Share News

How to get Kharif season? ఖరీఫ్‌ గట్టెక్కేదెలా?

ABN , Publish Date - Jun 28 , 2026 | 11:54 PM

How to get Kharif season? ఖరీఫ్‌ సీజన్‌ వచ్చేసింది.. పంట కాలువలు సాగునీటి గలగలతో కళగా కనిపించాల్సిన సమయమిది. కనీసం సాగునీటి ప్రవాహానికి అనుకూలంగా అయినా ఉండాలి.

How to get Kharif season? ఖరీఫ్‌ గట్టెక్కేదెలా?
కాళంరాజపేట గ్రామంవద్ద శిధిలావస్తులో ఎం.ఎన్‌.చానల్‌

ఖరీఫ్‌ గట్టెక్కేదెలా?

దయనీయంగా సాగునీటి కాలువలు

షట్టర్లు శిథిలమై.. పూడికమయమై

నాడు నిర్లక్ష్యం

ఇంకా దృష్టిసారించని ప్రభుత్వం

నిరాశలో అన్నదాతలు

ఖరీఫ్‌ సీజన్‌ వచ్చేసింది.. పంట కాలువలు సాగునీటి గలగలతో కళగా కనిపించాల్సిన సమయమిది. కనీసం సాగునీటి ప్రవాహానికి అనుకూలంగా అయినా ఉండాలి. కానీ షట్టర్లు శిథిలమై.. పూడికమయమై కనిపిస్తున్నాయి. సాగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క కాలువకు మరమ్మతులు చేపట్టింది లేదు. షట్ట్టర్లు దెబ్బతిని నీరు వృథాగా పోతున్నా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించింది. అయితే పాలకవర్గాలు దృష్టిపెట్టడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గజపతినగరం, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి):

సాగునీటి కాలువలు ఎప్పుడో గాడితప్పాయి. కొన్ని సంవత్సరాలుగా పూడికతీతకు నోచుకోవడం లేదు. గట్లు పటిష్టంగా లేవు. నీటి సరఫరాలో కీలకంగా ఉండే షట్టర్లు చాలా చోట్ల శిథిలమయ్యాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులు నీటి సంఘాల ప్రతినిధుల దృష్టికి తీసుకువెళితే వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాగు చేసేందుకు చర్యలు చేపట్టేవారు. వైసీపీ పాలనలో ఆ ఐదేళ్లు కమిటీలకు ఎన్నికలు నిర్వహించలేదు. ఆయా నీటి వనరుల స్థాయిని బట్టి డీఈ, ఈఈ, ఏఈలు అదనపు బాధ్యతలు చూసేవారు. అధికారులు కూడా పూర్తిస్థాయిలో లేక పని ఒత్తిడితో వారు కాలువలను పర్యవేక్షించేవారు కాదు. సాగునీటి విడుదల, తగ్గింపు, హెచ్చింపు, పరిశీలన, పర్యవేక్షణ, నియంత్రణ తదితర ప్రక్రియలన్నీ మరుగునపడ్డాయి

ఫ గజపతినగరం, బొండపల్లి మండలాలకు సంబంధించి ఎంఎన్‌ చానల్‌, బీవీ చానల్‌, 13 వంతుల కాలువ, ఆండ్ర కాలువల ద్వారా సుమారు 40వేల ఎకరాల వరకు పంటలను సాగు చేస్తున్నారు. 13 వంతుల కాలువ, ఎంఎన్‌ చానల్‌ గేట్లు దాదాపు పోయినా పట్టించుకోవడం లేదు. షట్టర్లు చోరీకి గురయ్యాయని, కాలువలు పూడికలతో నిండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు అనుకూలిస్తే చెరువులు నిండనున్నాయి. అయితే చెరువుల మరమ్మతులు, మదుములకు రిపేర్లు చేయకపోవడంతో సాగునీరు వృథా అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉపాధి హామీ పనుల ద్వారా కాలువల్లో పూడికతీత పనులు చేపడుతున్నారు. కొన్ని చోట్ల రైతులే కాలువ పనులు చేపడుతున్నారు. కాగా సాగునీటి సంఘాల చైర్మన్లు సాగునీటికి పూర్వ వైభవం తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

సాగునీరు అందేలా చూడాలి

ఏటా ఖరీఫ్‌, రబీ సీజన్ల ప్రారంభ సమయాల్లో రైతులకు కష్టాలు తప్పడంలేదు. ఈప్రాంత రైతులకు ప్రధానమైన పంట వరి. కానీ సాగునీరు పూర్తిస్థాయిలో అందుతుందో లేదో చెప్పలేం. సాగునీటి సంఘాల ప్రతినిధులు మా సమస్యలపై దృష్టి సారించి రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టాలి.

- రాకోటి రాములు, జిల్లా కార్యదర్శి, కౌలు రైతుసంఘం

ఇబ్బంది లేకుండా చూస్తాం

పంటకాలువల ద్వారా రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటాం. బీవీచానల్‌, ఎంఎన్‌ చానల్‌, 13వంతుల కాలువ మరమ్మతులకు సంబంధించి ప్రతిపాదనలు చేశాం. నిధులు మంజూరు కావాల్సి ఉంది. ఖరీఫ్‌ సీజన్‌లో సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తాం.

- సురేష్‌, ఏఈ, ఇరిగేషన్‌, గజపతినగరం

Updated Date - Jun 28 , 2026 | 11:54 PM