Share News

How much has changed! ఎంతలా మార్చేశారో!

ABN , Publish Date - Mar 24 , 2026 | 12:00 AM

How much has changed! జిల్లాలో చాలా చోట్ల డీపట్టా భూములు పేదల చేతుల్లో కాకుండా పెద్దల చేతుల్లో ఉన్నాయి. వాటిని పొందినది పేదలై అయినప్పటికీ వారిని మభ్యం పెట్టి కాని, డబ్బు ఎర చూపి కాని స్వాధీనంలోకి తీసుకున్న ఘటనలు కోకొల్లలు. ఆపై జిరాయితీగా కూడా మార్చేస్తున్నారు.

 How much has changed! ఎంతలా మార్చేశారో!
డీపట్టా స్ధలంలో కోనసాగుతున్న నిర్మాణాలు

ఎంతలా మార్చేశారో!

పెద్దల చేతుల్లోకి పేదల భూములు

పాఠశాల, ఇళ్ల నిర్మాణం

చురుగ్గా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం

పట్టించుకోని అధికారులు

జిల్లాలో చాలా చోట్ల డీపట్టా భూములు పేదల చేతుల్లో కాకుండా పెద్దల చేతుల్లో ఉన్నాయి. వాటిని పొందినది పేదలై అయినప్పటికీ వారిని మభ్యం పెట్టి కాని, డబ్బు ఎర చూపి కాని స్వాధీనంలోకి తీసుకున్న ఘటనలు కోకొల్లలు. ఆపై జిరాయితీగా కూడా మార్చేస్తున్నారు. ఇంకొంత మంది ఘనులు శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలాంటి వ్యవహారమే జామిలో తాజాగా చురుగ్గా సాగుతోంది. డీపట్టా భూముల్లో పాఠశాల భవనం, భవంతులు నిర్మించేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా చేస్తున్నారని సమాచారం.

జామి, మార్చి 23(ఆంధ్రజ్యోతి):

మండల కేంద్రమైన జామిలో జాతీయ రహదారికి కొద్దిదూరంలో భారీ భూ దందా జరుగుతోంది. ఇక్కడ చాలా సంవత్సరాల కిందటే పేదల నుంచి అనధికారికంగా కొనుగోలు చేసిన డీపట్టా భూములను ఇప్పుడు వాణిజ్య భూములుగా మార్చేశారు. ఎంతలా అంటే ఆ భూముల్లో ప్రైవేటు పాఠశాలతో పాటు భవనాలూ నిర్మించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని కూడా చురుగ్గా చేస్తున్నారు. సెంటు రూ.3లక్షలకు విక్రయిస్తున్నారని తెలిసింది.

ప్రభుత్వం గతంలో సర్వేనెంబర్‌ 502-1లో ఎకరా 48సెంట్ల భూమిని కొంతమంది పేదలకు కేటాయించింది. పదేళ్ల క్రితం వరకు ఆ భూముల్లో సాగు చేసేవారు. వీటిపై కొంతమంది పెద్దల కన్ను పడింది. పేదలకు ఎంతోకొంత డబ్బులు చేతిలో పెట్టి ఎకరా 48సెంట్లను చేజెక్కించుకున్నారు. ఆ తర్వాత ఆ భూముల్లో ఓ ప్రైవేటు పాఠశాల భవనం నిర్మించారు. ఇతర చోట్ల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అదే సమయంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా సాగుతోంది. ఇదే సమయంలో ఈ డీపట్టా వెనుక ఉన్న కొండను కూడా చదునుచేసేస్తున్నారు. ఇదిలా ఉండగా డీపట్టా స్థలంలో నిర్మించిన ఇళ్లకు పంచాయతీ అధికారులు పన్ను వసూలు చేయడం విశేషం. పేదలకు బతుకుతెరువు కోసం ప్రభుత్వం కేటాయించిన ఈభూములు ఇప్పుడు ఆక్రమార్కుల చెరలో చిక్కి వారికి రూ.లక్షలు, రూ.కోట్లు కురిపిస్తున్నాయి.

మరోవైపు జామిలో ఏడు కిలోమీటర్ల పరిధి 60 అడుగుల వెడల్పున ఉన్న జాగరం-అన్నంరాజుపేట చానెల్‌ (జేఏ చానెల్‌ ) కూడా ఆక్రమణకు గురవుతోంది. గట్టు స్థలంలో నిర్మాణాలు కూడా చేపట్టేశారు. అదే విధంగా ప్రభుత్వ స్థలాలు, చెరువులు కూడా కబ్జాకోరల్లో చిక్కుకున్నాయి.

ఫ జామి గ్రామంలో అధికంగా ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ స్థానికులకు ఉపయోగపడడం లేదు. అధికంగా ఆక్రమణలకు గురవుతోంది. గతంలో జాతీయ రహదారి పేరుతో శ్మశానం స్థలం ఎకరం హైవేలో అధికారులు కలిపేశారు. అప్పటి నుంచి ఆరేళ్లుగా శ్మశానం సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. అదనపు స్థలం కేటాయించాలని విన్నపాలు ఇస్తూనే ఉన్నారు కానీ అధికారులు పట్టించుకోవడం లేదు.

ఆ భూములను పరిశీలిస్తాం

జామిలో డీపట్టా ఆక్రమణ విషయాన్ని తహసీల్దార్‌ కృష్ణంరాజు వద్ద ప్రస్తావించగా తాను వెంటనే సర్వే బృందాన్ని పంపించి పరిశీలిస్తామని, అక్కడ నిర్మించిన భవనాలకు అనుమతుల విషయంలో మాత్రం పంచాయతీ చూసుకోవాలని చెప్పారు. డీపట్టా భూమి చేతులు మారితే తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, నిబంధనలను అతిక్రమిస్తే ఎవరైనా సరే చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 12:00 AM