How to Get There? అక్కడకు వెళ్లేదెలా?
ABN , Publish Date - Mar 24 , 2026 | 11:53 PM
How to Get There? జిల్లాలో పశువైద్యశాలలు దయనీయస్థితిలో ఉన్నాయి. పూర్తిగా శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో పశు వైద్యశాలలకు వెళ్లాలంటే పాడి రైతులు భయాందోళన చెందుతున్నారు.
కూలడానికి సిద్ధంగా ఉన్నవి 26
మరమ్మతులకు నోచుకోనివి 43
భయాందోళనలో పశు వైద్య సిబ్బంది, రైతులు
జియ్యమ్మవలస, మార్చి 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పశువైద్యశాలలు దయనీయస్థితిలో ఉన్నాయి. పూర్తిగా శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో పశు వైద్యశాలలకు వెళ్లాలంటే పాడి రైతులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక మరోవైపు సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. జిల్లాలో కూలడానికి సిద్ధంగా 26 భవనాలు ఉన్నాయి. కనీస మరమ్మతులకు నోచనవి 43వరకూ ఉన్నాయి. వీటిపై ఉన్నతాధి కారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని పాడి రైతులు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో సీతంపేట, పాలకొండ, కురుపాం, గరుగుబిల్లి, పార్వతీపురం, సీతానగరం, సాలూరులో పశు వైద్యశాలలు ఉన్నాయి. వాటి పరిధిలో 38 పశు వైద్య చికిత్సాలయాలు (వెటర్నరీ డిస్పెన్సరీలు), 35 గ్రామీణ పశువుల యూనిట్లు (ఆర్‌ఎల్‌యూ)లు ఉన్నాయి. ఈ వైద్య శాలల్లో 2.34 లక్షల మూగజీవాలకు చికిత్స అందిస్తున్నారు. పశు సంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ పర్యవేక్షణలో ఏడుగురు ఏడీలు, వైద్యాధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ వారికి నిలువ నీడ కరువైంది. కురుపాం, పాలకొండ, సీతానగరం పశు వైద్యశాలలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. పార్వతీపురం, బలిజిపేట-2, భామిని-2, పాచిపెంట, మక్కువ, పాలకొండ, గరుగుబిల్లి-2, జియ్యమ్మవలస-2, సీతంపేటలో ఉన్న పశువైద్య చికిత్సాలయాలు, గరుగుబిల్లి ఏవీహెచ్-1 పరిస్థితి కూడా అంతే. సీతానగరం, బలిజిపేట-2, సాలూరు, పాలకొండ, వీరఘట్టం-3 గ్రామీణ పశు వైద్య యూనిట్లు (ఆర్‌ఎల్‌యూ) కూడా శిథిలావస్థకు చేరాయి.
మరమ్మతుల కోసం..
- జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో మరమ్మతులకు నోచుకోని భవనాలు 43 వరకూ ఉన్నాయి. పార్వతీపురం, సీతానగరం పశు వైద్యశాలలతో పాటు నర్సిపురం, తాళ్లబురిడి, కొమ రాడ, మాదలింగి, బీడీ వలస, బలిజిపేట, దోనుబాయి, చినబగ్గ, పెదగొత్తిలి, గుమ్మలో పశు వైద్యశాల భవనాలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. గొరడ, పాచిపెంట, పాంచాళి, మామి డిపిల్లి, బాగువలస పశు వైద్య చికిత్సాలయాలను కూడా బాగు చేయాల్సి ఉంది.
- కన్నంపేట, తూరుమామిడి, కాశీపట్నం, తోణాం, మండ, కేధారిపురం, తాడికొండ, మొం డెంఖల్, హడ్డుబంగి, కుసిమి, గొయిది, పెదపెంకి, బూర్జ, కేఎస్ పురంలో గ్రామీణ పశు యూనిట్లు (ఆర్‌ఎల్‌యూ) మరమ్మతులకు ఎదురుచూస్తున్నాయి.
ప్రతిపాదనలు పంపాం
జిల్లాలో పశు వైద్యశాలల పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక అందించాం. దానికి సంబంధించి నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపించాం.
ఎస్.మన్మథరావు, జేడీ, పార్వతీపురం మన్యం జిల్లా