I am unable to save my son... కొడుకును కాపాడలేకపోతున్నా..
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:18 AM
I am unable to save my son... అల్లారుముద్దుగా పెంచుకొంటున్న తనయుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుండడాన్ని చూస్తూ ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. బాలుడి ఆరోగ్యాన్ని బాగు చేసేందుకు ఆస్పత్రులకు తిప్పుతున్నాడు. ఉన్న డబ్బులంతా ఖర్చు చేశాడు.
కొడుకును కాపాడలేకపోతున్నా..
తనయుడి బాధ చూసి తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
కుమారుని వైద్యానికి అప్పు కోసం తీవ్రంగా ప్రయత్నం
డబ్బులు సమకూరక మనస్తాపం
అదే బాధతో చెట్టుకు తాడుతో ఉరి వేసుకున్న వైనం
భోగాపురం, సెప్టెంబరు27(ఆంధ్రజ్యోతి):
అల్లారుముద్దుగా పెంచుకొంటున్న తనయుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుండడాన్ని చూస్తూ ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. బాలుడి ఆరోగ్యాన్ని బాగు చేసేందుకు ఆస్పత్రులకు తిప్పుతున్నాడు. ఉన్న డబ్బులంతా ఖర్చు చేశాడు. ఇంకా అవసరం పడడంతో అప్పు కోసం ప్రయత్నించాడు. తెలిసిన వారందరినీ అడిగాడు. సమకూరకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అదే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. భోగాపురం మండలం సవరవల్లి గ్రామం బీసీ కాలనీకి చెందిన గందిబోయిన రాంబాబు(35) విషాదాంతమిది. ఇదే మండలం రావాడ సమీప మామిడితోటలో ఆదివారం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ దామోదరరావు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గందిబోయిన రాంబాబుకి భార్య సన్యాసమ్మతో పాటు 7, 5 సంవత్సరాల వయసు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. రాంబాబు అమలాపురం, ఇతర దూర ప్రాంతాలకు వెళ్లి అక్కడ కొబ్బరి చెట్లు ఎక్కి బొండాలు దించే పని చేస్తుంటాడు. పెద కుమారుడు సాయిగణేష్ ఐదు సంవత్సరాలుగా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. విశాఖలోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నాడు. బాలుడి ఆరోగ్యం కోసం ఎంతో ప్రయాస పడుతున్నాడు. ఈనెల 26న మరోసారి కుమారుడిని విశాఖపట్నం ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మళ్లీ సోమవారం రావాలని అక్కడి వైద్యులు సూచించారు. తెల్లారితే కుమారిడిని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉంది.. చేతిలో డబ్బులు లేవు. తెలిసిన వారిందరినీ అప్పు అడిగాడు. సమకూరకపోవడంతో కుమారుడికి వైద్యం చేయించలేనని లోలోన మథనపడ్డాడు. దిక్కు తోచని స్థితిలో తీవ్ర మనస్తాపానికి గురైన రాంబాబు రావాడ సమీపంలో రాంబాబు తండ్రి పైడయ్య పనిచేస్తున్న మాడితోటలోకి వెళ్లి అక్కడ చెట్టుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. కుమారుడ్ని ఎవరు ఆసుపత్రికి తీసుకెళ్తారంటూ రాంబాబు భార్య సన్యాసమ్మ రోదన చూసిన వారందరినీ కంటతడి పెట్టించింది. తల తాకట్టుపెట్టి అయినా అప్పు తీసుకుందామని చెప్పానని, ఎందుకిలా చేశావని తల్లిదండ్రులు ముత్యాలమ్మ, పైడయ్య విలపించారు. ఎస్‌ఐ దామోదరరావు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. సన్యాసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సుందరపేట సామాజిక ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ దామోదరరావు తెలిపారు.