human life total dustrubed బంధాలు తెగి.. బతుకులు కూలి!
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:07 AM
human life total dustrubed ఆ బంధం ఒకరి ప్రాణం తీస్తే.. కట్టుకున్న వారి అనుమానం మరొకరిని కాటేస్తోంది. పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతుంటే.. నూరేళ్ల దాంపత్యాలు అంతమై పోతున్నాయి. పక్కింటి పరిచయాలు, సెల్‌ఫోన్ బంధాలు.. కాపురాల్లో కలతలు రేపి దారుణాలకు దారితీస్తున్నాయి. తప్పు ఒకరిది, క్షణికావేశం మరొకరిది. నడిరోడ్డుపై నిలబడేది అభంశుభం ఎరుగని చిన్నారులు.
బంధాలు తెగి.. బతుకులు కూలి!
పచ్చని సంసారాల్లో ‘సంబంధాల’ చిచ్చు
వివేచన కోల్పోయి క్షణికావేశంలో హత్యలు
వివాహేతర సంబంధాలతోనే అత్యధికం
అనాథలవుతున్న ఎందరో చిన్నారులు
ఆ బంధం ఒకరి ప్రాణం తీస్తే.. కట్టుకున్న వారి అనుమానం మరొకరిని కాటేస్తోంది. పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతుంటే.. నూరేళ్ల దాంపత్యాలు అంతమై పోతున్నాయి. పక్కింటి పరిచయాలు, సెల్‌ఫోన్ బంధాలు.. కాపురాల్లో కలతలు రేపి దారుణాలకు దారితీస్తున్నాయి. తప్పు ఒకరిది, క్షణికావేశం మరొకరిది. నడిరోడ్డుపై నిలబడేది అభంశుభం ఎరుగని చిన్నారులు.
జిల్లాలో వెలుగు చూస్తున్న దంపతుల హత్యలు, దారితప్పిన సంబంధాల ఉదంతాలు తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు 17 నాటికే 12 హత్యలు జరగడం.. అందులోనూ అత్యధికం వివాహేతర సంబంధాల నేపథ్యమే కావడం ఆందోళన కలిగిస్తోంది. దారి తప్పిన పెద్దల క్షణికావేశానికి.. కన్నవారి ప్రేమ, నీడ రెండూ కోల్పోయి అనాథలుగా మారుతున్న చిన్నారుల రోదనలు గుండెలను పిండేస్తున్నాయి.
- ఈ నెల 15న పూసపాటిరేగ మండలం పెద్దనడిపల్లిలో వివాహిత దారుణ హత్యకు గురైంది. గ్రామానికి చెందిన బంగారుబాబు ఆమెను హతమార్చాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగింది. దీంతో తల్లి ప్రేమకు ఇద్దరు చిన్నారులు శాశ్వతంగా దూరమయ్యారు. వారికి తల్లి లేని లోటును ఎవరూ తీర్చలేరు.
- జూలై8న జామి మండలం అలమండలో కూడా ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. ఒడిశాకు చెందిన సంజయ్ బెహరా స్థానికంగా వంట మనిషిగా పనిచేసేవాడు. భార్యను నిత్యం అనుమానంతో వేధించేవాడు. ఈ నేపథ్యంలోనే హత్యచేసి పరారయ్యాడు. దీంతో వీరి ఏకైక కుమారుడు అనాథయ్యాడు.
- జూలై 2న గరివిడి మండలంలో ఓ గ్రామానికి చెందిన యువతి బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ పేరుతో వివాహమైన ఓ యువకుడు దగ్గరయ్యాడు. ఆ యువతికి నిశ్చితార్థం జరగాల్సి ఉంది. వీరిద్దరి విషయం బయటకు చెప్పేస్తానని పురుగు మందు ఇచ్చి బెదిరించాడు. దీంతో మనస్తాపం చెంది పరుగు మందు తాగి యువతి ఆత్మహత్య చేసుకుంది.
విజయనగరం, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివాహేతర సంబంధాల మాటున, ప్రేమ పేరుతో మోసాలు, హత్యలు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి. క్షణికావేశంలో జరుగుతున్న హత్యలతో చిన్న పిల్లలు అనాథలుగా మారుతున్నారు. కుటుంబాలు సైతం వీధినపడుతున్నాయి. వివాహేతర సంబంధాలు, ఆస్తి తగదాలతో రక్త సంబంధీకులు, కట్టుకున్న భార్యాభర్తలే ఒకరినొకరు హతమార్చుకుంటున్న ఘటనలు జిల్లాలో వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. వీటన్నింటి వెనుక బలమైన వివాహేతర సంబంధాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. భార్య వేరొకరితో సంబంధం పెట్టుకోవడాన్ని తెలిశాక తట్టుకోలేక క్షణికావేశానికి గురై హత్యలకు తెగబడుతున్నారు. ఏ తప్పు అయినా ఆదిలోనే గుర్తించాలి. లేకుంటే పెరిగి పెద్దదై జీవితాన్ని కడతేర్చుతోంది. అడుగడుగునా మోసం చేసేవారుంటున్నారు.. బలహీనతలను అలుసుగా తీసుకుంటున్నారు.. డబ్బు, ప్రేమ అంటూ వల విసురుతున్నారు. ఆ సమయంలో కాస్త ఆలోచిస్తే భవిష్యత్ బంగారుమయం అవుతుంది. లేకుంటే అంధకారమయం అవుతుండడాన్ని చూస్తున్నాం. ఇదే విషయాన్ని మానసికవేత్తలు కూడా చెబుతున్నారు.
బాల్యం ఎలా సాగుతోంది
బంధం బలహీనం కావడం బాల్యంలోనే మొదలవుతోంది. పిల్లలు పాఠశాలల్లో ఎన్ని మార్కులు తెచ్చుకుంటున్నాడో అనే ఆత్రం తప్ప..వారిలో మానవతా విలువలు ఎంతవరకూ ఉన్నాయో గ్రహించలేని స్థితిలో తల్లిదండ్రులు ఉంటున్నారు. గతంలో ఉమ్మడి కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే..పరిష్కారం దిశగా పెద్దలు ఆలోచన చేసేవారు. ఇప్పుడు చిన్న కుటుంబాలు కావడంతో ఎవరి జీవితం వారిది అన్నట్టు తయారైంది. ఏది మంచి? ఏది చెడు? జీవితంలో ఏదైనా సమస్య వస్తే ఎదుర్కోవడం ఎలా? అనేది తెలియడం లేదు. ‘నేను బాగుండాలి. ఇందుకోసం ఏంచేసినా ఫర్వాలేదు’ అన్న ధోరణి సమాజంలో పెరుగుతోంది. ఇదే నేర సంస్కృతికి కారణమని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సెల్‌తో నష్టమే అధికం..
సెల్‌ఫోన్ల వినియోగం పెరిగిన తరువాత ఇటువంటి నేరాలు అధికమయ్యాయన్నది బహిరంగ రహస్యం. సెల్ ఫోన్లను సద్వినియోగం కంటే దుర్వినియోగానికే ఎక్కువగా వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఫోన్లలో పరిచయమైన అపరిచిత వ్యక్తులతో మాటలు కలపడం, సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకోవడంతో ప్రారంభమై అనేక అనర్థాలకు కారణమవుతున్నాయి. వేరే వ్యక్తితో పెట్టుకునే వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. హత్యలకు దారితీస్తున్నాయి. హత్యలకు సహకరించిన వారికీ శిక్షలు పడుతున్నాయి. వారి కుటుంబాలూ వీధినపడుతున్నాయి.
విలువలు పెరగాలి
మనిషిలో మానవతా విలువలు పెరగాలి. అప్పుడే జీవనం సాఫీగా ముందుకు సాగుతుంది. భార్య, భర్త ఇద్దరూ ఇష్టం లేకుండా కలిసి జీవించడం చాలా కష్టం. అందుకే ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకొని వివాహ బంధంతో ఒక్కటవ్వాలి. అలా కాకుంటే పెళ్లి చేసుకున్న తరువాత వారి జీవితంలో వేరేవారు ప్రవేశించడం.. హత్యలకు దారితీయడం జరుగుతోంది. ఆపై పిల్లల భవిష్యత్ కూడా అంధకారమయం అవుతోంది.
- డాక్టర్ సూర్యానారయణ, మానసిక వైద్య నిపుణుడు, విజయనగరం
--------------------------------------------
సంవత్సరం హత్యలు
-----------------------------------------------
2024 12
2025 13
2026 (సెప్టెంబరు-17) వరకూ 12
-------------------------