How much time does it soulation ఎంత ‘టైమ్’ పడుతుందో!
ABN , Publish Date - Apr 27 , 2026 | 12:04 AM
How much time does it soulation మీ ఇంటిపై సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తాం.. పక్కా ధ్రువపత్రాలు అందజేస్తాం.. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేసేస్తాం.. భవిష్యత్‌లో మీకు ఎలాంటి ఇబ్బందులూ రావు.. మీ ఇంటిపై రుణం కూడా పొందవచ్చు.. అంటూ వైసీపీ హయాంలో ఇంటింటికీ అధికారులు వచ్చి, ఒత్తిడి తెచ్చి డబ్బులు కట్టించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.12 కోట్లు వసూలు చేశారు.
ఎంత ‘టైమ్’ పడుతుందో!
నేటికీ ఆచరణకు నోచని వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకం
అందని గృహహక్కు సర్టిఫికెట్
డబ్బులూ తిరిగివ్వలే
శాశ్వత గృహహక్కు పేరుతో నాడు రూ.12 కోట్లు వసూలు
ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులు
మీ ఇంటిపై సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తాం.. పక్కా ధ్రువపత్రాలు అందజేస్తాం.. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేసేస్తాం.. భవిష్యత్‌లో మీకు ఎలాంటి ఇబ్బందులూ రావు.. మీ ఇంటిపై రుణం కూడా పొందవచ్చు.. అంటూ వైసీపీ హయాంలో ఇంటింటికీ అధికారులు వచ్చి, ఒత్తిడి తెచ్చి డబ్బులు కట్టించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.12 కోట్లు వసూలు చేశారు. ఇది జరిగి రెండేళ్లు దాటింది. హక్కూ లేదు.. పత్రం లేదు. తిరిగి డబ్బులూ ఇవ్వలేదు. వన్‌టైమ్ సెటిల్‌మెంట్(ఓటీఎస్) కోసం డబ్బులు కట్టిన వారంతా తలలు పట్టుకుంటున్నారు. తమకు న్యాయం జరగడానికి ఇంకా ఎంత టైమ్ పడుతుందోనని మథనపడుతున్నారు.
రాజాం/నెల్లిమర్ల, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఓటీఎస్ పథకం బోగస్‌గా మారింది. దశాబ్దాల కిందట(1983 నుంచి 2011 వరకూ) నిర్మించిన ఇళ్లకు కొలతలు తీసి సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తామని వైసీపీ ప్రభుత్వం నమ్మబలికింది. జిల్లాలో రూ.120 కోట్లు వసూలు చేయాలని అప్పట్లో టార్గెట్ పెట్టుకుంది. కానీ గృహ యజమానులు ముందుకు రాలేదు. అధికారులు బలవంతం పెట్టేసరికి చాలామంది అయిష్టంగానే సొమ్ము చెల్లించారు. ఈ విధంగా జిల్లాలో రూ.12 కోట్ల వరకూ వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇంటిపై శాశ్వత హక్కు ఉంటుందని.. బ్యాంకు రుణాలు తీసుకోవచ్చునని చెప్పుకొచ్చారు. కానీ తరువాత ముఖం చాటేశారు. హక్కుపత్రాలు ఇవ్వలేదు సరికదా.. తిరిగి నగదు కూడా చెల్లించలేదు.
నాలుగు కేటగిరీలుగా..
అప్పట్లో లబ్ధిదారులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. కేటగిరి ఏ కింద లబ్ధిదారుడు గృహనిర్మాణ సంస్థ నుంచి అప్పుగా తీసుకొని ఉండి మృతిచెందితే.. వారి వారసులకు పట్టా అందిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు ఉంటే రూ.10 వేలు, మునిసిపాల్టీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్‌లో రూ.20 చొప్పున వసూలు చేశారు. కేటగిరి బికి సంబంధించి రుణం తీసుకున్న వ్యక్తి నుంచి ఇతరులు ఆ ఇంటిని కొనుగోలు చేసి ఉంటే క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశమిచ్చారు. ఇందుకుగాను గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలు, మునిసిపాలిటీల్లో రూ.30 వేలు, కార్పొరేషన్ పరిధిలో రూ.40 వేలు వసూలు చేశారు. కేటగిరికి సీకి సంబంధించి ప్రభుత్వ రుణం పొందకుండా.. సొంతంగా ఇంటిని నిర్మించుకున్నవారి నుంచి రూ.10 వేలు చొప్పున వసూలు చేశారు. కేటగిరీ డి కింద ప్రభుత్వం పట్టా ఇచ్చిన తరువాత.. దానిని అమ్ముకుంటే కొనుగోలు చేసిన వారు...గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, మునిసిపాల్టీల్లో రూ.15వేలు, కార్పొరేషన్‌లో రూ.20 వేల వంతున వసూలు చేశారు.
వసూలు ఇలా..
జిల్లా వ్యాప్తంగా అధికారులు, సచివాలయ సిబ్బంది బలవంతంగా వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. జిల్లాలో 1983-2011 మధ్య 3,44,278 మంది ఇళ్లు నిర్మించుకున్నట్లు అప్పట్లో గుర్తించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు 3,13,714 మంది ఉండగా.. పట్టణ ప్రాంతాలకు చెందిన 30,564 మందిని గుర్తించగలిగారు. వీరి వద్ద నుంచి రూ.120 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ జిల్లా వ్యాప్తంగా ఒత్తిడి చేసి రూ.12 కోట్లు వసూలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
అందరూ బాధితులే..
ఓటీఎస్ విషయంలో ఒక్క లబ్ధిదారులే కాదు.. అధికారులు, సచివాలయ సిబ్బంది అందరూ బాధ్యులే. ఇంతవరకూ లబ్ధిదారులకు సరైన డాక్యుమెంట్లు ఇవ్వలేదు. పేదల పింఛన్లు తొలగిస్తామని, సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని అప్పట్లో బెదిరించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ముడిపెట్టారు. రుణాలు తీసుకున్నవారు తప్పకుండా రిజిస్ర్టేషన్ చేసుకోవాల్సిందేనని ఒత్తిడి పెంచారు. డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నవారితో రుణాలు ఇప్పించి మరీ రిజిస్ర్టేషన్లు చేయించారు. కానీ ఇప్పటికీ డాక్యుమెంట్లు ఇవ్వలేదు. కొందరికి ఇచ్చినా అందులో వివరాలు తప్పుగా నమోదయ్యాయి. అప్పట్లో టార్గెట్లు పూర్తిచేయని సచివాలయ సిబ్బందిపై వేటు కూడా వేసిన సందర్భాలున్నాయి. ఇంత చేసినా లబ్ధిదారులకు మాత్రం న్యాయం చేయలేకపోయారు. కనీసం కూటమి ప్రభుత్వమైనా దృష్టిపెట్టాలని వారు కోరుతున్నారు.
డబ్బులు వసూలు చేశారు
పి.గణేష్, లబ్ధిదారుడు, రాజాం
అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేస్తామని రూ.10 వేలు కట్టించుకుంది. డబ్బులు చెల్లించి ఏడాది అవుతున్నా ఇంతవరకు క్రమబద్ధీకరణ ధ్రువపత్రంగాని కట్టిన డబ్బులు గాని తిరిగి చెల్లించలేదు. పలు పర్యాయములు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం కనిపించలేదు.
ప్రభుత్వ పరిధిలోని అంశం
మురళీమోహన్, గృహనిర్మాణ శాఖ అధికారి, విజయనగరం
గత ప్రభుత్వం శాశ్వత గృహ హక్కు పథకం పేరిట వసూలు చేయడం వాస్తవమే. కానీ అప్పట్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు పత్రాలు అందించాం. కొందరికి వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇది ప్రభుత్వ పరిధిలోని అంశం. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం.