అరెస్టు

రామభద్రపురం, జనవరి 12(ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణా కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్టు బొబ్బిలి రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నారాయణరావు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో సోమవారం సాయంత్రం ఆయన విలేకరులకు కేసు వివరాలను వెల్లడించారు. తెర్లాం మండలం వెలగవలస గ్రామానికి చెందిన గొర్లె శశి, ఒడిశా రాష్ట్రం పొట్టంగి బ్లాక్‌ పుకలికి చెందిన అనంత్‌ మసాది, విశాఖపట్నం డాబాగార్డెన్‌కు చెందిన వై.భానుప్రసాద్‌లను అరెస్టు చేశారు. జీలికవలస సమీపంలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్‌ హైవే వద్ద మోటారు బైకుతో 5 కేజీల 700 గ్రాముల గంజాయి తీసుకువస్తుండగా వీరిని అరెస్టు చేశామని తెలిపారు. వీరివద్ద నుంచి రూ.500ల నగదు, 3 సెల్‌ఫోన్లు, ఒక మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్‌ కోసం సాలూరు కోర్టుకు తరలించినట్లు తెలిపారు.

Updated Date - Jan 13 , 2026 | 12:19 AM