సతుల కోసం పతులు
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:41 AM
జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో చైర్మన్ల పీఠాలను ప్రభుత్వం మహిళలకు రిజర్వు చేసిన విషయం తెలిసిందే.
- చైర్పర్సన్ టికెట్ల కోసం ప్రయత్నాలు
-పార్వతీపురం, సాలూరు, పాలకొండ స్థానాలు మహిళలకు కేటాయింపు
- రంగంలోకి దిగిన భర్తలు
- భార్య లేదా తమ కుటుంబంలోని స్త్రీలకు టికెట్ వచ్చేలా పావులు కదుపుతున్న వైనం
- ఇదీ కూటమి, వైసీపీలో పరిస్థితి
పార్వతీపురం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో చైర్మన్ల పీఠాలను ప్రభుత్వం మహిళలకు రిజర్వు చేసిన విషయం తెలిసిందే. పార్వతీపురం పురపాలక సంఘాన్ని జనరల్ మహిళకు, సాలూరు మున్సిపాలిటీ, పాలకొండ నగర పంచాయతీని బీసీ మహిళకు కేటాయించింది. దీంతో తమ భార్యలను లేదా కుటుంబంలోని మహిళలను పోటీలో ఉంచేందుకు కూటమి నాయకులతో పాటు వైసీపీ నేతలు నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పదవుల కోసం ఆశావహులు ఒక్కొక్కరూ తెరపైకి వస్తున్నారు. ఇప్పటికే తాము పోటీలో ఉన్నామని ప్రకటించిన వారితో పాటు కొత్తవారు కూడా ఆసక్తి చూపుతున్నారు. చైర్పర్సన్ పీఠం దక్కించుకోవడం కోసం చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి దరఖాస్తులు అందించారు. మరోవైపు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రధానంగా పార్వతీపురం స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించడంతో తీవ్ర పోటీ నెలకొంది. దీంతో అన్ని విధాలా బలమైన అభ్యర్థిని బరిలో దించాలన్న ఉద్దేశంతో కూటమితో పాటు వైసీపీ కూడా తీవ్ర కసరత్తు చేస్తోంది.
పార్వతీపురంలో..
ఎవరూ ఊహించని విధంగా జిల్లా కేంద్రం పార్వతీపురం మున్సిపాలిటీని జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో ఇక్కడ ఏ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయినా పోటీ చేసే అవకాశం ఉండడంతో ఆశావహులు తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక్కడ చైర్పర్సన్ అభ్యర్థిగా తమ సతీమణులను పోటీలో నిలబెట్టేందుకు పలువురు టీడీపీ నాయకులు సిద్ధమవుతున్నారు. మాజీ కౌన్సిలర్ బెలగాం కరుణ తరపున ఆమె భర్త, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బెలగాం జయ ప్రకాష్ నారాయణ (జయబాబు), మాజీ కౌన్సిలర్ మజ్జి సునీత కోసం ఆమె భర్త కృష్ణమోహన్‌తో పాటు మరిది వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి కోసం ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ కౌన్సిలర్ జి.పార్వతి తరపున ఆమె భర్త జి.రవికుమార్, మాజీ కౌన్సిలర్ సరితను పోటీ చేయించేందుకు ఆమె భర్త, టీడీపీ పట్టణ అధ్యక్షుడు కోలా మధుసూదన్‌రావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు ఆశావహులు కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆశీస్సులు ఎవరికి ఉంటాయో వారే కూటమి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
- వైసీపీ నుంచి ఇప్పటి వరకు ఎవరి పేర్లు బహిర్గతం కాలేదు. రిజర్వేషన్లు ఖరారు కాకముందు పోటీ చేస్తామని చెప్పిన అనేకమంది వైసీపీ నాయకులు ఇప్పుడు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. కూటమి నుంచి బలమైన అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశం ఉండడంతో తాము పోటీ చేసినా గెలవమనే ఆలోచనతో వైసీపీ నాయకులు అంతంత మాత్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
సాలూరులో..
సాలూరు పురపాలక సంఘంలో కూడా చైర్పర్సన్ సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. తమ భార్యలను పోటీ చేయించేందుకు కూటమి నేతలు రంగంలోకి దిగారు. దీనికోసం టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ వైకుంఠపు హర్షవర్థన్ వరుసకు మరదలైన గుళ్ల మంజీరాను వివాహం చేసుకున్నారు. ఆమె అభ్యర్థిత్వం కోసం హర్షవర్థన్ ప్రయత్నాలు చేశారు. మాజీ కౌన్సిలర్, పట్టణ టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎన్.తిరుపతిరావు తన సతీమణి శ్యామల కోసం, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కేతిరెడ్డి గాయత్రీ కోసం ఆమె భర్త కేతిరెడ్డి చంద్రశేఖర్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరికొందరు నాయకులు కూడా తమ భార్యలను లేదా మహిళా కుటుంబ సభ్యులను రంగంలోకి దించాలని చూశారు. కానీ, ఈ స్థానం అనుహ్యంగా జనసేనకు కేటాయించడంతో వీరంతా ఖంగుతిన్నారు.
- వైసీపీ నుంచి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి కోసం ఆమె భర్త గొర్ల మధు ప్రయత్నాలు చేస్తుండగా, బైరెడ్డి సత్య ప్రసాద్ తన భార్య గౌతమిని పోటీ చేయించేందుకు పావులు కదుపుతున్నారు. అదే విధంగా ద్వారపురెడ్డి విశాలాక్షి, మాజీ కౌన్సిలర్ ద్వారపురెడ్డి పునరికాక్ష సైతం పోటీ పడుతున్నారు. మాజీ మంత్రి పీడిక రాజన్నదొర చెప్పిన వారికే సీటు దక్కే అవకాశం ఉంది.
పాలకొండలో..
పాలకొండ నగర పంచాయతీకి సంబంధించి కూటమి పార్టీల నుంచి పల్లా కొండలరావు తన భార్య విజయ నిర్మలను పోటీ చేయించాలని చూశారు. అదే విధంగా మాజీ కౌన్సిలర్ జి.వరలక్ష్మి కోసం ఆమె భర్త సంతోష్‌కుమార్, గుమ్మడి దమయంతి కోసం ఆమె భర్త, మాజీ కౌన్సిలర్ గుమ్మడి సింహాద్రి ప్రయత్నాలు చేశారు. అయితే, పాలకొండను జనసేనకు కేటాయించడంతో వీరంతా ఆశ్చర్యపోయారు.
- వైసీపీ నుంచి ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తల్లి పాలవలస ఇందుమతి అభ్యర్థిత్వాన్ని అధిష్టానం గురువారం ఖరారు చేసింది. చైర్పర్సన్ టిక్కెట్ కోసం చాలామంది ప్రయత్నాలు చేసినప్పటికీ తరాలుగా రాజకీయ నేపథ్యం ఉన్న ఇందుమతి వైపు అధిష్టానం మొగ్గుచూపింది.