How to Drink This Water? ఈ నీరు ఎలా తాగాలి?
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:37 PM
How to Drink This Water? పాలకొండ నగర పంచాయతీలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. దీంతో ప్ర‘జల’ కష్టాలు రెట్టింపవుతున్నాయి. గత పది రోజలుగా కుళాయిల నుంచి బురద, మురుగునీరు సరఫరా అవుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు.
ఇబ్బందుల్లో నగర పంచాయతీ వాసులు
ప్రజారోగ్యం పట్టదా? అంటూ పెదవి విరుపు
పాలకొండ, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): పాలకొండ నగర పంచాయతీలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. దీంతో ప్ర‘జల’ కష్టాలు రెట్టింపవుతున్నాయి. గత పది రోజలుగా కుళాయిల నుంచి బురద, మురుగునీరు సరఫరా అవుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. ఆ నీటిని తాగలేక.. వినియోగించలేక నానా అవస్థలు పడుతున్నారు.
ఇదీ పరిస్థితి..
- పట్టణంలో రక్షిత పథకాలు తరచూ మొరాయిస్తున్నాయి. దీంతో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. వారంలో రెండు రోజులు కూడా పూర్తిస్థాయిలో నీటి సరఫరా కావడం లేదు. మరమ్మతులు పూర్తయిన తర్వాత కూడా పైపులైన్లు ద్వారా బురద నీరు సరఫరా అవుతోంది. దీనికి తోడు దశాబ్దాల కిందట వేసిన తాగునీటి పైపులైన్లు చాలావరకు మురుగు కాలువల్లో ఉన్నాయి. అయితే అవి తరచూ లీకులవడంతో మురుగునీరు తాగునీటి పైపుల్లోకి చేరుతోంది. దీంతో పట్టణ ప్రజలు ఆ నీటిని తాగలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు విద్యుత్ సరఫరాలో అంతరాయం, నాగావళి నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలతో ఇన్‌ఫిల్టర్ బావుల ద్వారా పుష్కలంగా తాగునీరు సరఫరా కావడం లేదు. మరోవైపు నాగావళి నదికి వరద వచ్చినా ప్రజలకు కలుషిత నీరే శరణ్యమవుతుంది. దీంతో పలువురు రోగాల బారిన పడుతున్నారు.
- నగర పంచాయతీలో ఉదయం కొన్ని కాలనీలు, సాయంత్రం మరికొన్ని కాలనీలకు కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే సుమారు ఐదు నిమిషాల వరకు పూర్తిగా కలుషిత నీరే సరఫరా అవుతోంది. కాగా శివారు ప్రాంతంలోని పబ్లిక్ కుళాయిలకు ద్వారా పూర్తిస్థాయిలో తాగునీటిని సరఫరా చేయలేకపోతున్నారు. పది నిమిషాల పాటు పైపులైన్ల ద్వారా నీరు అందిస్తే ఐదు నిమిషాల పాటు వచ్చే మంచినీటి కోసం సిగపట్లు పడాల్సి వస్తుంది.
ఆర్‌వో వాటర్ ప్లాంట్లను ఆశ్రయిస్తూ..
కుళాయిల ద్వారా సురక్షిత నీరు సరఫరా కాకపోవడంతో పట్టణవాసులు ఆర్‌వో , మినరల్ వాటర్ ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు. దీనితో ఆయా ప్లాంట్ల యాజమాన్యాలు 20 లీటర్ల తాగునీటి క్యాన్ నీటిని రూ.20 నుంచి రూ.40 వరకు వసూలు చేసున్నారు. చేసేది లేక ప్రజలు ఆర్‌వోప్లాంట్ల వద్ద ఆ క్యాన్లను కొనుగోలు చేస్తున్నారు. మరికొంతమంది ఇళ్ల వద్దకే తెప్పించుకుంటున్నారు. మొత్తంగా తాగునీటి కోసం నగర పంచాయతీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రెండేళ్ల వరకు ఇంతేనా..?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణానికి నాన్ అమృత్ పథకంలో భాగంగా సుమారు రూ.72 కోట్లు మంజూరయ్యాయి. అయితే ఆ పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో సురక్షిత నీరు సరఫరా కావాలంటే ఏడాదిన్నర నుంచి రెండేళ్ల పాటు ఎదురుచూడాల్సిందే. ప్రస్తుతం నూతన రక్షిత పథకం పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. అయితే నాలుగు రక్షిత పథకాల నిర్మాణాలు చేపట్టి , పైపులైన్లు అందుబాటులోకి తీసుకొచ్చి కుళాయిలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా పూర్తవ్వా లంటే రెండేళ్లు పడుతుంది. అప్పటివరకు తాగునీటి కష్టాలు తప్పవనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
పైపులైన్ల ఏర్పాటుతో ఇబ్బందులు
నాన్ అమృత్ పథకంలో భాగంగా మంజూరైన రూ.72 కోట్లతో పట్టణంలో కొద్దిరోజులుగా నూతన తాగునీటి పైపులైన్ల ఏర్పాటు పనులు చేపడుతున్నాం. దీంతో ఇబ్బందులు తలెత్తు తున్నాయి. ప్రస్తుత నగర పంచాయతీకి పంపింగ్ అవుతున్న పాత పైపులైన్లను యంత్రాల ద్వారా తీసే క్రమంలో మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో అక్కడక్కడా పైపులైన్లు కట్ అయి మురుగునీరు చేరుతుంది. కొద్దిరోజుల పాటు ఇబ్బందులు తప్పవు. యంత్రాలతో పనులు చేసేటప్పుడు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం.
-నూకరాజు, నగర పంచాయతీ కమిషనర్, పాలకొండ