Share News

Hunt for admissions అడ్మిషన్ల వేట

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:28 AM

Hunt for admissions జిల్లాలో ఇటీవలే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ముగిశాయి. అప్పుడే కార్పొరేట్‌ కాలేజీలు అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. దాదాపు అన్ని కార్పొరేట్‌ కాలేజీలకు చెందిన పీఆర్వోలు విద్యార్థుల తల్లిదండ్రులను కలుస్తున్నారు. రకరకాలుగా ప్రలోభపెడుతున్నారు. తల్లిదండ్రులపై అన్నిరకాలుగా ఒత్తిడి పెంచి చేర్చుకుంటున్నారు.

Hunt for admissions అడ్మిషన్ల వేట

అడ్మిషన్ల వేట

ఇంటర్‌లో ముమ్మరంగా ముందస్తు ప్రవేశాలు

ఇటీవలే పూర్తయిన పదో తరగతి పరీక్షలు

తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్న పీఆర్వోలు

రకరకాలుగా ప్రలోభాలు

జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్‌ కాలేజీల దందా

విజయనగరం, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఇటీవలే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ముగిశాయి. అప్పుడే కార్పొరేట్‌ కాలేజీలు అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. దాదాపు అన్ని కార్పొరేట్‌ కాలేజీలకు చెందిన పీఆర్వోలు విద్యార్థుల తల్లిదండ్రులను కలుస్తున్నారు. రకరకాలుగా ప్రలోభపెడుతున్నారు. తల్లిదండ్రులపై అన్నిరకాలుగా ఒత్తిడి పెంచి చేర్చుకుంటున్నారు.

జిల్లాలో ఈ ఏడాది 298 ప్రభుత్వ పాఠశాలల నుంచి 16,521 మంది...149 ప్రైవేటు పాఠశాలల నుంచి 7,294 విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఈ నెల చివరి వారంలో పదో తరగతి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అంతకంటే ముందే ఇంటర్‌ అడ్మిషన్ల కోసం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు దృష్టి పెట్టాయి. తల్లిదండ్రులను విస్తృతంగా కలుస్తున్నారు. వారి వివరాలు, ఫోన్‌ నంబర్లు తీసుకొని వెంటాడుతున్నారు. ‘మీ పిల్లల భవిష్యత్‌కు మాది భరోసా’ అంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వెంటనే అడ్మిషన్లు తీసుకోకుంటే మీ పిల్లాడు వెనుకబడిపోతాడని.. తరువాత సీట్లు దొరకవని చెబుతుండడంతో ఆందోళనకు గురవుతున్న తల్లిదండ్రులు వెంటనే అడ్మిషన్‌ ఇస్తున్నారు.

ప్రైవేటు కాలేజీల హవా..

ప్రైవేటు కాలేజీల హవా పెరుగుతోంది. ప్రభుత్వానికి సంబంధించి జూనియర్‌ కాలేజీలు, మోడల్‌ స్కూల్స్‌, కేజీబీవీలు ఉన్నా అటువైపుగా ఎటువంటి అవగాహన లేకుండా పోతోంది. అక్కడ తగినంతమంది బోధకులు, వసతులు లేకపోవడంతో ఎక్కువ మంది సామాన్యులు కూడా ప్రైవేటు కాలేజీల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు రంగు రంగుల బ్రోచర్లు చూపుతూ ఉన్నవి లేనివి చెబుతూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. అడ్మిషన్ల రూపంలో వారిని కమిట్‌మెంట్‌కు తీసుకొస్తున్నాయి.

రకరకాలుగా ఒత్తిళ్లు..

పిల్లాడు చదువులో వెనుకబడతాడేమోనన్న ఆందోళన సగటు తల్లిదండ్రుల్లో ఉంది. దీనినే ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీల యాజమాన్యాలు క్యాష్‌ చేసుకుంటున్నాయి. ముందుగా ఫోన్లో సంప్రదిస్తూ ‘మీ పక్కంటి, మీ గ్రామానికి చెందిన విద్యార్థి మా కాలేజీలో చేరాడు’ అని చెబుతున్నారు. ఇక మీ ఇష్టం అంటూ హెచ్చరిస్తున్నారు. మరికొందరైతే నేరుగా కార్లతో ఒక్కసారిగా ఇంటి వద్దకు వాలిపోతున్నారు. ఇంట్లో ఉన్న మహిళల వద్ద పిల్లాడి చదువుకు సంబంధించి లేనిపోని విషయాలను చెబుతున్నారు. ఇలానే వదిలేస్తే భవిష్యత్‌ కష్టమంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో మహిళలు కుటుంబ యజమానులపై ఒత్తిడి పెంచుతున్నారు.

ఫ కార్పొరేట్‌, ప్రైవేటు విద్యాసంస్థలు ఇప్పటికే పీఆర్వోలను పెద్ద ఎత్తున నియమించాయి. వారు గ్రామాల్లో తిరుగుతూ అన్నిరకాల ఒత్తిళ్లు చేసి అడ్మిషన్లు చేస్తున్నారు. ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఎవరు చెబితే వింటారో తెలుసుకుంటున్నారు. ఒక్కోసారి ఏ సామాజికవర్గానికి చెందిన వారైతే అదే సామాజికవర్గ నేతలతో ఫోన్‌ చేయిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఈ దందా నడుస్తోంది. బలవంతపు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.

Updated Date - Apr 06 , 2026 | 12:28 AM