Human papillomavirus Vaccination హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌లో మన్యం ముందంజ
ABN , Publish Date - May 20 , 2026 | 11:29 PM
Human papillomavirus Vaccination: Manyam Leads the Way గర్భాశయ క్యాన్సర్ నుంచి బాలికలకు రక్షణ కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిల్లో మావైరస్) వ్యాక్సినేషన్‌లో మన్యం జిల్లా తన ప్రత్యేకతను చాటుకుంది.
వెల్లడించిన డీఎంహెచ్‌వో భాస్కరరావు
పాలకొండ, మే20(ఆంధ్రజ్యోతి): గర్భాశయ క్యాన్సర్ నుంచి బాలికలకు రక్షణ కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిల్లో మావైరస్) వ్యాక్సినేషన్‌లో మన్యం జిల్లా తన ప్రత్యేకతను చాటుకుంది. 14 ఏళ్లలోపు 9,600 మంది బాలికలకు వ్యాక్సిన్ వేయాలని గుర్తించగా ఇప్పటివరకు 6,300 మందికి హెచ్‌పీవీ వేశారు. దీంతో రాష్ట్రంలోనే మన్యం జిల్లా మూడో స్థానంలో నిలిచినట్లు డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలి పారు. వాస్తవంగా మార్చి 10 నుంచి జిల్లాలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కాగా ఇప్పటికీ క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది బాలికలు, వారి తల్లిదండ్రులకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవ గాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతా ల్లోనూ బాలికలకు ఈ వ్యాక్సిన్‌ను వేస్తున్నారు. ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించి హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఆవశ్యకతను వివరిస్తున్నారు. ‘11 నుంచి 14 ఏళ్లలోపు బాలికలు విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలి. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల ద్వారా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాం. ఈ వ్యాక్సిన్‌పై ప్రజలు అపోహలు వీడాలి. ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల బాలికలు భవిష్యత్‌లో క్యాన్సర్ నుంచి రక్షణ పొందొచ్చు. ’ అని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు.