Share News

అపరాలను అమ్ముకునేదెలా?

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:54 PM

అపరాలను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.

 అపరాలను అమ్ముకునేదెలా?
అపరాలు

- అందుబాటులో లేని కొనుగోలు కేంద్రాలు

- మద్దతు ధర బాగున్నా ఉపయోగం లేని వైనం

- దళారీలు నిర్ణయించిన రేటుకే విక్రయాలు

- నష్టపోతున్న రైతులు

గజపతినగరం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): అపరాలను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర బాగున్నా కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేవు. ఎక్కడో దూరంగా ఉన్న కొనుగోలు కేంద్రాల వద్దకు పంటను తీసుకెళ్లాలంటే ఖర్చు తడిసిమోపెడవుతుంది. దీంతో గ్రామాల్లోకి వస్తున్న దళారులకే రైతులు అపరాలను అమ్ముకుంటున్నారు. వారి చెప్పిన ధరకే పంటను విక్రయించాల్సి వస్తుండడంతో నష్టపోతున్నారు. జిల్లాలో ఈ ఏడాది పెసర పంట 13 వేల హెక్టార్లు, మినుములు 17 వేల హెక్టార్లలో రైతులు సాగు చేశారు. దిగుబడులు కూడా అధికంగా వచ్చాయి. ప్రభుత్వం క్వింటా మినుములు ధరను రూ.7,800గా, క్వింటా పెసలు ధరను రూ.8,768గా ప్రకటించింది. జిల్లాకు సంబంధించి బొబ్బిలి, సంతకవిటి, జామి మండలాల్లో కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒకపక్క దిగుబడులు బాగుండడం.. మరోపక్క గిట్టుబాటు ధర కూడా మంచిగా ఉండడంతో రైతులు సంబరపడ్డారు. అయితే, కొనుగోలు కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాల్లో కాకుండా మారుమూల మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయడంతో పంటను అమ్ముకునేందుకు పాట్లు పడుతున్నారు. రానుపోను రవాణా చార్జీలు అధికంగా ఉండడంతో కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకువెళ్లలేక పోతున్నామని రైతులు వాపోతున్నారు. ఇదే అదునుగా గ్రామాల్లోకి దళారుల వచ్చి పంటను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. క్వింటా దగ్గర రూ.800నుంచి రూ,1000 వరకు రైతులు నష్టపోతున్నారు. వాస్తవానికి రైతులకు వరి కంటే అపరాల సాగు బాగా కలిసివస్తుంది. వరి సాగుకు అధిక పెట్టుబడి అవసరం. ధాన్యం అమ్మితే వచ్చిన డబ్బుల్లో పెట్టుబడులకు చేసిన ఖర్చులను మినహాయిస్తే రైతులకు పెద్దగా లాభం ఉండదు. అదే అపరాల సాగుకు పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. ఇందులో వచ్చిన లాభాలే రైతులను అప్పుల నుంచి గట్టెక్కిస్తాయి. అయితే, ఈ ఏడాది కొనుగోలు కేంద్రాలు దూరంగా ఉండడంతో అపరాలను అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు అందుబాటులో ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై మండల వ్యవసాయ అధికారి కిరణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. ‘రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు బొబ్బిలి, సంతకవిటి, జామి మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతులు ఈ కేంద్రాలకు వెళ్లి అపరాలను అమ్ముకోవాలి. దళారులను నమ్మి మోసపోవద్దు.’అని అన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 11:54 PM