రైతు హత్య కేసులో భార్యాభర్తల అరెస్టు
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:20 AM
మండలం లోని లక్కిడాం గ్రామానికి చెందిన గొల్లు సత్తిబాబు అనే రైతు హత్య కేసులో గ్రామానికి చెందిన కిలపర్తి రామకృష్ణ, గౌరీదేవి అనే దంపతులను సోమవారం అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
గంట్యాడ, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): మండలం లోని లక్కిడాం గ్రామానికి చెందిన గొల్లు సత్తిబాబు అనే రైతు హత్య కేసులో గ్రామానికి చెందిన కిలపర్తి రామకృష్ణ, గౌరీదేవి అనే దంపతులను సోమవారం అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి విజయనగరం డీఎస్పీ లక్ష్మణమూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 20న లక్కిడాం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 281-6ఏలో 32 సెంట్ల వ్యవసాయ భూమిలో గ్రామానికి చెందిన గొల్లు సత్తిబాబు, తన భార్య సింహాచలం కలిసి గడ్డి కోస్తున్నారు. ఇదే సమయంలో గ్రామానికి కిలపర్తి రామ కృష్ణ, తన భార్య కిలపర్తి గౌరీదేవి కొడవలి, పార తీసుకుని అక్కడికి వెళ్లారు. ‘మేము సాగు చేస్తున్న పొలంలో మీరెందుకు కోస్తున్నార’ని సత్తిబాబు వారిని ప్రశ్నించాడు. దీంతో ఘర్షణ జరిగింది. ఈక్రమంలో గౌరీదేవి.. సత్తిబాబు చేతుల ను గట్టిగా పట్టుకోగా, రామకృష్ణ పారతో సత్తిబాబును బలంగా కొట్టాడు. ఆయన అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. వెంటనే సత్తిబాబు భార్య సింహాచలం గట్టిగా కేకలు వేయడంతో భార్య, భర్తలు ఇద్దరూ అక్కడ నుంచి పరారయ్యారు. సోమవారం వారిద్దరూ నేరం అంగీకరించి, పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సమావేశంలో విజయనగరం రూరల్ సీఐ బి.లక్ష్మణరావు, ఎస్ఐ కశిరెడ్డి లక్ష్మణ రావు పాల్గొన్నారు.