Kharif ఖరీఫ్ సాగు ఎలా?
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:27 AM
How Will the Kharif Season Fare? పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి. యూరియా, డీఏపీ మినహాయిస్తే.. అధిక శాతం కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో సాగు ఎలా చేపట్టాలో తెలియక ఖరీఫ్ రైతులు తలలు పట్టుకుంటున్నారు.
ఆందోళనలో రైతులు
సేంద్రియ వాడకంపై దృష్టిసారించాలంటున్న అధికారులు
పార్వతీపురం, జూన్14(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి. యూరియా, డీఏపీ మినహాయిస్తే.. అధిక శాతం కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో సాగు ఎలా చేపట్టాలో తెలియక ఖరీఫ్ రైతులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో అత్యధికంగా 28-28 రకంతో పాటు 20-20-0-13, 10-26-26 రకం, 14-35-14 తదతర ఎరువులను రైతులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతో ప్రతి ఎకరాకు వారిపై అదనపు భారం పడనుంది. కాగా పెరిగిన ధరలు మరో రెండు రోజుల్లో అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం పార్వతీపురంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పాత స్టాక్ ప్రాప్తికి ఎరువులను విక్రయిస్తున్నారు.
ఎరువుల వినియోగం ఇలా..
జిల్లాలో ఏటా ఖరీఫ్ సీజన్‌లో కాంప్లెక్స్ ఎరువుల వాడకం 7,500 టన్నుల నుంచి 8 వేల టన్నుల వరకు ఉంటుంది. సేంద్రియ పద్ధతిలో సాగు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నా చాలామంది రైతులు మారడం లేదు. వరి సాగుకు సంబంధించి సకాలంలో యూరియా దొరక్కపోతే ప్రతి ఎకరాకు 50 కేజీల చొప్పున కాంప్లెక్స్ ఎరువులను వినియోగిస్తున్నారు. పత్తిసాగు చేసే వారు ఎకరాకు రెండు నుంచి నాలుగు బస్తాలు, చెరకు రైతులు ఎకరాకు మూడు నుంచి ఐదు బస్తాలు, పామాయిల్ సాగు చేసేవారు ఎకరాకు 10 నుంచి 12 బస్తాలు, అరటి సాగుచేసే రైతులు ఎకరాకు కనీసం 8 బస్తాల చొప్పున కాంప్లెక్స్ ఎరువులను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగిన నేపథ్యంలో వినియోగం తగ్గిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 78,739 హెక్టార్లలో వరి పంట సాగవనున్నట్లు అధికారుల అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 5,840 హెక్టార్లలో పత్తి , 7,388 హెక్టార్లలో చెరకు, 695 హెక్టార్లలో ఆయిల్‌పామ్, 7,530 హెక్టార్లలో అరటి, 3,786 హెక్టార్లలో జీడి మామిడి, 31,503 హెక్టార్లలో చిరు ధ్యానాలు, 1,768 హెక్టార్లలో పలు రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. అయితే ప్రైవేట్ ఎరువుల దుకాణాల ద్వారానే రైతులు కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేయాల్సి వస్తోంది. గత ఏడాది జిల్లాలో సుమారు 250 టన్నుల కాంప్లెక్స్ ఎరువులను మాత్రమే వ్యవసాయశాఖ ద్వారా విక్రయించారు. మరి ఈ ఏడాది ఆశాఖాధికారులు ఏ విధంగా సరఫరా చేస్తారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే 3,600 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు జిల్లాలోని ఎరువులు దుకాణాలకు చేరాయి.
పెరిగిన ధరలు ఇలా..
జిల్లాలో 28-28 రకం ఎరువు 50 కేజీల ధర గతేడాది రూ.1800 ఉండగా ప్రస్తుతం రూ.2,200కు చేరింది. గతంలో రూ.1400 ఉన్న 20-20-0-13 రకం ఎరువు ధర నేడు రూ.2 వేలు పలుకుతోంది. 10-26-26 రకం ఎరువు ధర రూ.1800 నుంచి రూ.2,250కు పెరిగింది. 14-35-14 ఎరువు ధర రూ.1800 నుంచి రూ.2,400కు పెరిగింది. పొటాష్ ధర సైతం రూ.1800 నుంచి రూ.1975కు చేరింది. ఎస్‌ఎస్‌ఈ రకం ఎరువు ధర రూ.500 నుంచి రూ.835కు ఎగబాకింది. కాగా ఆగస్టులో వాటి ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఎరువుల తయారీకి వినియోగించే మన దేశానికి ముడిసరుకు సరఫరా కావడం లేదు. అందుకే వాటి ధరలకు రెక్కలొచ్చాయి.’ అని మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనా రానున్న రోజుల్లో 28-28 రకం ఎరువు ధర బస్తాపై మరో రూ.150 పెరగనుందని చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ధరలు తగ్గించాలి..
అరటి సాగుకు సంబంధించి ఎకరాకు నాలుగు బస్తాల వరకు ఎరువులను వినియోగిస్తున్నా. ప్రస్తుతం వాటి ధరలు పెరగడంతో మాలాంటి రైతులపై అదనపు భారం పడుతోంది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన యాప్ ద్వారా ఎకరాకు రెండు బస్తాల ఎరువులు లభిస్తున్నాయి. అయితే మార్కెట్లో వాటి ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలి..
- ఎం.సింహాచలం, రైతు, సోమినాయుడువలస, కొమరాడ మండలం
=================================
సేంద్రియ ఎరువులను వినియోగించాలి..
కాంప్లెక్స్ ఎరువుల వినియోగాన్ని రైతులు తగ్గించాలి. వాటికి బదులు నానో డీఏపీ, నానో యూరియాను వినియోగిస్తే ఆర్థిక భారం తగ్గుతుంది. ఎకరాకు 40 కేజీల కాంప్లెక్స్ ఎరువులను ఉపయోగించేలా రైతులను చైతన్యపరుస్తున్నాం. సేంద్రియ ఎరువులను వినియోగించుకుంటే రైతులకు మేలు.
- భవానీ శంకర్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి, పార్వతీపురం మన్యం