Share News

How to 'cultivate' without staff సిబ్బంది లేకుండా ఎలా ‘సాగు’నో

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:54 PM

How to 'cultivate' without staff జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. దాదాపు అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. పాత ఖాళీలు భర్తీ చేయకపోగా, ఉద్యోగ విరమణ కారణంగా ఏర్పడే పోస్టులు కూడా అలాగే ఉండిపోతున్నాయి. దీంతో ప్రతి సంవత్సరం ఖాళీల సంఖ్య పెరిగిపోతోంది. విధుల్లో ఉన్న వారు అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది.

How to 'cultivate' without staff సిబ్బంది లేకుండా ఎలా ‘సాగు’నో
తాటిపూడి రిజర్వాయర్‌ స్పిల్‌వే

సిబ్బంది లేకుండా ఎలా ‘సాగు’నో

ప్రధాన ప్రాజెక్టుల్లో అధికారులు, సిబ్బంది కొరత

లస్కర్‌ పోస్టులు దాదాపు ఖాళీ

ఇన్‌చార్జిలపైనే అదనపు భారం

సాగునీటి సరఫరాపై ప్రభావం

విజయనగరం, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. దాదాపు అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. పాత ఖాళీలు భర్తీ చేయకపోగా, ఉద్యోగ విరమణ కారణంగా ఏర్పడే పోస్టులు కూడా అలాగే ఉండిపోతున్నాయి. దీంతో ప్రతి సంవత్సరం ఖాళీల సంఖ్య పెరిగిపోతోంది. విధుల్లో ఉన్న వారు అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. ఆ ప్రభావం నిర్వహణ, సాగు నీటి విడుదల తదితర అంశాలపై పడుతోందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా ఈ ఖాళీలను భర్తీ చేయకపోతే వచ్చే ఖరీఫ్‌, రబీ సీజన్లు ఎలా గడుస్తాయన్నది ఆయకట్టుదారుల ప్రశ్న.

సాగునీటి ప్రాజెక్టుల్లో ఖాళీలిలా..

జిల్లాలో ప్రధానంగా తోటపల్లి, ఆండ్ర, మడ్డువలస, తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టులున్నాయి. అధికారుల సమాచారం ప్రకారం మడ్డువలస ప్రాజెక్టులో ముగ్గురు డీఈలు, 15 మంది అసిస్టెంట్‌ ఇంజనీర్లు ఉండాలి కానీ ముగ్గురు డీఈలు, 12 మంది ఏఈఈలే పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో మరో ఏడుగురు అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఉండేవారు. వారి పదవీ కాలం మార్చితో పూర్తయ్యింది. ఈ ఉద్యోగాలను ప్రభుత్వం రెన్యువల్‌ చేయాల్సి ఉంది. అప్పటి దాకా వీరు చేయాల్సిన పనులు ఎవరు చేస్తారో దేవుడికే ఎరుక.. మడ్డువలస కింద 24,700 ఎకరాల ఆయకట్టు ఉంది.

- తాటిపూడి ప్రాజెక్టులో 15 మంది అధికారులు విధులు నిర్వహించాల్సి ఉంది. అక్కడ ముగ్గురే ఉన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖకు నీరు వెలుతుంది. అలాగే ఆయకట్టు రైతులకూ నీరు ఇవ్వాలి. జిల్లాలో ప్రధాన పర్యాటక కేంద్రంగా కూడా తాటిపూడి ప్రాజెక్టుకు పేరు. ఉద్యోగుల భర్తీని మాత్రం చేపట్టడం లేదు. తాటిపూడి జలాశయం ద్వారా జిల్లాలో 15 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

- తారకరామ ప్రాజెక్టులోనూ అదే పరిస్థితి. ఈ ప్రాజెక్టు కింద పనిచేయడానికి ప్రభుత్వం 3 డీఈ పోస్టులు, 14 ఏఈఈలను మంజూరు చేసింది. డీఈలు ముగ్గురున్నా ఏఈఈలు పది మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇతర సిబ్బంది ఐదుగురు ఉండాలి. ఒక్కరూ లేరు. ఈ విధంగా ప్రధాన ప్రాజెక్టుల్లో ముఖ్యమైన ఇంజనీరింగ్‌ అధికారుల ఉద్యోగాలు ఖాళీగా ఉండడంతో సాగు నీటి సరఫరాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- ఇక నీటి విడుదలలో ప్రధాన పాత్ర పోషించే లస్కర్లు కూడా అవసరమైనంత మంది లేరు. జిల్లాలోని దాదాపు అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో లస్కర్ల కొరత ఉంది. దశాబ్దాల కాలంగా ఈ సమస్య ఉన్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి లేక ఆ పోస్టులు ఎప్పటికీ భర్తీ కావడం లేదు.

ప్రభుత్వానికి నివేదించాం

ప్రధాన ప్రాజెక్టుల్లో అధికారులు, సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవమే. చాలా ప్రాజెక్టుల్లో లస్కర్లు కూడా లేరు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాలు వచ్చిన వెంటనే భర్తీకి చర్యలు చేపడతాం.

- ఎం.వెంకటరమణ, కార్యనిర్వాహక ఇంజనీరు, సాగునీటి విభాగం

Updated Date - Apr 04 , 2026 | 11:54 PM